BigTV English

Pastor Praveen Pagadala: క్రైస్తవుల్లో అలజడి.. ప్రవీణ్ కేసు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

Pastor Praveen Pagadala: క్రైస్తవుల్లో అలజడి.. ప్రవీణ్ కేసు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్ పగడాల

ప్రముఖ క్రైస్తవ నేత, ప్రసిద్ధ పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 25న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆ రోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళుతుండగా, గుర్తుతెలియని వాహనం ఆయన్ను ఢీకొట్టిందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇది ప్రమాదమని అనుకుంటున్నప్పటికీ.. ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ పగడాల మృతి సాధారణంగా జరిగినే ప్రమాదమేనా.. లేదంటే, పథకం ప్రకారం చేసిన హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్న క్రైస్తవ సమాజం

అయితే ఈ ఘటనపై రాజమండ్రి పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. ప్రవీణ్ పగడాల మృతి వెనుక అసలు కారణాలను వెలికితీయాలని, న్యాయ సమగ్ర దర్యాప్తు జరపాలని అనేక మంది పాస్టర్లు, మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ, పూర్తి విచారణ చేపట్టాలని కోరుతున్నారు. అంతవరకూ పరిస్థితి మామూలుగానే ఉన్నా… ఈ మరణం మరింత పెద్ద ప్రభావాన్ని చూపించింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రవీణ్ శరీరంపై గాయాలు, పెదాలపై గాయాలు..

విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తూ బుల్లెట్‌‌పై ప్రయాణిస్తున్న ఆయన రాజానగరం సమీపంలో రోడ్డుపక్కన అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు ఆయన మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రవీణ్ శరీరంపై గాయాలు, పెదాలపై గాయాలు, ఇనుప రాడ్డు లాంటి వస్తువుతో దాడి చేసినట్లున్న ఉన్న గుర్తులు.. అనుమానాలకు తావిచ్చింది. ఇది కచ్ఛితంగా హత్యే అనే తీరులో మృతదేహం ఉంది. ప్రవీణ్‌ను ఎవరో చంపి అక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు, అనుచరులు ఆరోపించారు. సామాజిక సేవలో నిమగ్నమై ఉన్న ఆయన.. తాను నమ్మిన క్రైస్తవం ఆధారంగా ఉన్న సత్యాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, సూటిగా మాట్లాడే వ్యక్తి.

పోలీసులు తగిన రక్షణ కల్పించలేకపోయారని ఆరోపణలు

ఆయన బోధనలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులతో పాటు.. ఆయన్ను చంపేస్తామని బెదిరించిన ఎన్నో సందర్భాలు పోలీసులకూ తెలియకపోలేదు. అయితే, ప్రవీణ్ మరణానికి రోడ్డు ప్రమాదమే కారణమని పోలీసులు వాదించడం ప్రారంభించారు. తనకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ ఇటీవల ఓ వీడియోలో పేర్కొన్నారనీ.. అయినప్పటికీ, పోలీసులు తగిన రక్షణ కల్పించలేకపోయారని ఆయన అనుచరులు ఆరోపించారు. అప్పటికే, ఎన్నో అనుమానాలతో ఉన్న ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ కేసును ఖచ్చితంగా పరిశీలించాలని పట్టుబట్టారు.

పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా మరింత స్పష్టత

అయితే, ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పోస్ట్ మార్టమ్ నివేదిక ఆధారంగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంతా అనుకుంటున్న తరుణంలో.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టతా లేకపోవడం వల్ల ఇది ప్రమాదమా? హత్యా? అనే అనుమానం ఇంకా కొనసాగుతోంది. ఈలోపే ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో క్రైస్తవులు, ఆయన అనుచరులు ధర్నా చేపట్టారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, మతోన్మాదుల దాడిగా భావిస్తున్నామని ఆరోపించారు.

ఎప్పుడూ లేనంతగా ఒక పాస్టర్ మృతికి ఇంత స్పందన

రాజమండ్రిలో ఆయన మృతదేహాన్ని చూడటానికి వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అప్పటికే, దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని యావత్ క్రైస్తవ సమాజానికి ఈ వార్త దావానంలో వ్యాపించింది. తమ పాస్టర్‌ను దారుణంగా కొట్టి చంపారనే వార్తను నమ్మిన క్రైస్తవులు.. సమరం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితం, రాజమండ్రి నుండి హైదరాబాద్ చేరుకున్న ప్రవీణ్ పార్థీవ దేహాన్ని చూడటం కోసం.. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వేలాది మంది తరలి వచ్చారు. అయితే, గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక పాస్టర్ మృతికి ఇంత స్పందన రావడం ఆశ్చర్యాన్ని కాదు.. ఆందోళనకు కారణం అయ్యింది.

ఇది కచ్ఛితంగా హత్యనన్న కేఏ పాల్

పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలకు హాజరైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఇతర క్రైస్తవ మత పెద్దలు కూడా ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా పాస్టర్ ప్రవీణ్‌కు కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన మరణం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కుమార్ సైతం ఈ మరణంపై అనుమానాలున్నాయనే విధంగా మాట్లాడారు. దోషుల్ని పట్టుకోవాలనీ.. దానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నయని అన్నారు.

