BigTV English

Pakistan Conspiracy Revealed: బయటపడ్డ పాక్ బాగోతం..! వాళ్లు ఏకం కావడం కోసమే మనపై యుద్ధం

Pakistan Conspiracy Revealed: బయటపడ్డ పాక్ బాగోతం..! వాళ్లు ఏకం కావడం కోసమే మనపై యుద్ధం

Pakistan Conspiracy Revealed: సొంత పరపతిని పెంచుకోడానికి.. దేశంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి.. ఎవరైనా దేశాన్నే పణంగా పెడతారా..? సొంత ప్రజల ప్రాణాలను బలి చేస్తారా..? కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిస్సిగ్గుగా అదే పని చేసాడు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం చేసేది లేక చేతులెత్తేశాడు. అవును, ఇది నిజం! అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న వాస్తవం. పాకిస్తాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ.. అక్కడ పెత్తనమంతా ఆర్మీదే అన్నది ఓపెన్ సీక్రెట్. ప్రస్తుతం, అదే ఆర్మీ చీఫ్ భారత్‌తో యుద్ధం కోసం తహతహలాడుతున్నాడు. ఇంతకీ, పాకిస్తాన్ యుద్ధాన్ని ఎందుకు కావాలని అనుకుంటోంది..? పాక్ ఆర్మీ చీఫ్ ఎందుకింత తెగించాడు..? పాక్ లక్ష్యం ఏంటీ..? కశ్మీర్‌లో దాడుల పర్వం అందుకేనా..? లెట్స్ ఫోకస్..


పాకిస్తాన్ యుద్ధం కావాలని కోరుకుంటుందా?

గత కొంత కాలంగా కనిపిస్తున్న పరిణామాలన్నీ చూస్తుంటే.. కచ్చితంగా పాక్ కుట్రలు పరాకాష్టకు చేరుకున్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది. నానాటికీ దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక స్థితి.. తినడానికి కూడా సరైనా తిండి లేక దేశం పడుతున్న కష్టాలు.. అప్పు కోసం అంతర్జాతీయంగా జోలె పట్టాల్సిన అధోగతి.. అంతకుమించి, తీవ్రవాదుల ఒత్తిడి.. ఒకటేంటీ.. అన్ని వైపుల నుండీ పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు పాలు చేసిన తర్వాత.. పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత పీక్స్‌కు వెళ్లింది.


పక్కదేశాన్ని రెచ్చ గొట్టి తెస్తున్న యుద్ధం

మరోవైపు, పాక్ ప్రజాస్వామ్యాన్ని బుల్లెట్లతో ఆడించే.. ఆ దేశ, ఆర్మీ పరపతి కూడా అణగారిపోతోంది. ప్రజలు తీవ్రమైన అసహనంతో అట్టుడికిపోతున్నారు. పాకిస్తాన్‌లో అంతర్గత కలహాలు అదుపుచేయలేని పరిస్థితికి వచ్చాయి. మరి, ఇప్పుడున్న దారి ఏంటీ..? ఒక్కటే, ప్రజల్ని ఏకం చేయాలి. వారిలో దేశభక్తిని రగిలించడానికి.. దేశమంతటినీ ఒకే తాటిపైకి తీసుకురాడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం యుద్ధం! సరిగ్గా.. పాక్ ఆర్మీ చీఫ్ చేసిన చీప్ ప్లాన్ ఇది. పక్కాగా వ్యూహం పన్ని.. పక్కదేశాన్ని రెచ్చ గొట్టి తెస్తున్న యుద్ధం. కశ్మీర్ కేంద్రంగా భారత్-పాక్ మధ్య మరో మృత్యు ఘోషకు సమర శంఖారావం.

