బేరం కుదర లేదు కదూ.. ఇదేంటి ఇది పోకిరి సినిమాలో డైలాగ్ కదా అని అనుకుంటున్నారా?.. మీరు అనుకున్నది నిజమే.. అది సినిమా డైలాగే .. అయితే ఇప్పుడేందుకు ఆ డైలాగ్ గుర్తు చేయాల్సి వచ్చింది అంటే దానికీ ఓ రీజన్ ఉంది .. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో తాజా పరిస్థితులు అచ్చం ఈ డైలాగ్ కి సూట్ అవుతున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది . పార్వతీపురం సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య బేరం కుదిరినట్లే కుదిరి.. మళ్లీ బెడిసి కొట్టిందంట. అందుకే నిన్న మొన్నటివరకు అలయ బలయ్ అంటూ చేసిన సీక్రెట్ ఫ్రెండ్ షిప్‌కి కూడా గండిపడిందంటున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురంలో టీడీపీ నుండి ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుపై గెలిచారు . అయితే ఈ ఎన్నికలకు ముందు జోగారావు పై పలు భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి . పార్వతీపురంలో ప్రధాన చేరువులైన దేవునిబంద , బిల్లలబంద చెరువులను జోగారావు ఆక్రమించారని విమర్శలు వెల్లువెత్తాయి . ఎన్నికల ప్రచారంలో విజయ్‌చంద్ర కూడా దానినే ప్రధాన అస్త్రంగా తీసుకొని విమర్శలు ఎక్కుపెట్టారు . కబ్జా కు గురైన చెరువులను మరలా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు .
అయితే ఎన్నికలు గడిచి ఎనిమిది నెలలు పూర్తి అయినా ఎమ్మెల్యే విజయ్ చంద్ర కబ్జాలపై నోరు విప్పడం లేదు . దాంతో నియోజకవర్గంలో విజయ్ చంద్రపై పలు విమర్శలు వస్తున్నాయి . అవినీతిని తవ్వి తీస్తామన్న నాయకుడు గెలిచాక ఆ ఊసే ఎత్తకపోతుండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కొందరు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చిందట . ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య డీల్ కుదిరిందని, మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆక్రమణలపై నోరు మెదపకుండా ఉండేందుకు సెటిల్ మెంట్ కి వచ్చారనే ఆరోపణలు గట్టిగానే వినిపించాయి.
Also Read: కూటమి స్కెచ్.. విశాఖలో వైసీపీకి షాక్
అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభనలో భాగంగా ఎలాగూ పార్వతీపురం రిజర్వేషన్ మారుతుంది కాబట్టి ఇద్దరికీ ఈ స్థానం శాశ్వతం కాదు.. సో.. ఓ అండర్‌స్టాండింగుకి వస్తే మంచిదని జోగారావు.. విజయ్ చంద్రకి ఉచిత సలహా ఇచ్చారట . అందుకే టీడీపీ ఎమ్మెల్యే ఇంత కాలం మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై సైలెంట్ అయ్యారంట. వారిద్దరి మధ్య సెటిల్‌మెంట్ కుదిరిందనుకుంటున్న తరుణంలో .. మరి ఎక్కడ బెడిసికొట్టిందో , ఎక్కడ తేడా కొట్టిందో ఏమో గానీ మళ్ళీ దూరం దూరం అంటున్నారట.
అయితే అనుకున్నట్లు డీల్ కుదరకపోవడం వల్లనే మళ్ళీ డిస్టెన్స్ మెయిన్టైన్ చేస్తున్నారని , కథ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది . మరి బేరం కుదరలేధు కాబట్టి మళ్ళీ భూ కబ్జాల ఆరోపణలపై విచారణ తెర మీదకు వస్తుందో? లేక మధ్యవర్తిత్వం ద్వారా మరోసారి సెటిల్‌మెంట్ అవుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . మొత్తమ్మీద ప్రజలు వారి వాలకం చూస్తూ.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ జీవితాలు మారుస్తారని నాయకులను ఎన్నుకుంటే , వారి స్వలాభాల కోసం తమ జీవితాలను పణంగా పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. మరి పారదర్శక పాలన అంటున్న కూటమి ప్రభుత్వం పార్వతీపురంలో కుమ్మక్కు రాజకీయాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.