ఇది కచ్ఛితంగా హత్యనన్న కేఏ పాల్

అయితే, ఈ వ్యవహారంపై, కేఏ పాల్ మాటల్లో తీవ్రమైన ఉద్రేకం కనిపించింది. ఇది కచ్ఛితంగా హత్యననీ.. పోలీసులు అబద్దాలు చెబుతున్నారనీ.. మేము గాజులేసుకోని కూర్చేలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల్ని, ముస్లీంలను చంపేస్తారా అంటూ ఘాటుగా స్పందించారు.

క్రైస్తవులే టార్గెట్‌గా మతఘర్షణలు జరిగాయనే భావన

అయితే, ఈ ఆందోళన ఇంతటితో ఆగే విధంగా కనిపించట్లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణం యావత్ మైనారిటీ కమ్యూనిటీపై తీవ్రమైన ప్రభావం చూపే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపమనే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో మణిపూర్ అల్లర్ల తర్వాత భారతదేశంలో క్రైస్తవులపై దాడుల అంశపై ఫోకస్ వచ్చింది. మణిపూర్ అల్లర్లు జాతి వివాదం కాదనీ.. క్రైస్తవ దేవాలయాలే టార్గెట్‌గా.. క్రైస్తవులే టార్గెట్‌గా మతఘర్షణలు జరిగాయని ఇంకా చాలా మంది క్రైస్తవులు నమ్ముతున్నారు. తర్వాత, ఢిల్లీలో జరిగిన ఘటన.. యూపీలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు.. ఇలాంటివన్నీ ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా క్రైస్తవ సమాజంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా, రాబోయే రోజుల్లో ఇది అతి పెద్ద ఉద్యమంగా మారుతుందనే సంకేతాలు ఉన్నాయి.

ప్రవీణ్ కేసు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మార్పులు చెందుతూనే ఉంటుంది. మతాచారాలు కూడా మారుతూనే వస్తున్నాయి. కానీ, మనిషి మాత్రమే ఇంకా ఛాందస భావాలతో మగ్గిపోతున్నాడు. అందుకే, ఇలాంటి పరిస్థితి వస్తోంది. పాస్టర్ ప్రవీడ్ పగడాల మరణం ఒక్క విషయాన్ని చాలా గట్టిగా ప్రకటించింది. దేశంలో జరుగుతున్న మత హింసను మరోసారి బయటపెట్టడమే కాకుండా.. దీనికి పరిష్కారం కనుక్కోడానకి మరో అవకాశాన్ని ఇచ్చింది.

పక్కా ప్రణాళికతో హత్య చేశారన్న వైఎస్ షర్మిళ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మరణంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించారు. అది హత్యే అని చెప్పడానికి సంఘటనా స్థలంలో అనేక ఆధారాలు కనిపించాయని అన్నారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదంటున్న క్రైస్తవులు

ప్రవీణ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, తోటి పాస్టర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో షర్మిల వ్యాఖ్యలు అనుమానాలను మరింత తీవ్రం చేశాయి. ప్రవీణ్ మృతిపై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేసేలా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. అయితే, బ్రదర్ అనీల్ భార్య, క్రైస్తవులుగా మారిన వైఎస్ కుటుంబ సభ్యురాలైన షర్మిల నుండి ఇలాంటి స్పందన రావడం.. మరింత మంది క్రైస్తవులకు బలంగా మారింది. న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదనే స్థాయిలో క్రైస్తవులు భీష్మించుకు కూర్చున్నారు. క్రైస్తవులు శాంతిని, సత్యాన్ని ప్రచారం చేస్తారనీ.. అలాంటి వారిని చంపడం సరికాదనీ.. ఇది కచ్ఛితంగా హత్యననీ.. మాకు న్యాయం జరగాలని అంటున్నారు.

‘యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం’ ఇటీవల రిపోర్ట్‌

ఢిల్లీలోని క్రైస్తవ సమస్యలపై పనిచేసే, సివిల్ సొసైటీ సంస్థ ‘యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం’ ఇటీవల ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో.. 2023 మొదటి ఎనిమిది నెలల్లోనే భారతదేశంలో క్రైస్తవులపై 525 దాడులు జరిగాయని పేర్కొంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే, భారతదేశంలోని క్రైస్తవ సమాజం ఇప్పటివరకు చూడని అత్యంత హింసాత్మకమైన, కష్టమైన సంవత్సరాల్లోకి నెట్టబడుతుందని తెలిపింది. అలాగే, 2022, 2021 సంవత్సారల్లో జరిగిన దాడుల కంటే 2023లో దాడులు రికార్డు బద్దలు కొట్టినట్లు ఈ నివేదిక వెల్లడించింది. మణిపూర్‌లో వందలాది చర్చిలు ధ్వంసం అయిన హింసను కూడా చేరిస్తే.. సంఖ్యలు మరింత పెరుగుతాయని కూడా చెప్పింది.

