Bangladesh Crisis: బంగ్లా మరోమారు భగ్గుమంటోందా? అక్కడ రాజకీయ అస్థిరతకు అసలు కారణాలేంటి? ఎందుకుని బంగ్లాదేశ్ తిరిగి పాత ధోరణిలోకి వచ్చేసింది. తాత్కాలిక ప్రధాని శాశ్వత ప్రధాని అయ్యే ఎత్తుగడ వేశారా? దీన్ని ఆర్మీ చీఫ్ ఒప్పుకోవడం లేదా? బంగ్లాలో ప్రస్తుత పరిస్థితికి అసలు కారణమేంటి? ఆ డీటైల్స్ ఎలాంటివి?
బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ రాజీనామా వార్త
అది మే 23 శుక్రవారం. మధ్యాహ్న సమయం. ప్రార్ధనలు అప్పుడే ముగిశాయి. ఆ సమయంలో ఒక వార్త బంగ్లాను భగ్గుమనేలా చేసింది. అదేంటంటే.. మహమ్మద్ యూనస్ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్టు వార్తలు రావడంతో.. ఢాకా రోడ్లపైకి బంగ్లా నిరసన కారులు ఒక్కసారిగా గుమికూడారు. మార్చ్ ఫర్ యూనస్ అంటూ వారు చేసిన నిరసనసారాంశమేంటంటే.. పదేళ్లపాటు యునస్ ప్రధానిగా ఉండాలి.
ప్రధాని యూనస్ వర్సెస్ ఆర్మీ చీఫ్ వకార్ గా సీన్
తాత్కాలిక ప్రధాని రాజీనామా చేయాలని ఎందుకునుకున్నారు? దీని వెనక కారణాలేమై ఉంటాయని చూస్తే.. బంగ్లా ఆర్మీ చీఫ్ వకారుజ్జమాన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రధాని యూనస్ కి ఆర్మీ చీఫ్ వకార్ కి వచ్చిన గొడవలేంటని చూస్తే.. గత కొన్నాళ్లుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. ప్రభుత్వాధినేత యూనస్ కి, ఆర్మీ చీఫ్ వకార్ కి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత.. ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం, సైన్యం మధ్య మొదట మంచి మిత్రత్వమే ఉండేది. ఇప్పుడు వీరిద్దరి మధ్య పూర్తిగా సఖ్యత లోపించినట్టు తెలుస్తోంది. యూనస్ తీస్కుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పు పడుతోంది సైన్యం.
ఎన్నికలను త్వరలో నిర్వహిస్తానన్న యూనస్
గతేడాది ఆగస్టులో బంగ్లా విద్యార్ధులు భారీ నిరసనలు చేపట్టడంతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. తర్వాత జరిగిన చర్చల తర్వాత సంస్కరణలు చేపట్టి.. త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు యూనస్. తర్వాతి కాలంలో ఆయన ఆ మాట మరచి.. ఎన్నికల నిర్వహణ పక్కన పెట్టడంతో సైన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అంతే కాదు శిక్షపడ్డ ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లా రైఫిల్స్ తిరుగుబాటు దారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది.
అమెరికా రాయబారితో యూనస్ సైనిక సలహాదారు భేటీ
యూనస్ సైనిక సలహాదారు కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమయ్యారు. వకార్ తర్వాతి ఆర్మీ చీఫ్ పదవి చేపట్టడానికి సపోర్టు చేయాల్సిందిగా కోరినట్టు ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం సైన్యం మధ్య మరింత గ్యాప్ ఏర్పడింది. హాసన్ సైనిక నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి పని చేయడం తగదని ఆయన్ను తొలగించాలని ప్రయత్నించారు జనరల్ వాకర్. అయితే యూనస్ దీన్ని అడ్డుకున్నారు. దీంతో బంగ్లా సర్కార్ వర్సెస్ బంగ్లా ఆర్మీ మధ్య వ్యవహారం మరింత ముదిరింది.
మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ కి ఆమోదం
మరోవైపు యూనస్ గవర్నమెంట్ మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇదొక బ్లడీ కారిడార్ అంటూ జనరల్ వకార్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో యూనస్ ప్రభుత్వం ఈ కారిడార్ ఏర్పాటు లో వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
ఎన్నికల్లేకుండా నెట్టుకొచ్చే యత్నం చేస్తోన్న యూనస్
వీటన్నిటితో పాటు యూనస్ ప్రభుత్వంపై సైన్యం ప్రధాన అభ్యంతరం.. ఎన్నిల నిర్వహణ చేయక పోవడం. ఎన్నికల్లేకుండానే మరింత కాలం యూనస్ పదవిలో కొనసాగేందుకు చేస్తున్న యత్నాలను సైన్యం తీవ్రంగా తప్పు పడుతోంది. బంగ్లాదేశ్ లో మిగిలిన ఏకైక లౌకిక వ్యవస్థ సైన్యమే. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. కాబట్టి యూనస్ ప్రభుత్వం తక్షణం ఎన్నికలు నిర్వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది వకార్ నాయకత్వంలోని సైన్యం.
దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగితే ఊరుకోం- సైన్యం
రెండో అభ్యంతరం బ్లడీ కారిడార్. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యలోనూ సైన్యం పాల్గొనబోదంటూ.. జనరల్ వకార్ యూనిస్ అభిప్రాయమంటుంది ఢాకా ట్రిబ్యూన్. మే 21వ తేదీన జనరల్ వకారుజ్జమాన్ ఈ దిశగా యూనస్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశ ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యత ఉంటుందని.. తర్వాత ఏ విషయమైనా రాజకీయ ఏకాభిప్రాయం తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనని అన్నారు వకార్. ఈ దిశగా.. జనరల్ వకార్ ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరలో దేశంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. అంతే కాదు మిలిటరీ విషయాల్లో జోక్యం మానాలి. రఖైన్ కారిడార్ ప్రాజెక్టు వంటి కీలకమైన అంశాలపై ఆర్మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున తమ డిమాండ్లను బయట పెట్టారు జనరల్ వకార్.
డిసెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
ఈ ఏడాది డిసెంబర్ లోగా బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించాన్నది సైన్యం జారీ చేస్తోన్న ఫైనల్ అల్టిమేటం. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే హక్కులుంటాయి. ఇదొక డమ్మీ ప్రభుత్వం అనగానే యూనస్ తీవ్ర అసంతృప్తితో తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో.. నిరసన కారులు రోడ్డుపైకి వచ్చి మార్చ్ ఫర్ యూనస్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో డైలమాలో పడింది సైన్యం. దీన్నే ప్రజాభిప్రాయంగా ఎలా తీసుకుంటాం. స్పష్టమైన ఎన్నికల ఫలితాల ద్వారా మాత్రమే ప్రభుత్వం ఏర్పడాలన్నది సైన్యం ఆలోచన. ఇటు ప్రభుత్వం, అటు సైన్యం మధ్య ప్రజలు.. మరి ఈ ముక్కోణ పోరాటాల మధ్య బంగ్లా భవిషత్ ఏంటి??? అన్నదిపుడు ప్రశ్నార్ధకంగా మారింది.
సైన్యం వాదన కరెక్టా? తాత్కాలిక ప్రభుత్వాధినేత వాదన సరైనదా?
సైన్యం వాదన కరెక్టా? తాత్కాలిక ప్రభుత్వాధినేత వాదన సరైనదా? యూనస్ అసలు ఆలోచనేంటి? త్వరలో ఎన్నికల నిర్వహణ చేస్తానన్న యూనస్ మనసు మార్చుకున్నారెందుకు? భారత్ తో దూరమవుతూ చైనాకు దగ్గరవడంలో అంతర్యమేంటి? చైనా పర్యటనలో యూనస్ ఏమన్నారు? తాజాగా భారత వ్యతిరేకంగా యూనస్ సర్కార్ తీస్కున్న చర్యలేంటి?
