E-Paper
Advertisement

ONGC Gas Leak: బ్లో అవుట్ ముప్పు! భయం గుప్పిట్లో కోనసీమ ప్రజలు

ONGC Gas Leak: బ్లో అవుట్ ముప్పు! భయం గుప్పిట్లో కోనసీమ ప్రజలు

ONGC Gas Leak: చమురు నిక్షేపాల వెలికితీత.. కోనసీమ గుండెల్లో చిచ్చు పెడుతోంది. బ్లో అవుట్లతో గుండెకోత మిగులుస్తోంది. వందల ఎకరాల్లో సాగుతున్న తవ్వకాలు.. మందుపాతరల్లా మారుతున్నాయ్. మంటలై ఎగసిపడుతున్నాయ్. భూమి కింద ఉన్న పైపులైన్లు ఎప్పుడు, ఏ విధ్వంసానికి కారణమవుతాయోనన్న భయం.. కోనసీమ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. చమురు తవ్వకాలతో.. ఇక్కడి భూముల్లోనూ దిగుబడి ఘోరంగా పడిపోతోందని రైతులు, వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

బ్లూ అవుట్‌ల ముప్పు ముంగిట కోనసీమ
కోనసీమ అనగానే పచ్చని కొబ్బరి తోటలు, పరవళ్లు తొక్కే గోదావరి, ప్రశాంతమైన పల్లె వాతావరణమే కళ్ల ముందు మెదులుతుంది. ఇప్పుడదే కోనసమీ.. బ్లో అవుట్‌ల ముప్పు ముంగిట నిలబడింది. భూగర్భంలో దాగున్న చమురు, సహజ వాయువు నిక్షేపాలు.. ఈ ప్రాంతానికి సిరిని తేవాల్సింది పోయి.. జనం జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయ్. చమురు నిక్షేపాల తవ్వకాలు ప్రాణాంతకమైన మందుపాతరల్లా మారుతుంటే.. పైపులైన్లు ఎప్పుడు పేలతాయో తెలియని స్థితిలో స్థానిక ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

కోనసీమలో దశాబ్దాలుగా చమురు నిక్షేపాల వెలికితీత
కోనసీమ వ్యాప్తంగా ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో చమురు నిక్షేపాల వెలికితీత దశాబ్దాలుగా కొనసాగుతోంది. పొలాలు, గ్రామాలు, ఇళ్ల మధ్య నుంచి చమురు పైపులైన్లు ఉండటంతో.. ఎప్పుడు, ఏ విస్ఫోటం సంభవిస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన భారీ పేలుడు తర్వాత.. కొన్నాళ్ల పాటు హడావుడి చేసిన చమురు సంస్థలు.. తర్వాత ఎప్పటిలాగే నిర్వహణను పక్కనపెట్టేశాయన్న విమర్శలున్నాయి. ఇప్పుడు.. ఇరుసుమండలో చోటుచేసుకున్న బ్లోఅవుట్‌.. జనావాసాలకు సమీపంలో సంభవించి ఉంటే పరిస్థితేమిటన్న ఆందోళన కోనసీమ వాసుల్లో మొదలైంది.

భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందన్న నిపుణులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో 217 ప్రాంతాల్లో చమురు వెలికితీస్తున్నారు. ఇందులో అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 158 ప్రాంతాల్లో 870 ఎకరాల్లో నిక్షేపాలను వెలికితీస్తున్నారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌లో 20 ప్రాంతాల్లో 125 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతున్నారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌లో 39 ప్రాంతాల్లో 260 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిక్షేపాలను వెలికితీస్తున్నారు. అయితే.. బ్లోఅవుట్‌ లాంటి అంశాలు చాలా చిన్నవని, చమురు, న్యాచురల్ గ్యాస్ నిక్షేపాల వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. రిగ్‌ పేరిట కిలోమీటర్ల మేర తవ్వి.. తిరిగి పూడ్చకుండా వదిలేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

జిల్లా వ్యా్ప్తంగా పూడ్చిన బావులు 61 మాత్రమే!
నిక్షేపాల వెలికితీతకు భూములను గుర్తించి.. రైతుల నుంచి 3 నుంచి 5 ఏళ్లకు లీజు ప్రాతిపదికన తీసుకుంటున్నాయ్ చమురు కంపెనీలు. ఏడాదికి రెండు పంటలకు వచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరాకు 80 వేల నుంచి 85 వేలు, బీడు భూములకు 26 వేలకు పైగా చెల్లిస్తున్నారు. తవ్వకాలు పూర్తయిన తరువాత.. భూములను తిరిగి రైతులకు అప్పగిస్తున్నారు. అయితే.. తవ్వకాలు చేసిన ప్రాంతంలో గోతులను పూర్తిగా పూడ్చి ఇవ్వాలి. ఇది.. ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో.. పూడ్చివేత ఖర్చుల కింద 60 నుంచి 70 వేలు ఇస్తున్నారు. చాలామంది రైతులు.. వీటిని పూడ్చడం లేదు. చమురు నిక్షేపాల వెలికితీత తర్వాత.. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కేవలం 61 బావులను మాత్రమే పూడ్చారు. వాటిలో అమలాపురం డివిజన్‌లో 43, కొత్తపేటలో 12, రామచంద్రపురంలో 6 ఉన్నాయి.