ఇంఫాల్‌లో 36 గంటల్లో 249 చర్చిలు ధ్వంసం

అయితే, UCF డేటాలో మణిపూర్‌లో జరిగిన సంఘటనలను చేర్చలేదు. ఈ రిపోర్ట్ వచ్చిన 2023 సెప్టెంబర్ నాటికి నాలుగు నెలల కాలంలో ధ్వంసమైన ప్రార్థనా స్థలాల సంఖ్య 642 అని సుప్రీంకోర్టులో ఆ మధ్య ఒక పిటిషన్ కూడా దాఖలైంది. జూన్‌లో ఇంఫాల్ ఆర్చ్ బిషప్.. కేవలం 36 గంటల్లో 249 చర్చిలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇక, ముస్లింలు, దళితులు, క్రైస్తవులపై ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన దాడులు గణనీయంగా పెరిగినట్లు అనేక నివేదికలు వచ్చాయి. అందుకే, కేఏ పాల్ లాంటి ప్రముఖులు.. క్రైస్తవులు, ముస్లీంలు ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.

అధికారంలో ఉన్న వ్యక్తుల మద్దతుతోనే హింస

ఇక్కడ కేఏ పాల్ చేసిన వాదన కేవలం ఓ వ్యక్తిదనే కోణం తీసుకోకూడదు. ఈ హింసాత్మక సంఘటనలన్నీ అధికారంలో ఉన్న వ్యక్తుల నుండి మద్దతుతోనే జరుగుతున్నాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. కొన్ని నిఘా సమూహాల నేతృత్వంలోని మూక ఇలాంటి హింసను చేస్తుందని UCF లాంటి నివేదికలు.. చాలా మంది మైనారిటీ మత బోధకులు కూడా చెబుతూనే ఉన్నారు. అందులోనూ, క్రైస్తవులపై దాడులు ఒక చోట జరగడం లేదు. ఇటువంటి సంఘటనల్లో పెరుగుదల హిందూ జాతీయవాదంతో ముడిపడి కొనసాగుతోంది. అధికార వర్గాలు మైనారిటీలపై వివిధ రకాల హింసను చేస్తున్నారనే వాదన ఉంది.

హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెందిన ఆసియా విభాగం నివేదిక

గత పదేళ్లలో హిందూవాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండటం కూడా దీనికి కారణం అయ్యిందనే వాదనలు కూడా లేకపోలేదు. అధికార పార్టీ నాయకులు లేదా ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వారు మైనారిటీలపై చేసిన ప్రకటనలు ఇలాంటి శక్తులకు బలాన్ని పెంచాయనే అభిప్రాయం ఉంది. మెజారిటీ హిందూ భావజాలాన్ని ప్రోత్సహించే రాజకీయ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలతో మరింత హింస పెరుగుతుందని.. హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెందిన ఆసియా విభాగం నివేదిక కూడా వెల్లడించింది. కొన్ని హిందూ సమూహాలు.. ముస్లింలు, క్రైస్తవులను.. వారి ప్రార్థనా స్థలాలను, వారి జీవనోపాధిని కూడా లక్ష్యంగా చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. అందుకే, దేశంలో మత సామరస్యాన్ని పెంచే వాతావరణం రావాలని కోరుకుంటున్నారు.

బీజేపీ బలంగా ఉన్నచోట ఎక్కువ దాడులు

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బిజెపి రాజకీయంగా, ఎన్నికలపరంగా బలంగా ఉన్నచోట దాడులు ఎక్కువగా ఉండటం ఇప్పుడు క్రైస్తవ సమాజంలో చాలా అనుమానాలకు తావిస్తోంది. 2023లో మోడీ చివరిసారిగా న్యూఢిల్లీలో ఈస్టర్ రోజున చర్చిలను సందర్శించడం వల్ల క్రైస్తవ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నది స్పష్టంగానే అర్ధమవుతుంది. ఎందుకంటే హింసకు పాల్పడేవారికి శిక్ష విధించినప్పుడ మాత్రమే ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటి ఎన్నో దాడులపై ప్రధాని మౌనం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.

హింసకు పాల్పడేవారిని శిక్షిస్తేనే ప్రభుత్వాలపై నమ్మకం

మణిపూర్ వ్యవహారంలోనూ ప్రతిపక్షాలు మోడీని ఇప్పటికీ అదే ప్రశ్నిస్తున్నారు. ఇక, మత స్వేచ్ఛను కాపాడుతామని హామీ ఇచ్చే భారత్ లాంటి దేశాలకకు.. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే.. ఇది అతిపెద్ద ప్రమాదానికి కూడా దారితీయొచ్చు. అప్పుడు, భారతదేశం నిలబడిన ‘భిన్నత్వంలో ఏకత్వమనే’ సూత్రం తెగిపోవచ్చు. దాని కంటే ముందే ప్రభుత్వాలు, ప్రజలు మేల్కొనాల్సిన అవసరం ఉంది.

 

 

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×