Rahul Gandi : ఇది సావర్కర్ విజన్‌కు, మహాత్మగాంధీ విజన్‌కు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ విషయంపై చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. మా పార్టీలో నియంతలు లేరు. ఇది భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్ మెంట్. ఈ వ్యాఖ్యలు ఎక్కడో చేయలేదు సావర్కర్ సొంత రాష్ట్రం మహారాష్ట్ర లోని వాసిం జిల్లాలో నిర్వహించిన సభలో చేశారు. వీర్ సావర్కర్ బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ల చిహ్నం అని రాహుల్ వ్యాఖ్యానించారు. అలాగే క్షమాభిక్ష కోసం బ్రిటిషర్లకు సావర్కర్ లేఖ రాశారని పేర్కొంటూ ప్రతులను రాహుల్ ఆధారంగా చూపారు. సావర్కర్ బ్రిటిషర్లకు భయపడే ప్రాణభిక్ష ప్రసాదించాలని లేఖ రాశారని వివరించారు. రెండు మూడేళ్లు అండమాన్ జైళ్లో ఉండగానే.. క్షమాభిక్ష ప్రసాదించాలని బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారని అన్నారు. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపాయి. అయినా సరే మరోసారి రాహుల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సావర్కర్ బ్రిటీషర్ల నుంచి పింఛన్ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని రాహుల్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే భారత్ జోడో యాత్రను ఆపాలని సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌పై రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కాషాయ నేతలు మండిపడ్డారు. హిందుత్వ సిద్ధాంతాలను అవమానిస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. సావర్కర్‌ను అవమానించేలా మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు.
ఉద్ధమ్ థాక్రే రాహుల్ వ్యాఖ్యలపై స్పందించారు. వీర్ సావర్కర్ అంటే తమ పార్టీకి అపార గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీపై ఉద్ధవ్ మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు.