Ram Mandir Korean Connection: సౌత్ కొరియా.. ఇండియాలో చాలా మందికి తెలుసు. కొరియన్ వెబ్ సిరీస్‌లు, బీటీఎస్ బ్యాండ్ మన దగ్గర చాలా పాపులర్. అదే సౌత్ కొరియాలో.. మన ఇండియన్స్ ఇంకా పాపులర్. అక్కడ భారతీయ మూలాలున్న వారు.. కొన్ని లక్షల మంది ఉన్నారని మీకు తెలుసా? వాళ్లందరూ.. రామ జన్మభూమి అయోధ్యని.. మాతృభూమిగా భావిస్తారని ఎంతమందికి తెలుసు? అయోధ్య నుంచి వెళ్లిన ఓ యువరాణి.. వాళ్లందరికీ రాణిగా ఎలా మారింది? అసలు.. అయోధ్యతో.. సౌత్ కొరియాకు ఉన్న రాయల్ కనెక్షన్ ఏంటి? వన్స్ అపాన్ ఏ టైమ్.. ఏం జరిగింది?
మనం ఎప్పుడూ పట్టించుకోని ఓ కథ!
మనందరికీ అంతగా తెలియని ఓ పురాణం!
భారతీయులంతా తెలుసుకోవాల్సిన ఓ నిజం!
సాధారణంగా ఏ దేశానికైనా.. మరో దేశంతో దౌత్యపరమైన సంబంధాలుంటాయి. వాణిజ్య, వ్యాపార ఒప్పందాలుంటాయి. అలా.. ఇండియా, సౌత్ కొరియా మధ్య కూడా మంచి సత్సంబంధాలున్నాయి. కానీ.. వీటిని మించిన లింక్ మరొకటుంది. అదే.. కరక్ రాజవంశం. అయోధ్య మూలాలున్న కరక్ తెగవారు.. సౌత్ కొరియాలో 60 లక్షల మందికి పైనే ఉన్నారు. ఇదంతా.. ఓ 40, 50 ఏళ్ల కిందటి వ్యవహారం కాదు. మన అయోధ్యకు, దక్షిణ కొరియాకు.. శతాబ్దాల నాటి లోతైన సంబంధం ఉంది.
తమ రాణి ఉద్యానవనాన్ని సందర్శించిన కొరియా బృందం
ఇప్పటికీ.. కరక్ తెగ వారు తమ మూలాల్ని గుర్తుంచుకొని మరీ.. ప్రతి ఏటా అయోధ్యకు వచ్చి వెళ్తుంటారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన 78 మంది ప్రతినిధుల బృందం.. అయోధ్య రామాలయాన్ని సందర్శించి.. సరయూ నది దగ్గర హారతి కార్యక్రమంలోనూ పాల్గొంది. తమ రాణి ఉద్యానవనాన్ని సందర్శించి.. తమ సాంస్కృతిక మూలాలను స్మరించుకున్నారు. రెండున్నరేళ్ల క్రితం అయోధ్యలో నిర్మించిన హెయో రాణి స్మారక చిహ్నానికి నివాళులు సైతం అర్పించారు.
అయోధ్యని అమ్మమ్మగారిల్లులా భావించే కరక్ తెగ ప్రజలు
ఈ కరక్ తెగవారికి.. మన అయోధ్య ఎంతో ప్రత్యేకమైనది. దీనిని వారు.. తమ అమ్మమ్మగారిల్లులా భావిస్తారు. అందుకోసమే.. క్వీన్ హియో మెమోరియల్ పార్క్‌ని ప్రతి ఏటా సందర్శిస్తారు. 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో.. ధ్యాన మందిరం, రాజు, రాణికి అంకింతం చేసిన మంటపాలు, ఫౌంటెయిన్లు, మార్గాలు, చిత్రాలు ఉన్నాయి. ఈ మంటపాలు.. టైల్డ్ వాలు పైకప్పుతో.. కొరియన్ డిజైన్‌లో నిర్మించారు. ప్రతి ఏటా ఈ స్మారక చిహ్నం దగ్గర నివాళులు అర్పించేందుకు అయోధ్యకి వస్తుంటారు. పురాతన కొరియన్ చరిత్ర గ్రంథమైన.. సంగుక్ యుసా ప్రకారం.. రాణి హియో హాంగ్‌ని.. గిమే హియో కుటుంబాలు తల్లిగా భావిస్తాయి. ఆమె.. క్రీస్తు శకం 48లో.. అయుత నుంచి కొరియా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. రాణి వచ్చిన అయుత అనే ప్రాంతమే.. మన అయోధ్యగా చెబుతున్నారు. ఆమె ఇప్పటికీ కరక్ వంశానికి చెందిన గిమే హియో కుటుంబాలకు తల్లిగా గౌరవించబడుతోంది.