పాక్‌లో తీవ్రంగా మారిన సాయుధ తిరుగుబాటుదారులు

యుద్ధంలాగా మరొకటి ఏదీ దేశాన్ని ఏకం చేయలేదు అన్నది చారిత్రక సత్యం. అందుకే, తమ అధికారాన్ని కాపాడుకోడానికి దేశాన్నే పణంగా పెడుతున్నారు పాక్ అధికార గణం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉండటంతో పాటు పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సులలో రెండింటిలో.. సాయుధ తిరుగుబాటుదారులు తీవ్రంగా పెరిగారు. పాక్ సైన్యం ప్రజాదరణ అట్టడుగు స్థాయికి చేరుకుంది. 1971లో తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ విభజన తర్వాత, మరోసారి ఆ దేశ విచ్ఛిన్నానికి సమయం దగ్గరపడింది. అందుకే, ఒక చిన్న యుద్ధం పాకిస్తాన్‌లోని చాలా సమస్యలకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది. అందుకే, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దీనికి ఒడిగట్టారు. ప్లాన్ ప్రకారం.. గత కొంత కాలంగా కశ్మీర్‌లో ఉగ్రదాడుల్ని ఉసిగొల్పారు. ఇటీవలి, ఆయన స్పీచ్ దీన్ని స్పష్టంగా రుజువుచేస్తుంది.

ప్రధాని షెహబాజ్ సమక్షంలోనే జనరల్ మునీర్ వ్యాఖ్యలు

విన్నారుగా.. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే జనరల్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో విదేశాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడిన మునీర్.. రాబోయే రోజుల్లో భారత్‌తో యుద్ధం చేస్తే.. అంతర్జాతీయంగా పాకిస్తానీయులంతా తమకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వేదికను ఎంచుకున్నారని అనడంలో సందేహం లేదు. “కశ్మీర్ సోదరులను పాకిస్తాన్ వదిలేయదనీ.. కశ్మీర్‌పై తమ విధానంలో ఎలాంటి మార్పూ లేదని” చెప్పారు. “కాశ్మీరీ ప్రజల “హీరోయిక్ స్ట్రగుల్”లో పాకిస్తాన్ వారిని విడిచిపెట్టదనీ.. పోరాటం చేసి, కశ్మీర్‌ను కాపాడతామని..” ముందుగానే యుద్ధంపై హింట్ ఇచ్చారు.

‘దాడులు చేసింది స్వాతంత్ర్య సమరయోధులు..’ -పాక్ డిప్యూటీ పీఎం

అంతెందుకు, తాజా పహల్గామ్ దాడి తర్వాత కూడా.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాన మంత్రి అయిన ఇషాక్ దార్… ఏప్రిల్ 25న ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. “ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో దాడులు చేసిన వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులు కావచ్చు” అని అన్నారు. సో.. వీళ్లద్దరి మాటల్లో.. చాల స్పష్టంగా భారత్‌పై వ్యతిరేకత.. కశ్మీర్‌పై కపట ప్రేమ కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. తమ దేశంలో సమస్యలను తగ్గించుకోడానికి కశ్మీర్‌ను పావుగా వాడుకుంటోంది పాకిస్తాన్. తాజా పహల్గామ్ దాడి కూడా పాకిస్తాన్ ప్లాన్‌లో భాగం అనడానికి రుజువులు చాలానే ఉన్నాయి.

భారత్ స్పందన తీవ్రత పాకిస్తాన్‌కు తెలుసు

ఇక, పహల్గామ్ మారణహోమానికి భారతదేశం తీవ్రంగా స్పందిస్తుందని భారత్ అగ్ర నాయకత్వం బలంగా చెప్పింది. అయితే, ఎలా, ఎప్పుడు అన్న ప్రశ్నలు మాత్రమే ఇప్పుడు తెలియాల్సి ఉంది. గతంలో.. ఉరి, పుల్వామా ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో పాకిస్తాన్‌కు తెలియంది కాదు. అది చూసి కూడా.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇంతటి సాహసం చేయడం కచ్చితంగా యుద్ధం కోసమే అన్నది స్పష్టంగా తెలుస్తోంది. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి భారత్.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటూనే ఉంది. అయితే, పహల్గామ్ దాడిని చూస్తే.. పాక్ ఉగ్రవాదులు భారతదేశంలో చేసిన దాడులకు కాస్త భిన్నంగా ఉంది.