చమురు తవ్వకాల తర్వాత తగ్గుతున్న దిగుబడి
చమురు తవ్వకాల తర్వాత.. తిరిగి రైతులకు అప్పగించిన భూముల్లో.. సాగు ప్రారంభిస్తే ఒక్కసారిగా దిగుబడి తగ్గిపోతోంది. తర్వాత క్రమంగా కొంతవరకు దిగుబడి పెరుగుతోంది. కానీ.. అదే పొలం చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఎకరాకు 35 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. నిక్షేపాల తవ్వకాల తర్వాత కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోతోంది. ఇక.. ఇదే ప్రాంతంలో కొబ్బరి చెట్టుకు 100 కాయలు వచ్చేవని.. చమురు తవ్వకాల తర్వాత 70 కాయలకు తగ్గిందని అధికారులే నిర్ధారించారు. కొబ్బరికాయ సైజు కూడా తగ్గినట్లు తేల్చారు. ఇలా.. చమురు నిక్షేపాల వెలికితీత కోనసీమకు గుండెకోత మిగులుస్తోంది. జిల్లాలో 1255 ఎకరాల్లో కొనసాగుతున్న తవ్వకాలు.. చాప కింద నీరులా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పైపులైన్లు ఎప్పుడు పగిలిపోతాయోనన్న భయం.. ఇక్కడి ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. చమురు తవ్వకాలతో.. భూముల్లో దిగుబడి పడిపోతుండటంతోనూ మరింత ఆందోళన చెందుతున్నారు ఈ ప్రాంత రైతులు.

నెలల తరబడి అదుపులోకి రాని మంటలు
ముఖ్యంగా బ్లో అవుట్ లాంటి ఘటనలు కోనసీమ చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. గతంలో జరిగిన బ్లో అవుట్ ఘటనలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అంతెత్తున ఎగసిపడే మంటలు.. నెలల తరబడి అదుపులోకి రాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు క్షణమొక యుగంగా గడపాల్సి వచ్చింది. గ్యాస్ లీక్‌ వల్ల.. గాలిలో కలిసిన విషవాయులు, కురిసిన చమురు వల్ల ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ఇప్పటికీ.. ఎక్కడ తవ్వకాలు మొదలైనా, ఎక్కడ గ్యాస్ లీక్ వాసన వచ్చినా.. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ్. కోనసీమలో దశాబ్దాలుగా సాగుతున్న చమురు నిక్షేపాల వెలికితీత వల్ల జరుగుతున్న మేలు కంటే.. నష్టమే ఎక్కువని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు.

దేవరపల్లి, నగరం, ఇరుసుమండ.. ప్లేస్ మారుతున్నా.. విధ్వంసం మారడం లేదు. కోట్లు విలువ చేసే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తరలించుకుపోతున్నా.. ప్రజలకు భద్రత కల్పించడంలో మాత్రం అంతా విఫలమవుతున్నారు. చమురు కంపెనీల కార్యకలాపాలతో జరుగుతున్న బ్లో అవుట్‌లు, గ్యాస్ లీకేజీల వల్ల.. ఎప్పుడెలాంటి ఉపద్రవం వస్తుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో కోనసీమ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తవ్వకాలు.. కోనసీమ ప్రాంతంలోని పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. రాబోయే తరాలకు జరిగే నష్టమేంటి?

