గతంలో ఎన్నడూ చంద్రబాబు ఇలా ప్రసంగించి ఉండడనుకుంటా. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభ వేదికగా బాబు ప్రసంగం మోడీని కట్టిపాడేసింది.
చంద్రబాబు సీనియర్ సీఎం. అడ్మినిస్ట్రేషన్‌పై మంచి పట్టున్న నాయకుడిగా దేశం గుర్తింపు పొందిన నేత. మంచి విజనరీ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి బాబు.. మోడీని ఆకాశానికెత్తాడు ఈ వేదికగా. ఇందులో అర్థమూ ఉంది. పరమార్థమూ ఉంది. పుణ్యం పురషార్ధంలాగా.. బాబు ఏమి మాట్లాడినా దానికో మీనింగు ఉంటుంది.
అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. అక్కడి ప్రజల బాగు కోసం ఆయన కమిట్‌మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఇవాళ భోగాపురంలో మరోసారి వెల్లడైంది. అయితే ఇది కొంచెం భావోద్వేగం కలగలిసిన ప్రసంగంగా మారింది. అందులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీనే మోడీని కట్టిపాడేసిందని చెప్పాలి.
ఆయన ఇచ్చిన సహకారంతో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించుకుంటున్నామో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు బాబు. మోడీని కీర్తించడంలో కాస్త అతి అనిపించినా..అది అప్పటి సందర్భానికి, ఏపీ అవసరానికి సబబేననిపించింది. అందరూ నిలబడి మోడీని జేజేలు పలకాలన్న బాబు మాటలు కూడా కట్టిపాడేశాయి ప్రధానిని.
ఏన్డీయేలో ఉన్నందుకు, మోడీనే ప్రధానిగా ఉన్న క్రమంలో దేశానికి ఏ విధంగా మేలు జరుగుతుందో వివరించే క్రమం బాగా కనెక్టయ్యింది. ఏపీకి జరిగిన లాభం.. ఇచ్చిన చేయూతను గుర్తు చేసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపిన విధానం కదిలించింది. ఇంకా భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నారో వివరిస్తూనే.. దానికి కేంద్ర మద్దతు ఎప్పటిలాగే ఉంటుందనే విషయాన్ని తన ద్వారానే ప్రకటించేసుకున్నాడు బాబు.
మరో ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తానన్న ఆయన.. మరో రెండేళ్లలో అమరావతిని పూర్తి చేసి ఈ రెండూ మోడీ చేతలు మీదుగానే ప్రారంభింపజేస్తానని ప్రకటించుకోవడం మూలంగా మోడీ మద్దతు, నిధుల కేటాయింపులు.. సహకారం ఉంటుందనే విషయాన్ని ప్రజల సాక్షిగా చెప్పించుకుని ఒప్పుంచుకున్నట్టైంది.
బాబు వ్యూహం ఇక్కడ ఫలించిందనే చెప్పాలి. ప్రపంప దేశాలు కూడా మోడీ విజన్‌ను ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పిన బాబు.. తన రాజకీయ జీవితంలో మోడీలాంటి నేతను చూడలేదని చెప్పడం.. మోడీ మనసును తాకింది. ఇది తిరుగులేని అస్త్రంగా.. కేంద్రంతో అనుకున్న పనులు చేయించుకునేందుకు బాబు వేసిన మాటల మంత్రం బాగా పనిచేసిందనే చెప్పాలి.