వాండర్ బిల్డ్ వర్శిటీలో ఎకనామిక్స్ PHD
2025 DEC- 2026 JUNE మధ్య ఎన్నికలు- యూనస్ప్రస్తుతం యూనస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అనంటారు. కానీ షేక్ హసీనా తర్వాత ఆమె స్తానంలో ప్రధానిగా పని చేస్తున్నట్టే లెక్క. బంగ్లాదేశ్ ని ఏలిన ప్రధానమంత్రుల జాబితాలో షేక్ హసీనా తర్వాత యూనస్ పేరే నిలిచి ఉంటుంది. ఇదంతా ఇలా ఉంచితే.. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ తర్వాతి రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తానని నిర్వహించకుండా వెనకాడుతున్నారు. అదేమంటే ఆయన మద్ధతుదారుల ద్వారా.. వచ్చే కొన్నేళ్ల పాటు మీరే ప్రధానిగా ఉండాలంటూ డిమాండ్లు చేయించుకుంటున్నారు.
1974 బంగ్లా కరువు
ఇంతకీ ఎవరీ యూనస్ అంటే 1940లో చిట్టగాంగ్ లో జన్మించిన ఈయన.. తర్వాత ఢాకా యూనివర్శిటీ లో ఉన్నత విద్యనభ్యసించారు. ఆ తర్వాత వాండర్ బిల్ట్ యూనివర్శిటీలో ఆర్ధిక శాస్త్రాన్ని అభ్యసించారు. అక్కడే పీహెచ్డీ సైతం చేశారు. తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చి చిట్టగాంగ్ యూనివర్శిటీలో ఆర్ధిక విభాగాధిపతిగా పని చేశారు.
2011లో గ్రామీణ బ్యాంకు రాజీనామా
1974 బంగ్లాదేశ్ కరువు తర్వాత నలభై రెండు కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇప్పించారు. సూక్మరుణాలు అంటే చిన్న చిన్న అప్పులు..ఇప్పించడం. మామూలు అప్పులు తీసుకోలేని వారికి.. ఎన్నో సార్లు ఇలాంటి అప్పులు ఇప్పించారు యూనస్. 1983లో ఆయన రూపొందించిన సూక్ష్మ రుణ వ్యవస్థ.. గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. ఆయన సాగించిన సూక్ష్మరుణ ఉద్యమం.. 2006లో నోబుల్ ప్రైజ్ సాధించి పెట్టింది. 2011లో ఆయన గ్రామీణ బ్యాంకు పదవికి రాజీనామా చేశారు. 2024లో బంగ్లాదేశ్ విద్యార్దుల రిజర్వేషన్ల నిరసన జ్వాల తర్వాత.. హసీనా తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఎన్నికయ్యారు.
భారత్ తో కీలక రక్షణ కాంట్రాక్టు రద్దు
యూనస్ ఆలోచన వేరుగా ఉంది. ఆయన కూడా పాక్ ప్రభుత్వాధినేతలకు మల్లే.. భారత వ్యతిరేక ధోరణి కనబరుస్తున్నారు. తాజాగా.. ఆయన భారత్ కి మరింత దూరమయ్యే ఆలోచన చేస్తున్నారు. కీలక రక్షణ కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసిన యూనస్
సముద్రంలో వినియోగించే ఆదునిక టగ్ బోట్ నిర్మాణాల కోసం.. కోల్ కతా కి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ డీల్ విలువ 180 కోట్ల పైమాట. ఈ బోట్లను తయారు చేసే GRSE డిఫెన్స్ డిపార్ట్ మెంట్ కింద పని చేస్తోంది. తాజాగా బంగ్లా ఈ డీల్ క్యాన్సిల్ చేసుకున్న విషయాన్ని స్టాక్ మార్కెట్ తెలియ చేసింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ మాకు ఇచ్చిన ఆర్డర్ రద్దు చేసుకుందంటూ.. ఈ ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ టగ్ బోట్లతో ఓడలను నెట్టడానికి, సాల్వేజ్ ఆపరేషన్లకు వాడుతారు.
ఈశాన్య రాష్ట్రాల సముద్ర అనుసంధానానికి.. ఢాకానే దిక్కు- యూనస్
భారత్ కు వ్యతిరేకంగా గతంలో యూనస్ తీసుకున్న నిర్ణయాలు చేసిన కామెంట్లు ఏంటని చూస్తే.. పాకిస్థాన్ లాగానే బంగ్లా సైతం చైనాకు దగ్గరయ్యే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.. అటు వాళ్లు కాశ్మీర్ ని టార్గెట్ చేసుకుంటే.. ఇటు యూనస్ నాయకత్వంలోని బంగ్లా మన ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇటీవల చైనా సందర్శించిన యూనస్.. అక్కడి నుంచి సంచలన కామెంట్లు చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాల చుట్టూ భూభాగంతో మూసుకుపోయాయి. ఈ ప్రాంతాలను సముద్రంతో అనుసంధించాలంటే ఢాకానే దిక్కంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
యూనస్ కార్యవర్గానిదీ తరచూ ఇదే ధోరణి
యూనస్ కార్యవర్గంలోని వారు సైతం తరచూ ఈ రాష్ట్రాలపై ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ చర్యల కారణంగా భారత్ తో బంగ్లా దూరం మరింత పెరిగింది. యూనస్ తదితర బంగ్లా నాయుకుల భారత వ్యతిరేక వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో భారత ఓడరేవులను బంగ్లా వాడుకోవడంతో పాటు, రోడ్డు మార్గం ద్వారా వచ్చే బంగ్లా ఉత్పత్తులపై కేంద్రం ఈ నెల 18న నిషేధం విధించింది.
కోల్ కతా నుంచి మాత్రమే అనుమతులు
బంగ్లా నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్ కతా వంటి నౌకాశ్రయాల ద్వారా మాత్రమే భారత్ లోకి అనుమతిస్తామని తెలిపింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, ఉడెన్ ఫర్నీచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటెమ్స్ వంటి వాటిని మేఘాలయా, అస్సాం, త్రిపుర, మిజోరాం, ఫుల్ బరి వంటి కస్టమ్స్ స్టేషన్స్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్ లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది కేంద్రం. దీంతో భారత్ గుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ కారణంగానే భారత్ తో ఉన్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల రోడ్ మ్యాప్ కోరిన ఖలీదా జియా
ఇలాంటి ఎన్నో అంశాల్లో నిర్ణయం తీసుకునే అధికారం.. యూనస్ ప్రాతినిథ్యం వహిస్తోన్న తాత్కాలిక ప్రభుత్వానికి లేదంటారు ఆర్మీ చీఫ్ వకార్. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేదని అందువల్లే తాను రాజీనామా చేస్తానని యూనస్ అంటున్నట్టు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాత్కాలిక ప్రధాని యూనస్ పదవీ కాలం ముగుస్తుంది. అంతకు ముందు.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా స్పష్టమైన రోడ్ మ్యాప్ కోరారు. ఖలీదా జియాతో పాటు.. ఆ పార్టీ సభ్యుడు ఇస్లాం అలంగీర్ బంగ్లాదేశ్- ప్రజాస్వామ్య భవిష్యత్ పై కమ్ముకున్న నల్ల నీడగా యూనస్ ను అభివర్ణించారు. రాబోయే ఎన్నికలను ఆలస్యం చేయడానికి, ప్రజల ఓటు హక్కును హరించడానికి యూనస్ కుట్ర చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటు హక్కు హరించే కుట్ర చేస్తోన్న యూనస్-BNP
అయితే సంస్కరణలన్నీ పూర్తయ్యి.. ఈ ఏడు డిసెంబర్ నుంచి వచ్చే ఏడు జూన్ మధ్య ఎన్నికలు జరుగుతాయంటారు యూనస్. యూనస్ కి సన్నిహితుడిగా నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ చీఫ్ ఇస్లాంకి పేరుంది. ఆయన మాటలను బట్టీ చూస్తే యూనస్ రాజీనామా అంశాన్ని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ కోణంలో చూస్తే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తోంది. చైనాతో కలిసి యూనస్ మన ఈశాన్య రాష్ట్రాలపై కుట్రలకు పాల్పడే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మరింత రాద్ధాంతానికి గురయ్యే అవకాశం ఉండటంతో.. సైన్యం యూనస్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.