Pithapuram Politics: ఉరుము ఉరుమి మంగలం మీద పడింది అన్నట్లు తయారవుతోంది పిఠాపురం రాజకీయం.. జనసేన పార్టీలో కీలకమైన నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తే చాలు అటు జనసేనకు ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు మిత్రధర్మం కంటికి కనిపించడం లేదు.. విభేదాలు, వివాదాలు ఒక్కసారిగా తెరమీదకి వచ్చేస్తున్నాయి.. పార్టీలను పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలతో ముందుకు దూసుకుపోతున్నారు .. జరిగే కార్యక్రమం ఏదైనా ప్రోటోకాల్లో తేడా వస్తే అవమానిస్తున్నారంటూ అలకపాన్పు ఎక్కడమే కాదు.. అనుచరుల్ని వెనక వేసుకుని ఘాటైన మాటలతో ఓ రణరంగమే సృష్టిస్తున్నారు.. ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు, నాయకులకు పరిమితమైన వాగ్యుద్దానికి ఇప్పుడు బ్యూరోక్రాట్స్ టార్గెట్ అవుతున్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టినా, పార్టీ నాయకులు కార్యక్రమాలు చేపట్టినా తలెత్తుతున్న వివాదాల ప్రభావం అధికారులపై పడుతోంది.. అసలు పిఠాపురం పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది?
పవన్ పోటీతో అందరికీ పరిచయమైన పిఠాపురం
కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం 2024 ఎన్నికల ముందు వరకు పెద్దగా ఫోకస్ కాలేదు .. విభజిత ఆంధ్ర ప్రదేశ్ లోనే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం కూడా ఒకటి.. ముఖ్యంగా 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాకినాడ ఎస్సీజెడ్ కోసం భూములను తీసుకున్న సమయంలో జరిగిన పోరాటాల్లో కానీ, 2009 ఎన్నికల తర్వాత అరకు పట్టి నాగలి దున్నిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పర్యటించిన సమయంలో కానీ పిఠాపురం పేరు ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు పెద్దగా వెళ్లలేదు.. అలాంటి పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అందరికీ అది పరిచయం అయింది.ౌ..
అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేస్తున్న నేతలు
పవన్‌కళ్యాణ్ అక్కడ నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడంతో గడిచిన ఏడాదిగా అసలు పిఠాపురం ఎక్కడ ఉంది అంటూ గూగుల్లో సర్చ్ చేస్తున్న వాళ్లతో పాటు, స్వయంగా వచ్చి చూసి వెళుతున్న వాళ్లు కూడా ఎక్కువవుతున్నారు.. ఇప్పుడు అలాంటి పిఠాపురం తరచూ గొడవలకు వేదిక అవుతుంది.. ఆ గొడవలు రాజకీయ పార్టీలను దాటి , నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి, ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేసే స్థాయికి వెళ్లాయి.
వర్మకు మద్దతుగా టీడీపీ ఆఫీసుని తగలబెట్టిన క్యాడర్
2024 ఎన్నికలకు ముందు పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గ నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రకటన చేసిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని టిడిపి కేడర్ అంతా ఆగ్రహా ఆవేశాలతో ఊగిపోయింది. టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడమే కాదు అప్పటివరకు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వర్మను వెనకేసుకుని వచ్చి టీడీపీ అధిష్టానంపైనే తిరుగుబాటుకు చేసే స్థాయికి వెళ్లారు స్థానిక నాయకులు..
వర్మకు ఎమ్మెల్సీ పదవిపై హామీ ఇచ్చిన చంద్రబాబు
అప్పట్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చొరవ తీసుకుని వర్మను ఎమ్మెల్సీగా చేసి నియోజకవర్గానికి పంపిస్తానని హామీ ఇవ్వడంతో … ఆయన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చి 2024 ఎన్నికల్లో పనిచేశారు.. ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ సైతం ఎన్నికలకు ముందు తన గెలుపు బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల్లో పెడుతున్నానని చెప్పడమే కాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత గెలుపుకు కారణం మాజీ ఎమ్మెల్యే వర్మ అంటూ థాంక్స్ కూడా చెప్పారు..
వర్మకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఎన్నికల్లో పోటీ, గెలుపు తర్వాత పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మకి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసిన టిడిపి క్యాడర్ అంతా సవ్యంగానే ముందుకు సాగుతుందని భావించారు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ముందుకు సాగడం, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినా వర్మకు మొండి చేయి ఎదురవ్వడంతో అతని అనుచరులు కొంత ఆగ్రహానికి గురయ్యారు..
నాగబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన వర్మ
ఇంతలో అగ్నికి ఆజ్యం పోసినట్లు పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తుత ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకి పవన్ కళ్యాణ్ గెలుపు అంశంపై చేసిన విమర్శలతో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రస్థాయిలో స్పందించడం మొదలుపెట్టారు.. ఒక వర్మే కాదు అతని సపోర్టర్స్ కూడా జనసేన పార్టీ నాయకులు పిఠాపురం నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు చేపడితే ఆందోళనలు చేయడంతో పాటు , ప్రోటోకాల్ ను తెరమీదకు తీసుకొచ్చి తరచూ వివాదాలు క్రియేట్ చేస్తున్నారు.
ఎమ్మెల్సీగా పిఠాపురం వచ్చిన నాగబాబుని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య కొంత సమన్వయం కనిపించినా పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత, ఎమ్మెల్సీ హోదాలో తొలిసారి పిఠాపురం వచ్చిన నాగబాబుని టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడమే కాదు ఒక రణరంగమే సృష్టించారు..