ముస్లిమేతరులనే లక్ష్యంగా చేసుకోవడం ప్లాన్‌లో భాగం

ఏప్రిల్ 22న, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని ఊచకోత కోశారు ఉగ్రవాదులు. పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఎ-తోయిబా‌ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. దీనికి బాధ్యత వహించింది. ఇక, లష్కర్-ఎ-తోయిబా‌ అగ్ర కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని సమాచారం ఉంది. అయితే, ఇక్కడ పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం.. ముస్లిమేతరులనే లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఈ దాడి ఇటీవలి సంవత్సరాలలో జరిగిన దాడుల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, మతవాదాన్ని రెచ్చగొట్టడంలో భాగంగా కనిపిస్తోంది.

జనరల్ ఆసిమ్ మునీర్ మతతత్వ వ్యాఖ్యలు

ఇటీవలి సంవత్సరాల్లో జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని భారత ప్రభుత్వం చెబుతున్న తరుణంలో.. పర్యాటకం కూడా భారీగా వృద్ధి చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడి పగడ్బంధీ ప్లాన్‌తో జరిగింది. ఈ మారణహోమంతో మాకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ.. పాక్ సైన్యం సహకారం లేకుండా.. జమ్మూ కశ్మీర్‌లో ఈ స్థాయి ఉగ్రవాద దాడి జరగదని అంటున్నారు నిపుణులు. “పాకిస్తాన్‌కు చెందిన ఎస్‌ఎస్‌జి కమాండోలు ఉగ్రవాదులుగా నటిస్తూ ఈ దాడులు చేస్తున్నారు” అని ఇటీవల జమ్మూ కశ్మీర్ మాజీ డిజిపి ఎస్పీ వైద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్లుగానే.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇటీవల రెచ్చగొట్టే విధంగా చేసిన మతతత్వ వ్యాఖ్యలు ఈ దాడిని ఇంత ప్రత్యేకంగా నిలిపింది.

మునీర్ వాడిన హిందూ వ్యతిరేక పదాలే ఇక్కడ ప్రత్యేకం

“ప్రతి అంశంలోనూ మేము హిందువుల నుండి భిన్నంగా ఉన్నామనీ.. మా మతం భిన్నంగా ఉందనీ.. మా ఆచారాలు భిన్నంగా ఉంటాయనీ.. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది” అని జనరల్ మునీర్ అన్నారు. అయితే, గతంలో.. పాకిస్తాన్ సైనికాధికారులు, భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఇలాంటి హిందూ వ్యతిరేక పదాలు వాడటం సాధారణంగా కనిపించలేదు. కానీ, ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. పహల్గామ్ దాడి ఆ ప్రసంగం జరిగిన వారంలోనే జరిగింది. అంటే, భారత్‌లో తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించడానికి.. భారత ప్రభుత్వం చాలా ఘాటుగా స్పందించడానికే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

తాను తీసుకున్న గోతిలో తానే పడిన పాకిస్థాన్

తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు అనే నానుడి బహుశా పాక్ ఆర్మీ చీఫ్‌కి తెలియదేమో.. అందుకే, తలకుమించిన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. అన్ని రకాలుగా నలిగిపోయి ఉంది. దాన్ని కాపాడుకోడానికి మంచి విధానాలను అమలు చేయడం మానేసి.. కుట్రలు పన్నుతూ.. భారతదేశంతో యుద్ధం చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. పాకిస్తాన్ కోలుకోడానికి దశాబ్ధాలు పడుతుంది. ఏ అధికారం కోసం జనరల్ మునీర్, ప్రధాని షరీఫ్ ఆరాటపడ్డారో అది వాళ్లకు దక్కదు. చివరికి పాకిస్తాన్‌కు మిగిలేది చిప్పకూడే..! ఇంత చిన్న లాజిక్‌ని వాళ్లు ఎలా మరిచిపోయారు..?

కశ్మీర్ కోసం ఇప్పటికే మూడు యుద్ధాలు

రెండు అణ్వాయుధ దేశాలు అయిన భారత్, పాకిస్తాన్‌ల మధ్య పూర్తి యుద్ధం జరగదని అంతర్జాతీయంగా ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే, దీని పర్యావసానం మాత్రం భయంకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. దానిని నివారించడానికి ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ తీవ్రంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు దేశాలు.. కశ్మీర్ కోసం ఇప్పటికే మూడు యుద్ధాలు చేశాయి. 1947, 1965, 1999 లలో జరిగిన ఈ యుద్ధాలు.. పాకిస్తాన్ సైన్యమే ప్రారంభించదన్నది చారిత్రక సత్యం కూడా.

