Telangana BJP: తెలంగాణ బీజేపీలో సంప్రదాయంగా కొనసాగుతున్న పాత నేతల పెత్తనం పోగొట్టి ప్రక్షాళన చేయడం సాధ్యమేనా..? ఇప్పటికైనా పార్టీలో చేరుతున్న ముఖ్య నేతలతో కొత్త కమిటీలు వేస్తారా..? లేక ప్రస్తుతమున్న కమిటీలనే కొనసాగిస్తారా..? కనీసం కమిటీల్లోనైనా కొత్త నేతలకు అవకాశం ఇస్తారా..? లేక కొత్త నేతలు పనికి రారని పాత వారితోనే బండి నడిపిస్తారా? అసలు టీ బీజేపీలో నూతన అధ్యక్షుడు రామచంద్రరావు మార్క్ ఎలా ఉండబోతుంది..?
తెలంగాణ బీజేపీ ప్రక్షాళన దిశగా అడుగులు
తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయంటున్నారు. ప్రస్తుతమున్న కార్యవర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో అతి త్వరలో నూతన కార్యవర్గం ఏర్పాటు కాబోతుందన్న ప్రచారం ఊపందుకుంటోంది. అందుకు రాష్ట్ర బీజేపీ పెద్దలు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారంట. ఆ క్రమంలో కొత్త కార్యవర్గం కూర్పు ఎలా ఉండబోతుందా అన ఆ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
స్టేట్ చీఫ్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు
కొత్త కమిటీల ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో ఆశావహులు స్టేట్ చీఫ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లా, రాష్ట్ర కమిటీలో స్థానం కోసం ఆశావహులు క్రమంగా పెరుగుతుండటంతో తమకు అవకాశం వస్తుందో..? లేదోననే ఉత్కంఠ నేతల్లో మొదలైంది. కనీసం కమిటీల్లో అయినా కొత్త నేతలకు అవకాశం కల్పిస్తారా..? లేక మొండిచేయి చూపుతారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి విధేయుడిగా ఉన్న రామచంద్రరావుకు అధిష్టాన పెద్దలు పట్టం కట్టారు. మరి నూతనంగా ఏర్పాటు కాబోతున్న కమిటీల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది..
కమిటీల్లో తమ మార్క్ చూపించుకున్న కిషన్, సంజయ్
అధ్యక్షుడిగా బండి సంజయ్ తప్పించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. కిషన్ రెడ్డి వచ్చాక కమిటీలో పలు మార్పులు జరిగాయి. బండి సంజయ్ ముద్రపడిన పలువురిని తప్పించి కిషన్ రెడ్డి తన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కమిటీల్లో తమ మార్క్ చూపించారని గతంలో చెప్పుకున్నారు. మరి ఈ కొత్త కార్యవర్గం అంశంలో రామచంద్రరావు తన మార్క్ చూపిస్తారా? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే స్టేట్ చీఫ్‌గా పార్టీలోని పాత నేతకు అవకాశం ఇవ్వడంతో ఇప్పటికే రచ్చ పీక్ స్టేజీకి చేరుకుంది.
కొత్త వారికి అవకాశం కల్పించాలంటున్న నేతలు
కనీసం కమిటీలోనైనా కొత్త వారికి అవకాశం కల్పించాలని వలస నాయకులు ఆశిస్తున్నారు. పార్టీ బలోపేతం అవ్వాలన్నా, పార్టీలో చేరికలు పెరగాలన్నా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పలువురు చెబుతున్నారు. అంతేకాదు కొత్త నేతలను బుజ్జగించేందుకయినా కమిటీల్లో చోటు కల్పిస్తారని పలువురు భావిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా రాష్ట్ర పార్టీ స్పష్టంగా పార్టీ పదవులు పాత వారికేననే ధోరణితో ఉందంట. పాత వారయితేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని, చేరికలు సైతం పెరుగుతాయన్న అంచనాల్లో కమలం పార్టీ ఉన్నట్లు సమాచారం. కొత్త వారికి రాజకీయ పదవుల్లో మాత్రం అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తున్న కాషాయనేతలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాషాయ పార్టీ ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. అందుకు అనుగుణంగా కమిటీలను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాదు త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పార్టీ కసరత్తును ముమ్మరం చేస్తోంది. ఇతర పార్టీల కంటే ఒకడుగు ముందంజలోనే ఉండాలని పట్టుదలతో ఉంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు వర్క్ షాప్, శిక్షణ తరగతులతో దిశానిర్దేశం చేయాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇటు కార్యవర్గాల కమిటీ నియామకం, అటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఆశావహులు నూతన అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారంట.
Also Read: IVF, సరోగసీ పేరుతో జరిగే మోసలేంటి? అధికారులు ఏమంటున్నారు?
తక్కువ టైంలో కొత్త కమిటీ ఏర్పాటు సాధ్యమవుతుందా?
అధ్యక్షుడి ఎన్నికకు ముందు ఏ నేతను కలిస్తే ఏ నేతకు దూరమైపోతామోనని డైలమాలో ఉన్న పార్టీ శ్రేణులకు రామచంద్రరావుని ఫైనల్ చేయడంతో కాస్త ఉపశమనం లభించినట్లైందని అంటున్నారు. ఇక కొత్త కార్యవర్గం ఏర్పాటుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే సిగ్నల్ ఇచ్చారు. పదవులకోసం నన్ను కలిసేందుకు ప్రయత్నం చేయకండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాక్షేత్రంలో ఉండండి, పని చేయకుండా పదవులు సాధ్యం కాదంటూ స్పష్టం చేశారు. మరి స్థానికి సంస్థలు దగ్గర పడుతున్న నేపధ్యంలో.. ఇంత తక్కువ టైంలో కొత్త కమిటీ ఏర్పాటు సాధ్యమవుతుందా..? నేతలు సహకరిస్తారా..? లేక మరింత ఆలస్యమవుతుందా..? అన్న చర్చలు కమలం పార్టీలో జోరందుకుంటున్నాయి.
Story By Rami Reddy, Bigtv