రెండు దేశాల సంబంధాలకు అయోధ్య గొప్ప సంకేతం
భారత్‌తో.. సౌత్ కొరియాకు ఉన్న సత్సంబంధాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన అంశంగా.. అయోధ్య కనిపిస్తోంది. దక్షిణ కొరియా కూడా ఇదే చెబుతూ ఉంటుంది. అయోధ్యకు చెందిన రాణి సురిరత్న.. కొరియా రాజు కిమ్ సురో మధ్య ఉన్న వైవాహిక సంబంధం ఆధారంగా.. రెండు దేశాల సంబంధాలకు.. అయోధ్య గొప్ప సంకేతంగా, ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది. 2015లో.. ప్రధాని మోడీ, దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు మూన్ జే-ఇన్.. క్వీన్ హియో స్మారక చిహ్నాన్ని విస్తరించేందుకు ఒప్పందంపై సంతకం చేశారు. 2018లో సౌత్ కొరియా ప్రథమ మహిళ.. కిమ్ జంగ్-సూక్.. సుందరీకరణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
సౌత్ కొరియా వర్గాలకు బాగా తెలిసిన క్వీన్ హియో హాంగ్
2019లో.. భారత ప్రభుత్వం రాణి సహియో హాంగ్ స్మారకంగా.. 25 రూపాయలు, 5 రూపాయల తపాలా స్టాంపులని కూడా విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా వాజ్‌పేయి ప్రభుత్వంలో రామ జన్మభూమి అయోధ్య నుంచి వెళ్లిన ఓ యువరాణి.. దక్షిణ కొరియాకు రాణి అయిందనే విషయాన్ని గుర్తించారు. ఆ సమయంలోనే.. యూపీ ప్రభుత్వం, కొరియాలోని గిమ్హే నగరపాలక సంస్థ కలిసి.. 2001లో సరయూనది ఒడ్డున ఓ స్మారక చిహ్నాన్ని నిర్మించాయి. అప్పట్నుంచి.. ప్రతి ఏటా కొందరు కరక్ ప్రతినిధులు అయోధ్యకు వచ్చి.. ఇక్కడ నివాళులు అర్పించడం సంప్రదాయంగా మారింది. వాస్తవానికి.. క్వీన్ హియో హాంగ్ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ.. సౌత్ కొరియా వర్గాలకు ఆమె బాగా తెలుసు. ఈ కరక్ రాజవంశం కూడా.. పుసాన్ సమీపంలో ఉన్న కిమ్హే పట్టణంలో ఉంది. దీనిని ఇప్పుడు బుసాన్ అని పేరు మార్చారు. ఇది.. సౌత్ కొరియా రాజధాని సియోల్ తర్వాత.. అత్యధిక జనాభా కలిగిన నగరంగా ఉంది.
అయోధ్య రాణి కొరియా జర్నీ
క్వీన్ హియో హాంగ్.. అయోధ్య నుంచి కొరియా ఎలా వెళ్లింది? సముద్రం దాటి వెళ్లి మరీ.. అక్కడి రాజుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? రాణి హియో అసలు పేరేంటి? వేల ఏళ్ల క్రితం ఏం జరిగింది? చరిత్ర చెబుతున్నదేంటి?
2000 సంవత్సరాల క్రితం..
4500 కిలోమీటర్ల దూరం..
క్రీ.శ 48. ఈ భారత నేలకు ఎంతో దూరాన ఉన్న ఓ దేశాన.. కలలాంటి ఓ నిజమైన సంఘటన జరిగింది. అదే.. క్వి హియో హాంగ్ పెళ్లి. కొరియన్ పురాణాల ప్రకారం.. 2 వేల ఏళ్ల క్రితం అయోధ్యకు చెందిన ఓ యువరాణి.. ఓ రాజు కోసం 4500 కిలోమీటర్లు పడవలో ప్రయాణించి సముద్రం దాటింది. సౌత్ కొరియాలో గయ రాజ్యాన్ని స్థాపించిన రాజు కిమ్ సురోను వివాహం చేసుకుంది. అలా.. అయోధ్య యువరాణి సురి రత్న.. రాణి హియో హాంగ్ ఓకేగా మారింది. ఆ సమంయలో.. రాణి సురి రత్నతో పాటు అయోధ్య నుంచి కొందరు కొరియా వెళ్లారు. అలా.. వారి సంతతి పెరిగి పెద్దదైంది. ఇప్పటికీ.. కొరియాలో రాణి సురి రత్న వారసులు ఉన్నారు. తమ మూల స్థానం అయోధ్య అని చెప్పే 60 లక్షల మంది కరక్ తెగవారు సౌత్ కొరియాలో నివసిస్తున్నారు. ఇప్పటికీ.. ఆమెకు నివాళులర్పించేందుకు కొందరు కొరియా నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు.
