MLA Payal Shankar: ఎక్కడైనా ఉప్పు, నిప్పు కలుస్తాదా..? ఎప్పుడైనా పులి, జింక స్నేహంగా ఉండటం చూశారా…? ఎన్నడైనా తూర్పు పడమర ఒకటవం గురించి విన్నారా..? లేదు కదా..! కానీ ఆదిలాబాద్‌లో అన్ని వింతలు ఒకేసారి జరిగాయి..! ఉప్పు నిప్పు కలిసినట్లు.. పులి, జింక స్నేహం చేసినట్లు.. తూర్పు పడమర ఒకటైనట్లు. తన బద్ద శత్రువైన కాంగ్రెస్‌ను, బీజేపీ పొగడ్తల్లో ముంచెత్తింది. ఓ కాషాయ ఎమ్మెల్యే.. ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ఈ పొగడ్తలే.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి..? ఆ ఎమ్మెల్యే మదిలో ఏ ఆలోచన ఉంది..?
పాలు నీళ్లలా కాంగ్రెస్, బీజేపీ
కాంగ్రెస్, బీజేపీ అంటేనే పాము, ముంగీస లెక్క. రెండు పార్టీల నేతలు నిత్యం విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఈ నెల 04వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మాత్రం..కాంగ్రెస్, బీజేపీ.. ఉప్పు నిప్పులా కాకుండా.. పాలు నీళ్లలా ప్రవర్తించాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై.. బీజేపీ ఎమ్మెల్యే ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా అదిలాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల పేరిట ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభలో సీఎంతో పాటు పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్…తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
రేవంత్ రెడ్డిది గొప్ప మనసన్న పాయల్ శంకర్
సీఎం రేవంత్ రెడ్డిది గొప్ప మనసంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశంసించారు. సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే ఎంతో ఆత్రుతగా ఎదురుచూశానన్న పాయల్ శంకర్.. తనకు సీఎం రేవంత్‌పై విశ్వాసం, నమ్మకం ఉందని తెలిపారు. తాను గెలిచింది బీజేపీ ఎమ్మెల్యేగా అయినా.. తన నియోజకవర్గానికి ఏది అడిగినా సీఎం కాదనకుండా చేస్తున్నారని పొగిడారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో ముఖ్యమంత్రి సహకారం కోరినప్పుడు ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి గొప్పగా హామీ ఇచ్చారన్నారు.
700 ఎకరాలకు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీవో
ఇచ్చిన మాట ప్రకారం కేంద్రం ఏర్పాటు మంజూరు చేయగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. 700 ఎకరాలకు సంబంధించి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీవో ఇచ్చారని ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రశంసించారు. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో తాను చేసిన సూచనలు పరిగణలోకి తీసుకొని రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పొలం బాట కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టబోతున్నారని.. అందుకు ఎమ్మెల్యే పాయల్.. ధన్యవాదాలు తెలిపారు.
రూ. 8.5 లక్షల కోట్ల అప్పులు
ఇదే సమయంలో గత బీఆర్ఎస్ సర్కారును ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎండగట్టారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. ఎనిమిదన్న లక్షల కోట్ల అప్పులు చేసిందని మండిపడ్డారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని సెటైర్లు వేశారు. మరోవైపు తాను ముఖ్యమంత్రిని పదే పదే కలుస్తున్నాడని విమర్శలు వస్తున్నాయని.. ఈ జిల్లాను అమితంగా ఇష్టపడే ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి మెప్పుకోసమే ప్రశంసలు ?
అయితే పాయల్ శంకర్.. సీఎం రేవంత్ రెడ్డిని పొగిడి.. బీఆర్ఎస్‌ను తిట్టడంపై చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి మెప్పుకోసమే పాయల్ శంకర్.. ఆయనపై ప్రశంసలు కురిపించి.. బీఆర్ఎస్‌ను ఎండగట్టారని టాక్ వినిపిస్తోంది. పాయల్ శంకర్ తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీతో మొదలు పెట్టారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీతోనే రాజీకీయాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని పాయల్ పొగడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాయల్ పాత స్నేహంతో కొనియాడారా..? లేక మరేదైనా ఉద్దేశంతో ప్రశంసించారా అని స్థానిక నేతలు ఆలోచనలో పడ్డారట. కొందరైతే.. త్వరలో పాయల్ శంకర్..కాంగ్రెస్‌లోకి జంప్ అవుతాడని.. అందుకే ఈ పొగడ్తలే సంకేతమనుకుంటున్నారట.
Also Read: సర్పంచ్ ఎన్నికలు.. పార్టీలకు రెబల్స్ దెబ్బ
మొత్తానికి బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఈ రేంజ్‌లో పొగడటం ఆదిలాబాద్ ప్రజలను ఆలోచనలో పడేసిందట. ఉన్నఫలంగా పాయల్..పొగడ్తల రాగం అందుకోవడం వెనుక ఆంతర్యమేంటి అనే చర్చ మొదలైంది. ఎమ్మెల్యే మదిలో ఏముంది..? ఆయన ఎందుకు అంతగా పొగడాల్సి వచ్చిందని ప్రజలు, బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.
Story By Kishan, Bigtv