KCR: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ ప్రచారపర్వంలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఓటరును కలవడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 21తో నామినేషన్ దాఖలు గడువు ముగుస్తుండటంతో ప్రచారంలో ముందుండెందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సుమారు 60 మంది క్షేత్రస్థాయి.. ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
డివిజన్ల వారిగా ప్రచారం:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు డివిజన్లలో సంపూర్ణంగా.. మరో మూడు డివిజన్లలో పాక్షికంగా విస్తరించి ఉంది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్‌పేట్, బోరబండ డివిజన్లు పూర్తిగా, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ డివిజన్లు పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. డివిజన్ వారీగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగించింది. వీరు స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పర్యవేక్షించేలా ప్రణాళిక చేస్తున్నారు. బయటి నియోజకవర్గాల నుంచి వచ్చిన 60 మంది ముఖ్య నేతలకు మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రచార బాధ్యతలు అప్పగించారట. ఒక్కో ముఖ్య నేత తమతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి తమకు కేటాయించిన బూత్‌లలో ప్రచారం చేసేలా వ్యూహారచన చేస్తున్నారట.
ప్లాన్ రెడీ:
మాజీ మంత్రులు, ముఖ్య నేతలే కాకుండా బయటి నుంచి సుమారు వేయి మంది జెడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి నేతలు ప్రచారానికి తరలిరానున్నట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బూత్‌ల వారీగా ముఖాముఖి సమావేశం నిర్వహించి ఇన్‌చార్జీలకు ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తున్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత తొలిసెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, హాల్ మీటింగ్స్‌లో పాల్గొనేలా ప్లాన్ రెడీ చేస్తున్నారట.
రంగంలోకి కేసీఆర్:
పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ ఉప ఎన్నికల ప్రచారం పాల్గొంటారనే ప్రచారం నడుస్తుంది. ఇప్పటి వరకూ ఫామ్ హౌస్ నుంచే వ్యూహా రచన చేస్తున్న కేసీఆర్ బైపోల్ ప్రచారంలో పాల్గొంటారనేది బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న సంకేతాలు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలను కేసీఆర్ ద్వారా చేప్పిస్తే ప్రజల్లోకి బాగా వెళ్తుందని పార్టీ ముఖ్యనేతల ఆలోచిస్తున్నారట. కానీ కేసీఆర్ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇంత వరకూ స్పష్టత రాలేదు.
Also Read: కేశినేని రూలింగ్.. కొలికపూడి తిరుగుబాటు..
కార్యకర్తలతో సమావేశాలు:
బీఆర్ఎస్‌కు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్దమవుతుంది. అభ్యర్ధి ప్రకటన నుంచి ప్రచారంలో బీఆర్ఎస్ ముందే ఉందని చేప్పుకోవచ్చు. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకపోకముందు నుంచే డివిజన్‌ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించింది బీఆర్ఎస్. పార్టీ ముఖ్యనేతలందరూ ఇప్పటికే ప్రచారంలో తిరుగుతున్న పరిస్ధితి. పార్టీకి బైపోల్ కీలకం కావడంతో అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని కారు పార్టీ ఆలోచన చేస్తుందట. ఎప్పటికప్పుడు ఇంటర్నల్ సర్వేలు చేయిస్తూ ఎక్కడెక్కడ వీక్‌గా ఉన్నామో అక్కడ నేతలను సమన్వయం చేసుకుంటూ ఒడిదుడుకులను అధిగమించేలా ప్లాన్ చేస్తుందట నాయకత్వం.
Story By Apparao, Bigtv