క్వీన్ హియో హాంగ్ మూలకథని.. పౌరాణికంగా భావిస్తారు.
రాణి సురి రత్నకు సంబంధించి.. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కొన్ని చైనీస్ భాషా గ్రంథాల ప్రకారం.. అప్పటి అయోధ్య రాజుకు ఓ కల వచ్చిందట. అందులో.. దేవుడు తన 16 ఏళ్ల కుమార్తెను.. దక్షిణ కొరియాకు పంపి.. రాజు కిమ్ సురోను వివాహం చేసుకోవాలని ఆదేశించాడని చెబుతుంటారు. సౌత్ కొరియాలోని ప్రసిద్ధ కథలు, చారిత్రక కథల ప్రకారం.. రాణి సురి రత్న .. కింగ్ కిమ్ సురోని వివాహం చేసుకున్న తర్వాత కరక్ రాజవంశం ఎంతో అభివృద్ధి చెందింది. వారికి.. 10 మంది సంతానం. వాళ్లిద్దరూ.. 150 ఏళ్లకు పైగా జీవించారని నమ్ముతారు. క్వీన్ హియో హాంగ్ మూలకథని.. పౌరాణికంగా భావిస్తారు. కొరియాలో సంప్రదాయకంగా పిల్లలు తమ తండ్రి ఇంటిపేరుని తీసుకుంటారు. పురాణం ప్రకారం.. కింగ్ సురో.. తన ఇద్దరు కుమారు రాణి హియో పేరుని తీసుకునేందుకు అనుమతించారు. అది.. ఇప్పటికీ వాడుకలో ఉంది. చరిత్ర చెబుతున్న దాని ప్రకారం.. కింగ్ సురో, క్వీన్ హియో వారసులు.. 60 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇది.. సౌత్ కొరియా జనాభాలో దాదాపు 10 శాతం.
కొరియా-భారత్ మధ్య ఈ విధమైన ఓ పురాతన బంధం
రాణి సురి రత్న అయోధ్య నుంచి కొరియాకు సముద్ర మార్గంలో వెళ్లింది. ఆ సమయంలో.. తన పడవని స్థిరంగా ఉంచేందుకు ఉపయోగించిన రాళ్లని కూడా.. కరక్ రాజవంశానికి చెందిన వాళ్లు భద్రపరిచారు. సౌత్ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్, మాజీ ప్రధాని కిమ్ జోంగ్-పిల్ కూడా తమ పూర్వీకులు కరక్ వంశానికి చెందినవారుగా చెప్పుకుంటారు. భారత్, దక్షిణ కొరియా మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు అభివృద్ధి చెందిన తర్వాత.. ఇండియాలో ఈ ఉమ్మడి చరిత్ర గుర్తింపు పొందింది. చరిత్ర అయినా, పురాణమైనా.. దాని ఆధారంగా ప్రజల మధ్య ఆధ్యాత్మిక అంతరం తగ్గుతుంది. ఓ సాధారణ సాంస్కృతిక పునాది ఏర్పడుతుంది. కొరియా-భారత్ మధ్య ఈ విధమైన ఓ పురాతన బంధం ఉండటం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలను నిర్మించుకునేందుకు.. రాణి సురి రత్న కథ కూడా కీలకంగా మారుతుంది. లక్షలాది మంది కొరియన్లు.. ఇప్పటికీ కింగ్ కిమ్ సురో, క్వీన్ హియో స్థాపించిన రాజవంశాన్ని అనుసరిస్తున్నారు. వారు అయోధ్యను తమ రాణి మాతృభూమిగా భావిస్తారు. అందుకోసమే.. ఏటా వందలాది మంది కొరియన్ టూరిస్టులు అయోధ్యకు వచ్చి.. క్వీన్ హియో మెమోరియల్‌ని సందర్శిస్తారు.