BigTV English

Congress Leaders: కాంగ్రెస్‌లో ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?

Congress Leaders: కాంగ్రెస్‌లో ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?

Congress Leaders: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో మంత్రి పదవి దోబూచులాడుతోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని మళ్లీ మొదలైన ప్రచారంతో.. పదవి ఎవరికి దక్కనుందోనని కాంగ్రెస్ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ సారి తప్పకుండా అవకాశం వస్తుందని.. ఆ లక్కీ లీడర్ ఎవరా అని అధికారపక్షం శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం అదే చర్చంట.


ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యేలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని పది శాసనసభ స్థానాల్లో ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు తొలిసారి మంత్రివర్గం ఏర్పడినప్పుడు జిల్లా ఎమ్మెల్యేలకు అవకాశం దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరగడంతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. అయితే అప్పుడు కూడా విస్తరణ జరగకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.


మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్ జిల్లా

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపి రావడంతో .. తిరిగి మంత్రివర్గ విస్తరణపై జిల్లా ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో చెన్నూరు ఎమ్మెల్యే, మాజా ఎంపీ గడ్డం వివేక్, మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావులు సీనియర్ నేతలుగా కేబినెట్ బెర్త్ కోసం నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.

వెంకటస్వామి తనయులుగా వివేక్, వినోద్ లకు గుర్తింపు

దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి తనయులుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డంవినోద్, వివేక్‌లకు అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గేతో వారికి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ వివేక్ బీజేపీ, బీఆర్ఎస్‌లలోకి వెళ్లి రావడం వారికి ఒకింత మైనస్ అంటున్నారు. ఆ క్రమంలో పార్టీ మారకపోవడం తనకు కలిసి వస్తుందని ప్రేమ్‌సాగర్‌రావు భావిస్తున్నారట. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన ఆదివాసీ, దళిత, గిరిజన సభ విజయవంతం, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను సక్సెస్ చేయడం, ఖర్గే మంచిర్యాల సభల బాధ్యతలు సమర్ధంగా నిర్వహించడం తమకు ప్లస్ అవుతుందని ప్రేమ్‌సాగర్‌రావు వర్గం ధీమాగా ఉంది.

ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వివేక్

వివేక్ శాసనసభ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అప్పుడే ఆయన తనకు మంత్రిపదవి ఇవ్వాలనే షరతు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారట. రాష్ట్రవ్యాప్త పరిణామాలను పరిశీలిస్తే దళిత వర్గానికి చెందిన వివేక్ కు అవకాశాలున్నట్టు స్పష్టమవుతోందంటున్నారు. వివేక్, వినోద్ సోదరులు , ప్రేమ్‌సాగర్‌రావు వర్గాల మధ్య సఖ్యత చెడకుండా రాష్ట్ర నాయకత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేస్తే మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది కీలకం కానుంది.

Also Read: మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్స్.. జాతీయ ర్యాంకుల్లో తెలుగు సీఎంలు టాప్

ఆదివాసి కోటాలో వెడమ బొజ్జు పేరు పరిశీలుస్తారా?

మరోవైపు అవకాశం ఉంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పేర్లను పరిశీలించాలన్న ప్రతిపాదనలు అధిష్టానానికి వెళ్లినట్టు తెలుస్తోంది. విశ్వాసంతో కష్టకాలంతో పార్టీతో ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వాలని వినోద్ ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారంట. మరో వైపు ఆదివాసీ కోటాలో భాగంగా వెడమ బొజ్జు పేరు పరిశీలించి, పదవి కట్టబెడితే అందరికీ సమ న్యాయం చేసినట్లవుతుందని ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈసారైనా విస్తరణలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందా? మంత్రి పదివి ఎవరిని వరిస్తుందనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×