E-Paper
Advertisement

Secunderabad Cantonment: కొత్త చట్టం లేదు.. విలీనం లేదు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కథ తేలేదెప్పుడు?

Secunderabad Cantonment: కొత్త చట్టం లేదు.. విలీనం లేదు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కథ తేలేదెప్పుడు?

Secunderabad Cantonment: సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం అంశం.. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దశాబ్దాల కాలంగా పరిష్కారం కాని ఈ సమస్య.. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ చేపట్టిన దీక్షతో మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు కంటోన్మెంట్‌లో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యం ఎందుకు అటకెక్కింది? విలీనం కథ ఎక్కడ ఆగింది?

4 లక్షల జనాభా… కానీ ఓటు హక్కు లేదు!

సికింద్రాబాద్ కంటోన్మెంట్.. దేశంలోనే రెండో అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డు. ఇక్కడ 4 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఐదేళ్లుగా ఇక్కడ ప్రజాస్వామ్యం ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. కంటోన్మెంట్‌లని మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దేందుకు.. కేంద్రం తెస్తానన్న కొత్త చట్టం లేదు. కంటోన్మెంట్‌లని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తామని కేంద్రమే తెచ్చిన ప్రతిపాదనకు ఇప్పటిదాకా దిక్కులేదు. కొత్త చట్టం రాక, విలీనం జరగక.. ఐదేళ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రజాస్వామ్యమే లేకుండా పోయింది. ఇదేమని అడిగితే.. ప్రతిసారీ ఏదో ఒక సాకుతో దాటేయడమే తప్ప.. ఒక్క అడుగు కూడా మందుకు పడట్లేదు. కంటోన్మెంట్‌లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కొందరు కోర్టుకెళ్లినా ప్రయోజనం లేదు. కొద్దిరోజుల క్రితమే ఢిల్లీ హైకోర్టు ఎన్నికలపై తేల్చాలంటూ.. కేంద్రానికి స్పష్టమైన సూచన చేసింది. దాంతో.. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనంపై అనుమానాలు

2023 జనవరిలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తోనే విలీన ప్రక్రియ మొదలు పెట్టిన కేంద్రం.. ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అది ఒక్కసారి మాత్రమే సమావేశమైంది. అందులో ఏం చర్చించారో.. ఇప్పటిదాకా బహిర్గతం కాలేదు. ఇదిలా ఉంటే.. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగి పదకొండేళ్లు దాటింది. 2015లో జరిగిన ఎన్నికల తర్వాత మళ్లీ ఇప్పటివరకు బోర్డుకు ఎన్నికలు జరగలేదు. ఐదేళ్ల సాధారణ పదవీకాలంతో 2020లోనే గడువు ముగిసినా.. కేంద్రం ఏదో ఒక సాకుతో నామినేటెడ్ సభ్యులతోనే బండి లాగిస్తోంది. ప్రజా ప్రతినిధులు లేకుండానే ఐదేళ్లుగా బోర్డులో అధికారుల పాలనే కొనసాగుతోంది. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ, ప్రత్యేక పాలన కొనసాగించడంపై ప్రతిపక్షాలు నిలదీస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. 8 మంది అధికారులు, 8 మంది ప్రజాప్రతినిధులతో కూడిన బోర్డు స్థానంలో.. నాలుగేళ్లుగా వెరీడ్‌ బోర్డునే కొనసాగిస్తున్నారు. స్థానిక మిలిటరీ స్టేషన్‌ కమాండర్‌ అధ్యక్షుడిగా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే బోర్డులో.. కేంద్ర ప్రభుత్వం నియమించే సివిలియన్‌ నామినేటెడ్‌ మెంబర్‌ మరో సభ్యులుగా ఉంటారు. ఈ పోస్టుకు బీజేపీ నేతలను మాత్రమే కేంద్రప్రభుత్వం నామినేటెడ్‌ సభ్యుడిగా నియమిస్తూ వస్తోంది.

