Mahindra Vision T SUV Patented In India: ఇండియన్ ఎస్‌యూవీ మార్కెట్ లో మహీంద్రా మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. కంపెనీ రూపొందిస్తున్న కొత్త విజన్ T కాన్సెప్ట్ కు తాజాగా భారత్ లో పేటెంట్ లభించింది. ఇదే మోడల్ ఆధారంగా నెక్ట్స్ జెనరేషన్ థార్ ను డెవలప్ చేస్తోంది. అద్భుతమైన డిజైన్, కొత్త ప్లాట్ ఫారమ్, పెట్రోల్, డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో కారు ప్రియుల్లో ఆసక్తి పెరుగుతోంది.
మహీంద్రా రూపొందించిన NU_IQ అనే కొత్త ప్లాట్ ఫారమ్ పై Vision T తయారు కానుంది. భవిష్యత్ లో కంపెనీ విడుదల చేసే కొత్త ఎస్‌యూవీలకు ఇదే బేస్‌గా ఉండనుంది. ఈ ప్లాట్ ఫారమ్ పై మొదటగా Vision S విడుదలయ్యే అవకాశం ఉండగా, Vision T కూడా అదే ఫ్యామిలీలో భాగంగా రానుంది.
పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే విజన్ T డిజైన్ చాలా వరకు కాన్సెప్ట్ మోడల్ ను పోలి ఉంటుంది. అయితే, ప్రొడక్షన్ కు అనుగుణంగా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బాక్సీ బాడీ, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, వెనుక భాగంలో స్పేర్ వీల్, బోనెట్ లాచెస్ లాంటి థార్ ప్రత్యేకతలు ఇందులో కొనసాగనున్నాయి. ముందు భాగంలో కొత్త తరహా స్ప్లిట్ గ్రిల్, స్టైలిష్ LED హెడ్ ల్యాంప్స్, ప్రత్యేకమైన DRLs ఆకట్టుకోనున్నాయి. వెనుక భాగంలో కూడా కొత్త LED టెయిల్ ల్యాంప్స్ ను అందించే అవకాశం ఉంది.
విజన్ Tని పూర్తి స్థాయి లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్ గా మహీంద్రా తీసుకురానుంది. బలమైన బంపర్, టోయింగ్ హుక్స్, వెడల్పైన వీల్ ఆర్చ్ లు, ఆల్ టెర్రైన్ టైర్లు లాంటి ఫీచర్లు ఇందులో కనిపించే అవకాశం ఉంది. నగరాల్లో రోజువారీ వినియోగంతో పాటు అడ్వెంచర్ ట్రిప్స్ ను ఇష్టపడే వారికి ఇది సరైన ఆప్షన్ గా ఉండేలా కంపెనీ డిజైన్ చేస్తోంది.
విజన్ Tని కేవలం ఒకే ఇంజిన్ తో కాకుండా మూడు రకాల పవర్ ట్రెయిన్లలో అందించే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ తో పాటు పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా రానుందని అంచనా. అన్ని అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్స్ అందుబాటులో ఉండనుంది.
ఈ ఎస్‌యూవీలో ఆల్ వీల్ డ్రైవ్, లో రేంజ్ ట్రాన్స్ ఫర్ కేస్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాంటి అత్యాధునిక ఆఫ్ రోడ్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, అన్ని రకాల భూభాగాలకు అనుగుణంగా ప్రత్యేక డ్రైవింగ్ మోడ్ లను కూడా అందించవచ్చని తెలుస్తోంది. అన్ని పనులు అనుకున్నట్లుగా సాగితే 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో ఈ న్యూ జెనరేషన్ థార్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎలక్ట్రిక్, పెట్రోల్, డీజిల్ వెర్షన్లను ఒకే ప్లాట్ ఫారమ్ పై తీసుకురావాలని మహీంద్రా భావిస్తోంది.
Read Also: మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!