E-Paper
Advertisement

పటాన్‌చెరు గడ్డపై పౌరుషాల పోరు.. కాట వర్సెస్ గూడెం.. గెలిచేదెవరు?

పటాన్‌చెరు గడ్డపై పౌరుషాల పోరు.. కాట వర్సెస్ గూడెం.. గెలిచేదెవరు?

Patancheru: అసెంబ్లీలో మొదలైన మైనింగ్ చర్చ చిలికి చిలికి గాలి వానలా మారింది. భూ కబ్జాలు, అవినీతి అక్రమాల ఆరోపణలతో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ చివరకు దేవుని వద్దకు వచ్చిపడింది. ఎవరు అవినీతి చేశారో ఈ నెల 2న దేవుని వద్ద నిరూపించుకుందామని కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్ ప్రతిపక్ష ఎమ్మెల్యే కు గట్టి సవాల్ విసిరారు. మూడు రోజులుగా పటాన్‌చెరులో మాటల తూటాలతో కాక రేగుతున్న రాజకీయ రచ్చకు ఇప్పటికైనా తెరపడునుందా..?

పటాన్‌చెరు పాలిటిక్స్ ఫైర్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో ఉండే నియోజకవర్గం. గత కొద్ది పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్‌ల మాటల యుద్దం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వారి వార్ మీడియా సాక్షిగా మాటల తూటాలు పేల్చుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత అనే తారా స్థాయికి చేరుకుంది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్ చెరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

కాట శ్రీనివాస్ గౌడ్ నో చెప్పిన కథ

ఎమ్మెల్యే పదవి బరిలో కాట శ్రీనివాస్ గౌడ్ ఉంటే తనకు ఇబ్బందికరంగా ఉంటుందని హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు అమీన్ పూర్ సర్పంచ్ గా ఉన్న కాట శ్రీనివాస్‌ను తమ పార్టీలో చేర్చుకోవడానికి తీవ్ర ఒత్తిడులు తెచ్చారన్న ప్రచారం ఉంది. కాట శ్రీనివాస్‌ లొంగకపోవడంతో సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశాడని పదవి నుంచి తొలగించేలా కుట్రలు పన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లోకి రావాలని ఎన్ని ఒత్తిళ్లు చేసినా, రాజకీయంగా ఇబ్బంది పెట్టినా కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండానే పట్టుకుని ఉన్నారు. అక్కడ మొదలైన గొడవ గూడెం మహిపాల్ రెడ్డికి, కాట శ్రీనివాస్ గౌడ్ కు చిలికిచిలికి గాలివానలా మారింది.

గూడెం ఫ్యామిలీపై కేసులు

ఎంపీపీగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి వరుసగా మూడు సార్లు పటాన్ చెరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన మూడో సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నెల రోజుల పాటు జైలు పాలయ్యారు., ఈడీ, ఏసీబీ అధికారుల బంగారం, కోట్ల రూపాయల నగదును అటాచ్ చేయడంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్లారు. అప్పటి నుంచి కాట శ్రీనివాస్ కు మహిపాల్ కు మధ్య అగ్గికి ఆజ్యం పోసినట్లు తయారైంది పరిస్థితి.

కాంగ్రెస్‌పై విమర్శల వర్షం

అధికార పార్టీతో అన్ని పనులు చక్కబెట్టుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చివరకు పార్టీ మారలేదని, తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానంట.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపల్ సీట్లను బీఆర్ఎస్ వశం అయ్యేలా చేశారు. పనిలో పనిగా అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతూ మైనింగ్ కేసులో అనవసరంగా ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్ రెడ్డి నెల రోజుల పాటు జైల్లో పెట్టారని విమర్శించారు.

హరీష్‌పై కాట ఫైర్

హరీష్ రావు చేసిన వాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ రావుపై, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాట శ్రీనివాస్ గౌడ్ చేసిన వాఖ్యలకు ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు పై మాట్లాడే స్థాయి నీది కాదంటూ, కాట చేసిన అవినీతిపై ఎమ్మెల్యే గూడెం ఆరోపణలు ఆరోపణలు గుప్పించారు.

మహిపాల్‌పై ఘాటు విమర్శలు

కాట శ్రీనివాస్ ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఎమ్మెల్యే ఆరోపణలు చేయడంతో మరోసారి మహిపాల్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పసలేని ఆరోపణలు, నిరాధారమైన వాఖ్యలు చేశాడంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరును ఎండగట్టారు. తన స్థాయి ఏంటో హరీష్‌రావు మామ కేసీఆర్ ను అడిగితే తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి దర్శన్ గౌడ్ వద్దకు కేసీఆర్ వచ్చి భోజనం చేసి వెళ్లారని పేర్కొన్నారు. మొదటి నుంచి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం తమదని, దర్శన్ గౌడ్ పెట్టిన బిక్షతో ఎంపీపీగా రాజకీయం ఆరంభించిన గూడెం మహిపాల్ రెడ్డి అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టారని విరుచుకుపడ్డారు.

మహిపాల్‌కు కాట బహిరంగ సవాల్

అవినీతి తాను చేశానో…నువ్వు చేశావో?… నీ ఆరోపణలు నిజమో;…నా ఆరోపణలు నిజమో? అనేది తేల్చుకునేందుకు ఈ‌ నెల 2న బీరంగూడ భ్రమరాంబిక మల్లికార్జున ‌స్వామి ఆలయానికి వచ్చి రుజువు చేసుకోవాలని ఎమ్మెల్యే ‌గూడెం మహిపాల్ రెడ్డికి కాట శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం…దమ్ముంటే రావాలని ఎమ్మెల్యే కు చాలెంజ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడైన ఎమ్మెల్యే గా మహిపాల్ రెడ్డినిని నిరూపిస్తానని స్పష్టం చేశారు. రెండు లక్షల జీతం వచ్చే ఎమ్మెల్యేవి, వేల కోట్లు ఎలా సంపాదించావని గూడెంను నిలదీశారు.

కాట సిద్ధం… మహిపాల్ నిర్ణయం ఏంటి?

కాట శ్రీనివాస్ విసిరిన సవాల్ ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వీకరిస్తారా…లేదా అనేది నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది. కాట శ్రీనివాస్ మాత్రం ఉదయం 10.30 గంటలకు శివాలయానికి అన్ని ఆదారాలతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Story by: Apparao, Big Tv 

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×