ప్రతి యుద్ధంలోనూ భారతదేశానిదే పైచేయి

అయితే, ప్రతి యుద్ధంలోనూ భారతదేశానిదే పైచేయి అయ్యింది. అయితే, ఈసారి పూర్తి స్థాయి యుద్ధం జరగదు.. భారత్‌ది పైచేయే ఉంటుందన్నది పాకిస్తాన్‌కి కూడా తెలియంది కాదు. అందుకే, అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య, అంతకుమించి, భారతదేశ శాంతి సూత్రాల కారణంగా.. మినీ యుద్ధం మాత్రమే జరుగుతుందని జనరల్ మునీర్‌కు తెలుసు. అందుకే, పక్కా ప్లాన్‌తో పాకిస్తాన్ ఆర్మీ పహల్గామ్ దాడుల కుట్ర పన్నింది.

పహల్గామ్‌లో దాడులు చేసిన TRF ఉగ్రవాదులు

ఇక, ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు.. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ భారతదేశంలో ఉన్నప్పుడు.. ఈ దాడి జరిగింది. దీనికి సరిగ్గా వారం క్రితమే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కశ్మీర్ సమస్యను తన ప్రసంగంలో లేవనెత్తారు. ఇదంతా యాదృచ్చికం కాదన్నది చాలా స్పష్టంగా ఉంది. ఇక, పహల్గామ్‌లో దాడులు చేసిన TRF ఉగ్రవాదులు.. జమ్మూ కశ్మీర్‌లోనే పుట్టి పెరిగారనే భ్రమను కలిగించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. దాని నిర్వాహకులు ఇప్పటికీ పాకిస్తాన్‌లో కూర్చుని ఉగ్రవాద కుట్ర పన్నుతున్నారన్నది వాస్తవం.

కశ్మీర్‌ ఉగ్ర కార్యకలాపాల్లో పాక్ ప్రమేయంపై ఎన్నో రుజువులు

మరో అంశం ఏంటంటే.. మార్చిలో బలూచిస్తాన్‌లో జరిగిన రైలు హైజాక్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక-ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలోనే.. ఎటువంటి ఆధారాలు లేకుండానే… బలూచ్ తిరుగుబాటుకు భారతదేశాన్ని నిందించింది పాకిస్తాన్. భారతదేశమే బలూచ్ తిరుగుబాటుదారులకు ఊతం ఇస్తుందంటూ ప్రచారం చేస్తోంది. అయితే, కశ్మీర్‌ ఉగ్ర కార్యకలాపాల్లో పాక్ ప్రమేయం గురించి భారత్ ఎన్నో రుజువులు చూపించింది. అయినా, మాకు ఏమీ సంబంధం లేదని పాక్ బుకాయించింది. ఇప్పుడు కూడా పహల్గామ్ దాడులను సమయం చూసి, అమలు చేసింది. అన్ని విధాలుగా భారత్‌ను అంతర్జాతీయ వేదికలపై నిందించడానికి కుట్రలు పన్నుతుంది.

భారత్‌తో మినీ యుద్ధం వస్తే..

పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో అల్లాడుతోంది. మరోవైపు, బలూచిస్తాన్, ఖైబర్-పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాల్లో తిరుగుబాట్లతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో, భారతదేశంతో ఉద్రిక్తతలను రేకెత్తించడం ద్వారా అసిమ్ మునీర్ తమ దేశంలో ఐక్యతను తీసుకురావాలని భావిస్తున్నారనడానికి ఇంతకుమించిన రుజువులు అవసరం లేదు. అందుకే, భారత్‌తో ఓ మినీ యుద్ధమో లేదంటే, తీవ్రమైన సంఘర్షణో వస్తే.. పాకిస్తాన్‌లో విభిన్న రాజకీయ వర్గాలన్నీ ఏకతాటిపైకి వస్తాయని ప్లాన్ చేశారు. ఇది, పాక్ సైన్యం ప్రజాదరణను కూడా పెంచుతుందని ఆశిస్తున్నారు. ఇది దేశంలోని రాజకీయ, సామాజిక సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక వ్యూహంగా ఉంది.