విలీనం చేసేదాకా పోరాటం ఆగదు.. ఎమ్మెల్యే

2015 ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్‌గా తొలి మూడేళ్లు రామకృష్ణ ఉన్నారు. 2025 జనవరి నుంచి భానుక నర్మద నామినేటెడ్‌ మెంబర్‌గా ఉన్నారు. తాజాగా ఆవిడ పదవీకాలాన్ని మరో ఏడాది పాటు గానీ కొత్త పాలకమండలి కొలువుదీరేంత వరకు గానీ పొడిగిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ రాకేష్ మిట్టల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుతో పాటు దేశంలోని 55 కంటోన్మెంట్‌ బోర్డుల గడువును ఏడాది పాటు పొడిగించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో స్థానిక ప్రజల సమస్యలు వినేందుకు.. వార్డు సభ్యులు లేకపోవడంతో, సామాన్యులు అధికారుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల మధ్య సమన్వయం లేక.. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఐదేళ్లుగా ఎన్నికలు జరపకుండా నామినేటెడ్ సభ్యులతోనే పాలన సాగించడాన్ని స్థానికులు తీవ్రంగా నిరసిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్‌ సైతం కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తక్షణమే కంటోన్మెంట్‌ బోర్డ్‌ ఎన్నికల నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన నిరాహార దీక్షకు దిగారు. కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేసేదాకా తమ పోరాటం ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

విలీనం చేయకపోతే.. పోరాటం ఉద్ధృతం చేస్తాం..

కేంద్ర ప్రభుత్వం.. కంటోన్మెంట్ బోర్డును గ్రేటర్ ముున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయకుండా, ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయ్. కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే.. కార్పొరేషన్‌లో విలీనం కావడమే ఏకైక మార్గమని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. కంటోన్మెంట్ ప్రాంతం కేంద్రం ఆధీనంలో ఉండటంతో.. 3 దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిధుల లేమితో.. తాగునీరు, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా అందడం లేదని ఇక్కడి జనం చెబుతున్నారు. ఇప్పుడు గనక గ్రేటర్‌లో విలీనం చేయకపోతే.. పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

దశాబ్దాల డిమాండ్.. కానీ దక్కని విలీనం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ఏరియాని.. జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనేది దశాబ్దాల డిమాండ్. కానీ.. అది నెరవేరట్లేదు. ఇదే టైమ్‌లో కంటోన్మెంట్‌లను మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దుతామని, 2020లో చట్టంలో మార్పులు చేస్తూ.. కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల పాటు పార్లమెంట్‌ సమావేశాల ఎజెండాలో చేర్చినా.. బిల్లుకు ఆమోదం లభించలేదు. దాంతో.. కొన్నాళ్లకే దేశ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్‌లను.. సమీప స్థానిక సంస్థల్లో విలీనం చేస్తామంటూ కేంద్రమే సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాయగా, తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి, బేషరతుగా అంగీకరించింది. దాంతో.. 2023 జనవరిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి.. విధి, విధానాలపై చర్చించింది. తర్వాత అదే ఏడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్‌ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. తీరా.. నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందనే లోపే.. అర్ధంతరంగా నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది. ఈ ఎపిసోడ్ తర్వాత వివిధ రాష్ట్రాల్లో
కంటోన్మెంట్‌ల విలీనానికి సంబంధించిన ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనం ఊసే లేకుండా పోయింది. 2024 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రక్షణ శాఖ మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టింది. అంతే.. ఈ ఇష్యూ ఇక్కడితో ఆగిపోయింది.

