BigTV English

Tirupati Laddu Sanctity Restored: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..

Tirupati Laddu Sanctity Restored: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..

అపచారం జరిగింది.. దోషాన్ని పోగొట్టాం.. భక్తులెవరూ ఆందోళన పడొద్దు. తిరుమల కొండపై మహా శాంతియాగాన్ని నిర్వహించిన తర్వాత టీటీడీ ఈవో చెప్పిన మాటలివి. అవును రాజకీయంగా కల్తీ నెయ్యి దుమారం ఎలా ఉన్నా.. మొదట భక్తులను శాంత పరచాలి. వారి అనుమానాలు తీర్చాలి. అలా జరగాలంటే సంప్రోక్షణ జరగాలి. దోష నివారణ చేయాలి. అందుకే మహా శాంతి యాగాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన మహా శాంతియాగ హోమం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి యాగాన్ని నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని యాగబావి వద్ద యాగశాలలో, మూడు హోమగుండాలైన వాస్తు, సభ్యం, పౌండరీకలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. అలాగే చేశారు. ఆ తర్వాత పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళ మాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేశారు. స్వామి వారి ప్రసాదంలో కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నిజానికి తిరుమల ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియక జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఆగస్టులోనే ఆలయంలో అన్న ప్రసాదపోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశారు కూడా. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించారు. కల్తీ నెయ్యితో ఏమైనా దోషాలు ఉండుంటే కూడా తొలగిపోయాయంటున్నారు. రెగ్యులర్ గా దోషాలను పోగొట్టే యాగాలు, సంప్రోక్షణలు జరుగుతున్నా.. ఇప్పుడు భక్తుల్లో అనుమానాల నివృత్తి కోసం శాంతియాగం చేశారన్న మాట.


Also Read: సనాతన ధర్మం జోలికి వస్తే వదిలేది లేదు.. ప్రకాష్ రాజ్ జాగ్రత్త : పవన్ వార్నింగ్

తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అవడంతో అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టారు. రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇదివరకే ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఉండాలన్నారు. మరోవైపు పవన్ కామెంట్స్ దీక్షలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇదని, విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలన్నారు. కానీ అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ఎక్స్ లో ప్రశ్నించారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు అని పోస్ట్‌ చేశారు. ధర్మ పరిరక్షణ కోసం పవన్ తగిన చర్యలు తీసుకుంటారని మిగితా నటులు ప్రకాశ్ రాజ్ కు కౌంటర్లు ఇస్తున్నారు.

మరోవైపు చేయాల్సిందంతా చేసి పవిత్రత గురించి జగన్ కు మాట్లాడే అర్హత ఏదని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉందని అఫిడవిట్ ఇస్తేనే ఇతర మతస్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని, కానీ జగన్ ఏనాడూ అఫిడవిట్ ఇవ్వలేదన్నారు. గతంలో సోనియా, అబ్దుల్ కలాం వంటి వారు అఫిడవిట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అంతే కాదు.. వైసీపీ హయాంలో జరిగిన బోర్డు నియామకాలు, కొండపై జరిగిన వ్యవహారాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బోర్డు మాజీ ఛైర్మన్ భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతారని, భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేశారని గుర్తుచేశారు. ఎవరిని మభ్యపెడుతున్నారంటూ ప్రశ్నించారు.

బీజేవైఎం కార్యకర్తలు మాజీ సీఎం జగన్ ఇంటి ముందు ఆందోళన చేశారు. ఇంటి గోడలపై సింధూరం, గేట్లకు కాశాయ రంగు పూశారు. ఈ మొత్తం వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతుండడంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ జగన్‌ ఆ లేఖలో ప్రస్తావించారు. అంతే కాదు. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. చంద్రబాబు దుష్ప్రచారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారన్నారని విమర్శించారు. తిరుమలకు వచ్చే నెయ్యి నాణ్యతను పరీక్షించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 14 నుంచి 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ప్రధానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు జగన్. మొత్తంగా లడ్డూ చుట్టూ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా మాత్రం కనిపించడం లేదు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఎంటర్ అవుతుందా.. లేదంటే సిట్ దర్యాప్తుతో నిజాలు నిగ్గు తేలుతాయా అన్నది చూడాలి.

Related News

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Big Stories

×