భారతదేశంతో సంఘర్షణ పాక్ ఆర్మీకి ఆవశ్యకం

పాకిస్తాన్‌లో సైన్యం ఎప్పుడూ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది గనుక.. ఇప్పుడు, దాని ప్రాధాన్యత తగ్గకుండా ఉండాలన్నా.. అసిమ్ మునీర్, పాక్ సైన్యంలో తన ప్రాబల్యాన్ని కాపాడుకోవాలన్నా.. బలహీనమవుతున్న ప్రజాదరణను పెంచుకోవాలన్నా.. దానికి భారతదేశంతో సంఘర్షణ ఆవశ్యకంగా మారింది. ముఖ్యంగా, ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు సైన్యంపై ఒత్తిడిని పెంచిన సమయంలో… ఈ వ్యూహం అత్యవసరం అయ్యింది.

మునీర్ షియా ముస్లిం.. OTS గ్రాడ్యుయేట్‌

నిజానికి, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యక్తిగతంగా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే ఒత్తిడిలో ఉన్నారన్నది కొందరు విశ్లేషకులు అభిప్రాయం. మునీర్ ఒక షియా ముస్లింగా.. అంతగా ప్రాముఖ్యత లేని OTS నుండి గ్రాడ్యుయేట్‌గా వచ్చాడు కాబట్టీ.. అతడు, సున్నీ ఆధిపత్యం చెలాయిస్తున్న పాకిస్తాన్ సైన్యంలో తన స్థానాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధం.. మునీర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

భారతదేశంతో యుద్ధంతోనే మునీర్ నాయకత్వం బలోపేతం

అలాగే, పాక్ సైన్యం ప్రజాదరణను పెంచడానికి కూడా మార్గంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. జనరల్ ఆసిమ్ మునీర్ చర్యలు, పాకిస్తాన్ సైన్యం దీర్ఘకాల వ్యూహంలో భాగంగా కూడా చూడాల్సి వస్తుంది. పాకిస్తాన్.. భారతదేశంతో ఉద్రిక్తతలను కొనసాగిస్తేనే తప్ప.. ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ఆ దేశంలో రాజకీయ, సామాజిక డైనమిక్స్‌ను నియంత్రించే ఛాన్స్ ఉంటుంది. అందుకే, యుద్ధం వాళ్లకు.. మరోసారి పాక్ ప్రజలను మోసం చేయడానికి అవకాశం ఇస్తుందనేది నిపుణులు అభిప్రాయం.

ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్

వాస్తవానికి, భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటే.. దాని భవిష్యత్తుపై భారీ ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక వ్యవహారాల్లో పాకిస్తాన్‌కు ప్రతీకూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మారక నిల్వలు, రుణ భారంతో బాధపడుతోంది. ఇక, యుద్ధమే వస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంద. సైనిక ఖర్చులు విపరీతంగా పెరిగి, విదేశీ సహాయం.. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే, అంతర్జాతీయ సంస్థలు యుద్ధంలో ఉన్న దేశానికి రుణాలు ఇవ్వడానికి ఇష్టపడవు. ఇక, యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం కూడా స్తంభిస్తుంది.

పాకిస్తాన్ పునర్నిర్మాణానికి దశాబ్దాలు పట్టొచ్చు

ముఖ్యంగా, చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఇలా, విదేశీ పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయి, దీర్ఘకాల ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది. ఇక, భారతదేశ బలమైన సైనిక సామర్థ్యం.. ముఖ్యంగా వైమానిక దాడులతో పాకిస్తాన్ మౌలిక సదుపాయాలైన, విమానాశ్రయాలు, రహదారులు, రైల్వేలు సర్వనాశనం అవుతాయి. ఇలా జరిగితే.. పాకిస్తాన్ పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది. ఈ లోపు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కానీ… యుద్ధాన్ని ఉసిగొల్పిన జనరల్ మునీర్ కానీ అధికారంలో ఉండరు. కానీ, యుద్ధం చేసిన గాయాలు మాత్రం పాకిస్తాన్‌ను సజీవంగా కాల్చుకుతింటాయి. ఇంత చిన్న లాజిక్ మరిచిపోయిన పాకిస్తాన్.. ఎందుకు ఈ కుట్ర పన్నిందోననే సందేహాలు ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×