200 ఏళ్ల చరిత్ర… కానీ మార్పు లేని పాలన

200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కంటోన్మెంట్‌లో.. బ్రిటీష్ జమానాలోనే ప్రత్యేక పాలన మొదలైంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి అనేక చట్టాలు అమల్లోకి వచ్చినా, కంటోన్మెంట్‌లలో మాత్రం ఎలాంటి మార్పుల్లేవు. దాదాపు 80 ఏళ్ల తర్వాత 2006లో కొద్దిపాటి మార్పులతో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 1987 వరకు కంటోన్మెంట్‌ బోర్డుకు మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగ్గా, 1992 నుంచి ఐదేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. మూడేళ్ల కిందట కంటోన్మెంట్‌లని స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించినా.. సికింద్రాబాద్ విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు. తెలంగాణ ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినా.. ఈ విషయం మాత్రం తేలట్లేదు. ఇందుకు ప్రధానంగా కొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయ్. కంటోన్మెంట్‌లో రక్షణ అవసరాలకు కేటాయించిన భూములను సైన్యం తన దగ్గరే ఉంచుకుంటుంది. కానీ, పౌర ప్రాంతాల్లోని లీజు భూములు, పాత గ్రాంట్ భూముల యాజమాన్య హక్కులు ఎవరికి ఉండాలి? అన్నది ప్రధాన వివాదం. ఈ భూముల బదిలీ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది.

కంటోన్మెంట్ విలీనం ఆలస్యం.. అప్పులు, పెన్షన్ల భారం ఎవరిది?

కంటోన్మెంట్ బోర్డుకు ఉన్న వేల కోట్ల అప్పులను, ఉద్యోగుల పెన్షన్ బాధ్యతలను ఎవరు భరించాలి? అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు అవసరం. తాజాగా.. కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి పదవీకాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. దీనివల్ల.. విలీనం కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్‌లో విలీనం చేస్తే.. అక్కడి ప్రజలకు కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయ్. మెరుగైన రోడ్లు, తాగునీటి సరఫరా, ప్రభుత్వం నుంచి ఇండ్లు వస్తాయి. కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యంత కఠినమైన బైలాస్ ఉన్నాయి. చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా.. ఏళ్ల తరబడి అనుమతుల కోసం వేచి చూడాలి. రక్షణ శాఖ భద్రత పేరుతో తరచుగా రోడ్లు మూసేయడం వల్ల స్థానికులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వస్తుంది. విలీనం జరిగితే.. ఇలాంటి అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

కంటోన్మెంట్ వివాదం వేడెక్కింది.. దీక్షతో ఢిల్లీ దాకా చర్చ

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తామని గతంలోనే ప్రకటించింది. కొన్ని చోట్ల ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ, సికింద్రాబాద్ విషయంలో మాత్రం స్పష్టత కరువైంది. రక్షణ శాఖ ఆస్తుల అప్పగింత, ఉద్యోగుల సర్దుబాటు లాంటి టెక్నికల్ అంశాలను సాకుగా చూపుతోంది. అయితే.. స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ చేపట్టిన దీక్ష కంటోన్మెంట్ రాజకీయాల్లో వేడి పుట్టించింది. గతంలో కేవలం వినతిపత్రాలకే పరిమితమైన పోరాటం, ఇప్పుడు దీక్షా వేదికగా మారడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రాజకీయాలకతీతంగా స్థానిక ప్రజలు సైతం ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. విలీనం అయితేనే.. తమ బతుకులు మారతాయని బలంగా నమ్ముతున్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలతో.. ఈ కాలంలో పాలన సాగించడం అసాధ్యం. అందువల్ల.. కేంద్ర ప్రభుత్వం వెంటనే విలీన ప్రక్రియకు గడువు ప్రకటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయ్. ప్రభుత్వం కూడా రాజకీయాలకు తావు లేకుండా.. కేంద్రంతో చర్చలు జరిపి, ఆస్తుల బదిలీపై అవగాహనకు రావాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వివాదానికి ఎండ్ కార్డ్ పడాలంటే.. ఢిల్లీ స్థాయిలో కదలిక రావాలి. ఈ క్రమంలో రక్షణ శాఖ నుంచి ఏదైనా స్పష్టమైన ప్రకటన వస్తుందా? మళ్లీ కాలయాపన చేస్తారా? అన్నదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×