క్రమంగా దెబ్బతింటున్న ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం
పాతబడిన పైపులైన్లు.. నిర్వహణ లోపాలు.. భూగర్భంలో తుప్పుపట్టిన పైపులు.. తరచుగా లీకేజీలు.. ఎప్పుడు పేలతాయో తెలియని భయాలు.. ఇవన్నీ.. కోనసీమ గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయ్. అనేక గ్రామాల్లో ఇళ్ల మధ్య నుంచే పైపులైన్లు వెళ్లడం మరింత టెన్షన్ పెడుతోంది. కోనసీమ అంటే.. ఆంధ్రా కేరళ అంటారు. కానీ.. చమురు తవ్వకాలు ఇక్కడి ప్రకృతిని, పర్యావరణాన్ని, వ్యవసాయ రంగాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నాయ్. నిరంతర తవ్వకాలు, రసాయనాల వినియోగం వల్ల.. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయ్. భూమిలో తేమ తగ్గి, చమురు జిగటు పేరుకుపోతోంది. వరి, కొబ్బరి పండించే రైతులు దిగుబడి రాక విలవిల్లాడుతున్నారు. చమురు కంపెనీల నుంచి వెలువడే వేడి, కలుషితమైన పొగ వల్ల.. కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని, కాయ సైజు తగ్గిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వందల ఎకరాల్లో సాగుతున్న తవ్వకాల వల్ల సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోవడమే కాదు.. మిగిలిన భూమి కూడా సేద్యానికి పనికిరాకుండా పోతోంది. చమురు, సహజ వాయువు నిక్షేపాల వెలికితీత వల్ల.. స్థానిక పర్యావరణం చిన్నాభిన్నమవుతోంది. జలవనరులు కలుషితం కావడం వల్ల.. చేపలు, రొయ్యల చెరువులు దెబ్బతింటున్నాయి.

అగ్ని గుండంపై ఉన్నట్లుగా భయపడుతున్న కోనసీమ
పచ్చని ప్రకృతికి చిరునామాగా విరజిల్లే ఈ ప్రాంతం ఇప్పుడు అగ్ని గుండంపై ఉన్నట్లుగా భయపడుతోంది. నేల తల్లి గర్భం నుంచి ఎంతో విలువైన సహజ వాయువును, క్రూడ్ ఆయిల్‌ను వెలికితీస్తున్న కంపెనీలు.. అదే నేల మీద బతుకుతున్న మనుషుల ప్రాణాలకు, పర్యావరణాన్ని ప్రమాదంలో పడేశాయి. కనీస భద్రత కల్పించలేకపోతున్నాయి. ఈ తవ్వకాలతో.. కోనసీమ పర్యావరణంపై పడుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. చమురు కంపెనీల డ్రిల్లింగ్ కార్యకలాపాలు.. కోనసీమ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. డ్రిల్లింగ్ సమయంలో వెలువడే విషపూరిత రసాయనాలు, చమురు అవశేషాలు భూమిలోకి ఇంకిపోతున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయ్. గ్యాస్ లీకేజీలు, పైపులైన్ల ద్వారా బయటకొచ్చే ఉద్గారాలు వల్ల.. గాలిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువుల శాతం పెరుగుతోంది. ఇది స్థానిక ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది.

రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు!
కోనసీమలో.. అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని కంపెనీలు చెబుతున్నా, ఆచరణలో మాత్రం అలాంటివేవీ కనిపించడం లేదు. పాతబడిన పైపులైన్లను మార్చకపోవడం, నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయ్. ఈ ప్రాంతంలో.. రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. ఎక్కడ పైపులైన్ పేలుతుందో, ఎప్పుడు మంటలు ఆకాశాన్ని తాకుతాయో తెలియని భయాందోళనతో ప్రజలు బతుకుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే, కాలుష్యం, వరుస ప్రమాదాల వల్ల కోనసీమ నివాసయోగ్యం కాని ప్రాంతంగా మారుతుందనే ఆందోళన మొదలైంది. రాబోయే తరాలు ఈ పచ్చటి ప్రాంతాన్ని వదిలి వెళ్లే దుస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. కోనసీమలోని మడ అడవులు, అరుదైన పక్షులు, జలచరాలన్నీ.. ఈ రసాయన కాలుష్యానికి బలైపోతున్నాయి.

Also Read: టీవీకే పొత్తు ఎవరితో? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం..

ప్రజా భద్రతపైనా కంపెనీలు దృష్టి సారించాలనే డిమాండ్లు
కోట్లు విలువ చేసే సంపదను వెలికితీస్తున్నప్పుడు.. అందులో కొంత భాగమైనా స్థానిక ప్రజల భద్రత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేయాలి. కానీ.. కోనసీమలో జరుగుతున్నది వేరు. ఇక్కడ ప్రజల ఆవేదనను కేవలం నష్టపరిహారంతో తీర్చలేం. కంపెనీలు లాభాల మీద కాకుండా, ప్రజా భద్రతపైనా దృష్టి సారించాలి. పాతబడిన పైపులైన్లను తక్షణమే మార్చాలి. అధునాతన సెన్సార్ల ద్వారా లీకేజీలను ముందే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి రైతులకు తగిన సాయం అందించాలి. ప్రకృతి ఇచ్చిన వనరులను వాడుకోవడం తప్పు కాదు. అయితే.. ఆ ప్రక్రియలో ప్రకృతిని, మనుషులను బలి పెట్టడమే ఆందోళనకరమైన విషయం. అందుకే.. ఈ పరిస్థితులను మార్చాలని కోససీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×