CM Progress Report: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని మాటిచ్చిన విధంగానే.. దానిని అమలు చేసి చూపుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. జిల్లాల్లో పరిశ్రమలు రావాలని.. కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే.. పరిశ్రమలు తీసుకొస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం. పేదల సేవలో, రైతన్నా మీకోసం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, వరుస రివ్యూలతో.. ఈ వారం మొత్తం సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు.
సోమవారం, డిసెంబర్ 1 ( పేదల సేవలో సీఎం )
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకోసం.. సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో పర్యటించారు. కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి స్వయంగా పింఛను అందించారు. నాగలక్ష్మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని.. ఓ మార్పు రావాలని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. సూపర్ సిక్స్ హామీలు ఇస్తే.. అవి అసాధ్యమన్నారని కానీ ఇవాళ సూపర్ సిక్స్‌ని సూపర్ సక్సెస్ చేశామన్నారు. 18 నెలల్లో పింఛన్ల కోసమే 50 వేల కోట్లు ఖర్చు చేశామని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో పింఛన్ల ఖర్చు లేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామన్నారు.
రాజధాని అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని.. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే ఓ సుందర రాజధాని తయారవుతుందన్నారు. జనవరి లోపు రోడ్లపై ఉన్న గుంతలు పూడుస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతులు బాగుండాలని..వారి జీవితాల్లో వెలుగు రావాలని ఆకాంక్షించారు. రైతుల ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు అమలు చేస్తున్నామని.. సమీకృత వ్యవసాయ విధానంతో ఆరోగ్యం, ఆదాయం మెరుగవుతాయని తెలిపారు చంద్రబాబు.
మంగళవారం, డిసెంబర్ 2 ( ఖనిజాలతో ఆదాయం )
ఆంధ్రప్రదేశ్‌లో గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానం అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం రివ్యూ చేశారు. లీజుకిచ్చిన గని ప్రాంతం కాకుండా.. ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే.. ఆర్టీజీఎస్ ద్వారా గుర్తించాలన్నారు. ఏపీ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ లాంటి వివిధ ఖనిజాల ముడి సరుకును ఎగుమతి చేయడంతో పాటు వాటికి వాల్యూ యాడ్ చేయడం ద్వారా మరింత ఆదాయం రాబట్టాలని సూచించారు. మాంగనీస్ ఖనిజం ద్వారా ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తులు, క్వార్ట్జ్-సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు, సోలార్ పీవీ సెల్స్ ఉత్పత్తి, గ్లాస్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా కటింగ్-పాలిషింగ్ పరిశ్రమలని ప్రోత్సహించాలన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్‌కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలని, విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మంగళవారం, డిసెంబర్ 2 ( విద్యుత్‌పై రివ్యూ )
ఏపీలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు.. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని, క్షేత్రస్థాయిలో సమస్యలుంటే పరిష్కరించి అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. విద్యుత్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలు తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్ని, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణ ద్వారా ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయకుండా చూడగలిగామన్నారు సీఎం చంద్రబాబు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని.. ఉత్పత్తికి లోటు లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కీలకమైన పరిశ్రమలుగా ఫెర్రో ఎల్లాయీస్‌ను గుర్తించి, వాటికి ప్రోత్సాహకాలు మరో ఏడాది పొడిగించారు. దీనివల్ల.. ప్రభుత్వంపై 1,053 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర పీఎస్‌పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను జెన్‌కో, జలవనరుల శాఖ అధికారులు కలిసి అధ్యయనం చేయాలన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీ 1,000 ఈవీ బస్సులు కొనుగోలు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు సీఎం చంద్రబాబు.
మంగళవారం, డిసెంబర్ 2 ( పౌర సేవలపై ఆరా )
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలపై పబ్లిక్ పర్సెప్షన్ గురించి సీఎం చంద్రబాబు.. ఆర్టీజీఎస్ కేంద్రంలో రివ్యూ చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ని విశ్లేషించి మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మంగళవారం, డిసెంబర్ 2 ( స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తం )
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని.. ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి సోకితే.. అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు.. మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
బుధవారం, డిసెంబర్ 3 ( రైతన్నా మీకోసం.. )
ఈ వారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా.. రైతులు, వారి కుటుంబాలని కలిసి వారితో నేరుగా మాట్లాడారు.
రైతులు సాగు చేస్తున్న అంతర్ పంటలను పరిశీలించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారి నుంచి సాగు వివరాలను తెలుసుకుని.. ప్రభుత్వ పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు సీఎం చంద్రబాబు.
ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని.. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందని చెప్పారు చంద్రబాబు. రాష్ట్రంలో రైతుల సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. నీటి వనరులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణాకు లింక్ చేశామని.. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపి.. పెన్నా వరకూ తీసుకెళ్తామన్నారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సప్లై చేస్తామన్నారు.
గురువారం, డిసెంబర్ 4 ( క్రియేటివ్ సిటీగా అమరావతి )
రాజధాని అమరావతిని.. ఓ క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్టు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. అమరావతిలో నిర్మించే ప్రతి భవనం.. విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ వారం.. సచివాలయంలో సీఎం అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో.. గవర్నర్ నివాస సముదాయం, లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. 169 కోట్ల వ్యయంతో.. లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. 165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణ ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా.. నీరుకొండ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వేర్వేరు ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
గురువారం, డిసెంబర్ 4 ( పెట్టుబడులపై చర్చ )
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ వారం.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 13వ సమావేశం జరిగింది. 26 కంపెనీలకు చెందిన 20 వేల కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలపై కీలకంగా చర్చించారు. ఎనర్జీ, ఐటీ, ఐ అండ్ ఐ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు.. బోర్డు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 56 వేలకు పైగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో.. 50 శాతానికి పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వాటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సరైన నిర్వచనం అందించామని తెలిపారు.
మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు సీఎం.
శుక్రవారం, డిసెంబర్ 5 ( విద్యార్థులతో సీఎం )
ఏపీలో అమలయ్యే విద్యావ్యవస్థ మూడేళ్లలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారని, ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం తనకుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గంలోని భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. భామిని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో సీఎం ముచ్చటించారు. విద్యార్ధులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్, స్టెమ్ ల్యాబ్‌ని పరిశీలించారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ సామర్థ్యాలు పెంచేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడారు. ల్యాబ్‌లో విద్యార్థినులు ప్రజెంటేషన్ ఇచ్చిన తీరును ముఖ్యమంత్రి అభినందించారు. క్లాస్ రూంలో కూర్చొని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. రెయిన్ ఫాల్‌పై వీడియో ప్రదర్శించి దాని ఆధారంగా ప్రశ్నలు అడిగారు. మంచి మార్కులు వచ్చిన వారికి సాటి విద్యార్ధులతో చప్పట్లు కొట్టించారు. మీటింగ్ తర్వాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు.
Also Read: రాష్ట్రవ్యాప్తంగా వణికిస్తున్న చలిపులి.. కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
భామిని ఆదర్శ పాఠశాల విద్యార్థులు.. సభ నిర్వహణలో అదుర్స్ అనిపించారన్నారు సీఎం చంద్రబాబు. చిన్నారుల నుంచి తాను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. అన్ని అంశాల్లో పరిజ్ఞానం అందించేలా.. బలమైన పునాది వేసే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. విద్యార్థులతో ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీలో.. అదరగొట్టేశారన్నారు. నూతన ఆవిష్కరణల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో.. భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామన్నారు. విదేశీవిద్యకు కలలకు రెక్కలు పేరిట ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పావలా వడ్డీకే విదేశీవిద్య రుణాలిప్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
Story By Anup, Bigtv