Narasaraopet: ఆ మధ్య ఎప్పుడో వచ్చిన ఒక సినిమాలో చాలా పాపులర్ అయిన డైలాగ్ ఇది .. “నేను మోనార్క్ ని నన్ను ఎవడూ మోసం చేయలేడని. అచ్చం అలానే ఉందట నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు వ్యవహార శైలి. ఈ మధ్య నియోజకవర్గంలో ఆయన ఏం చేసినా హాట్ టాపిక్ గా మారుతుందట. అంతేకాదు అధికారులు ఆయన చెప్పిన పని చేయకపోతే చిన్నపిల్లలు చాక్లెట్ కోసం అలిగినట్లు పేచీ పెడుతున్నారట. ఇక చేసేదేమీ లేక .. అలాగే మహాప్రభో అంటూ ఆయనకు నచ్చజెప్పి పంపుతున్నారట అధికారులు. ఇంతకీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కు ఏమైంది? ఎమ్మెల్యే సాబ్ అలకకు కారకులు ఎవరు? అసలు నరసరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం మరోసారి చర్చల్లో నలుగుతోంది. అందుకు కారణం ఇటీవల ఆ నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలే. 2024 ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు చదలవాడ అరవింద బాబు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అరవింద బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మంచి మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తరువాత మొదట్లో అంతా బాగానే ఉన్నా క్రమేపీ అరవింద బాబు వ్యవహారశైలి చర్చనీయాంశంగా తయారైంది.
గెలిచింది కూటమి అభ్యర్థిగానే అయినా .. అరవిందబాబు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తుండటం కొంతమంది కూటమి నేతలకు మింగుడుపడటం లేదట. దానికి తోడు ఈమధ్య అరవింద బాబు చేస్తున్న కొన్ని కొన్ని పనులు చూసి.. ఇలా అయితే నరసరావుపేటలో కూటమి వచ్చే ఎన్నికల్లో సర్దేసుకోవడం ఖాయమన్న గుబులు నేతల్లో మొదలయ్యిందట. ఆయన వ్యవహార శైలి చూసి నేతలే కాదు అటు నియోజకవర్గ ప్రజలు కూడా షాక్ అవ్వక తప్పట్లేదట.
నియోజకవర్గంలో ఎవరైనా సరే తన మాట వినాల్సిందేనన్నట్లు .. మోనార్క్ పొకడులు పోతున్నారంట ఎమ్మెల్యే చదలవాడ. అవతల వైపు ఉంది ఎవరైనా సరే తాను చెప్పిన పని పూర్తవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. తాజాగా ఓ లీగల్ పోస్ట్ విషయంలో ఏకంగా జిల్లా ఎస్పీ ఆఫీస్ లోనే కూర్చొని పంచాయతీ పెట్టారాయన. గత ఎనిమిది నెలల క్రితం పల్నాడు జిల్లాలో పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్ట్ కి సంబంధించి ఓ వ్యక్తిని రిఫర్ చేస్తూ ఎమ్మెల్యే స్వయంగా ఎస్పీకి లెటర్ రాశారు. నెలలు గడిచినా ఆ లేఖపై ఎస్పీ సంతకం చేసి పైకి పంపకపోవడంతో నేరుగా ఎస్పీ ఆఫీస్ కు వెళ్లి, తాను చెప్పిన వ్యక్తికే ఆ పోస్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే హడావుడి చేశారు.
ఓ పక్క ఎస్పీ చెబుతున్నా వినకుండా డీజీపీ ఆఫీస్ నుంచి సదరు పోస్ట్ ఆర్డర్ కాపీ వచ్చేదాకా ఇక్కడే ఉంటానంటూ ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించారు. విషయం పైదాక వెళ్లి రాయబారానికి ఓ టీడీపీ ఎమ్మెల్యే తోపాటు ఐజీ సర్వశ్రేట్ట త్రిపాఠి కూడా వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నేను ఎవ్వరి మాట వినను అని తేల్చి చెప్పారు. అలా దాదాపు 10 గంటల పాటు ఎస్పీ కార్యాలయంలోనే తిష్ట వేశారు. ఒకానొక దశలో తాను చెప్పింది చేస్తారా లేదా అంటూ ఎస్పీ కార్యాలయంలోనే రెస్ట్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాు. ఎంత పిలిచినా పలకకపోవడంతో చేసేదేమీ లేక తలుపులు బద్దలుకొట్టి ఆయన్ను బయటకు తెచ్చారట అధికారులు.
