Dhimsa Dance Guinness Record: ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఇక ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్వాగతం పలికింది. సుమారు 13 వేల మంది గిరిజన మహిళలు, విద్యార్థినులు కలిసి సంప్రదాయ ధింసా నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతిని దేశానికి పరిచయం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న వాళ్లంతా పాడేరు, అరకు, సీతంపేట, పార్వతీపురం, రాంపచోడవరం లాంటి ఐటీడీఏ ప్రాంతాల గిరిజన సంక్షేమ విద్యాసంస్థల నుంచి ఎంపికయ్యారు. గత కొన్ని రోజులుగా వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అందరూ ఒకే తరహా సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శన ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రయాణించే మార్గానికి ఇరువైపులా నృత్యకారులు బృందాలుగా నిలబడి ధింసా నృత్యం చేశారు. మొత్తం 433 బృందాలుగా ఏర్పడి ఒకేసారి నృత్యం చేయడం ఈ కార్యక్రమంలోని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ ప్రదర్శనను ప్రపంచంలోనే అతిపెద్ద ధింసా నృత్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ డ్యాన్స్ ప్రదర్శన అనంతరం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఈ నృత్య నిర్వాహకులకు సర్టిఫికేట్ అందించారు. నిర్వాహకులు ఈ అరుదైన గుర్తింపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు రూ.4,700 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 3,800 మీటర్ల పొడవైన రన్‌వే ఉండటంతో పెద్ద అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలు, భారీ కార్గో విమానాలు కూడా సులభంగా రాకపోకలు కొనసాగించే అవకాశం టుంది. ఈ విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దీని వల్ల ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీ తగ్గడంతో పాటు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, సముద్ర ఆధారిత పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఒకవైపు ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తూనే, మరోవైపు వేలాది మంది గిరిజన కళాకారులతో ధింసా నృత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే అరుదైన కార్యక్రమంగా ఈ వేడుక నిలిచింది. గిన్నిస్ రికార్డు సాధించి రాష్ట్రానికి మరో గర్వకారణంగా మారింది.
Read Also: భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం.. ప్రధానికి ఏపీ తరపున ఇచ్చిన గిఫ్ట్ ఇదే!