మాజీ ఎమ్మెల్యే టిడిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ వర్మకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో జై టీడీపీ, జై వర్మ నినాదాలతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఇలా తరచూ గొడవలు జరుగుతుండడంతో టిడిపి, జనసేన పార్టీల మధ్య, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన కార్యకర్తలకు మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా తయారైంది.. దీంతో భవిష్యత్తులో కూటమిలో ఉన్న టిడిపి, జనసేన పార్టీల మధ్య విభేదాలు రావడానికి పిఠాపురం నియోజకవర్గమే కారణం అవుతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి
పవన్ ప్రోగ్రాం సందర్భంగా వర్మను అడ్డుకున్న జిల్లా ఎస్పీ
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.. పిఠాపురంలో అంబేద్కర్ భవన్ లో బీసీ కార్పొరేషన్ లో ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ భవన్‌కు రావడానికి 15 నిమిషాల ముందు టిడిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ తన అనుచరులతో కలిసి అంబేద్కర్ భవన్‌లోకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.. అక్కడే ఉన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వీఐపీలకు అక్కడ అనుమతి లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం దయచేసి అక్కడికి వెళ్లాలని సూచించారు..
జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ
అంబేద్కర్ భవన్లోకి వెళ్లకుండా జిల్లా ఎస్పీ అడ్డుకోవడంతో కోపానికి గురైన వర్మ పోలీసులపై, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దాంతో వర్మని అంబేద్కర్ భవన్ ఎంట్రెన్స్ దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చి కార్యకర్తలను బయటకు పంపే ప్రయత్నం చేశారు పోలీసులు.. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యక్రమానికి పిలవడం ఎందుకు అవమానించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎస్పీ బిందు మాధవ్ ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేశారు.. ఇంతలో అంబేద్కర్ భవానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మను చూడగానే పలకరించి తనతో పాటు లోపలికి తీసుకువెళ్లి రిబ్బన్ కట్ చేస్తూ వర్మను కూడా పక్కనే ఉంచి సముచిత స్థానం కల్పించడంతో పెద్దదవ్వాల్సిన వివాదం అక్కడితో సమస్య పోయింది..
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో వర్మ పోస్ట్
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కొంత సమన్వయంతో వ్యవహరించడం, పవన్ కళ్యాణ్ కూడా వర్మను కలుపుకుని వెళ్లడం, అక్కడ ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వర్మ ఎక్స్ లో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు.. రాష్ట్రంలో ఇంకా వైసిపి అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి ఉన్నారు అంటూ ఆయన ఆ పోస్టులో విమర్శించారు.. ఇప్పుడు అదే పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇప్పటివరకు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ నాగబాబు మీదే మాత్రమే తిరుగుబావుటా ఎగరవేస్తూ విమర్శలు చేస్తూ వచ్చిన టిడిపి నేతలు అధికారులను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది
వర్మ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న జిల్లా పోలీసులు
తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా, అయినా క్రమశిక్షణతో భరిస్తున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో , ఇప్పుడు ఇది వర్మ, జిల్లా ఎస్పీల మధ్య వివాదంగా మారినట్లు కనిపిస్తుంది.. ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు తమ విధి నిర్వహణలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు.. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న కూడా ఇంకా వైసీపీ వాసనలు పోలేదని, పోలీసు ఉన్నతాధికారి వైసిపి ప్రభుత్వంలోనే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని వర్మ విమర్శలు చేయడంతో ఇప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా వర్మ వ్యాఖ్యలపై గుర్రుగా ఉందంట
వర్మను అడ్డకున్న సమయంలో అక్కడే ఉన్న దొరబాబు
మాజీ ఎమ్మెల్యే వర్మ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి, పిలిచి అవమానిస్తారా అంటూ మాట్లాడడానికి వెనక మరో కారణం కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ వర్మను ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అందరికీ అనుమతి ఉంది అక్కడికి వెళ్లాలి అని కోరిన సమయంలో.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం జనసేనలో చేరిన పెండెం దొరబాబు కూడా అంబేద్కర్ భవన్ దగ్గరే ఉన్నారు.. దొరబాబును అక్కడ నుంచి పంపకుండా తనను మాత్రమే అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించడంతో వర్మ అవమానంగా ఫీలై ఆగ్రహం వ్యక్తం చేశారంట.. 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీ నాయకుడుగా ఉన్న పెండెం దొరబాబు ఇప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, నిన్నటి వరకు టిడిపికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఈరోజు జనసేన పార్టీలో ముఖ్యమైన వాడిగా మారిపోవడం వర్మకు మింగుడుపడటం లేదంట
జనసేన పార్టీని, పార్టీ నాయకులను ఏమీ అనలేక పోలీసులపై తన ఆక్రోశాన్ని చూపిస్తున్నారని పోలీసు వర్గాలు అంటున్నాయి.. కారణాలు ఏవైనా అటు జనసేన పార్టీని లేదా అధికారులను విమర్శిస్తున్న వర్మ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజా ఘటన సందర్భంగా సమయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి ఎలాంటి వివాదం లేకుండా పోయిందని, ఆయన రాక కొంత ఆలస్యం అయ్యుంటే పోలీసులు, జనసేన నాయకులు, టిడిపి నాయకులు మధ్య ఓ పెద్ద వివాదమే నెలకొనేదని అంటున్నారు.. ఇలాంటి వాతావరణం ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో అనేది మాత్రం పెద్ద చర్చకు దారితీస్తుంది.