ఆ తతంగం తెలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ లు వచ్చినా చదలవాడ రెస్పాండ్ కాలేదంట. దాంతో చేసేదేమీ లేక ఆయన చెప్పినట్టే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఆర్డర్ కాపీ తెల్లారేసరికి అందజేస్తామని చెప్పడంతో శాంతించి రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు జిల్లాలోతో పాటు యావత్తు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రజాప్రతినిధి అయి ఉండి, అలా వ్యవహరిండం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడాలి, లేదా పార్టీ పెద్దలు దృష్టిలో పెట్టాలి, కాని ఇలా చేయడం కరెక్ట్ కాదని సొంత పార్టీ వారే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక్కటే కాదు అదే రోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తాను చెప్పిన వ్యక్తి కి ఔట్సోర్సింగ్ పోస్ట్ ఇవ్వాలని అలాగే పేచీ పెట్టారట చదలవాడ. గతంలో కూడా ఇలాగే ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ లో ఓ ఔట్ సోర్సింగ్ పోస్ట్ కోసం అధికారులతో గొడవపడి హాట్ టాపిక్ గా మారారాయన. ఇలా వరుస వివాదాల్లో చిక్కుకొని ఇటు పార్టీ కే కాకుండా మొత్తం కూటమికే నష్టం కలిగిస్తున్నారని పెదవివిరుస్తున్నారు నరసరావుపేట కార్యకర్తలు, నాయకులు.
పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ చేసిన పనికి పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ఆయన ఎస్పీ కార్యాలయంలో ఉండగా పార్టీ అధ్యక్షుడు పల్లా ఫోన్ చేసినా ఎమ్మెల్యే లెక్క చేయకపోవడంతో క్రమశిక్షణ చర్యలు దిశగా పార్టీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారశైలితో పాటు అటు కూటమి నేతలతో ఎమ్మెల్యే సఖ్యతగా మెలగకపోవడం కూడా వివాదాస్పదంగా మారుతోంద. కొన్ని రోజుల క్రితం నరసరావుపేట జనసేన నేత బహిరంగంగానే ఎమ్మెల్యే పై విమర్శలు గుప్పించి రాజకీయంగా కలకలం రేపారు. సొంత పార్టీ కార్యకర్తల విషయంలో కూడా ఎమ్మెల్యే తీరు బాలేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది.
దీంతో చదలవాడ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి వరకూ వెళ్లి, రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యేని స్వయంగా వచ్చి కలవమని ఆదేశించారంట. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. “నిన్న మా ఎమ్మెల్యే ఒకరు వెళ్లి వేరే ఆఫీస్ ల మీద పడ్డారు.. నేరాలు ఘోరాలు చూసి సీరియల్స్ చూసి మనసు పాడుచేసుకుంటున్నారు. అధికారులు లేదా నాయకుల మెడిటేషన్ చేయండి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే చదలవాడను ఉద్దేశించే చేశారంటున్నారు.
మరి ఎమ్మెల్యే అరవింద బాబు విషయంలో ఇప్పుడు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్యేను పిలిచి వార్నింగ్ ఇస్తారా లేదా? నార్మల్ గా క్లాస్ పీకి వదిలేస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇంత జరిగాక అయినా మన ఎమ్మెల్యే సారు తీరు మార్చుకుంటారా? నేను మోనార్క్‌ని అన్నట్లు అదే వైఖరి ప్రదర్శిస్తారో చూడాలి.
Also Read:పటాన్‌చెరు గడ్డపై పౌరుషాల పోరు.. కాట వర్సెస్ గూడెం.. గెలిచేదెవరు?
Story by: Apparao, Big Tv