PM Modi: మొన్నటికి మొన్న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఎలాంటి విషాదాన్ని మిగిల్చిందో చూశాం. ఆ దాడిని ఇండియా మర్చిపోనేలేదు. అంతలోనే.. మరో ఉగ్రదాడి! ఈసారి.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే బాంబ్ పేలుడు సంభవించడం.. అందరినీ షాక్‌కి గురిచేస్తుంది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. మన దేశంలో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా.. దాినిని దేశంపై దాడిగానే చూస్తామని అప్పుడు కేంద్రం ప్రకటించింది. మరి.. ఇప్పుడు ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారు? ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్‌కి మించిన ప్రతీకారం ఉంటుందా? ఈ దాడి వెనుక పాక్ ఉగ్ర సంస్థలు ఉన్నట్లు తేలితే.. మరో భారీ స్ట్రైక్ చూస్తామా?
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మిగిల్చిన విషాదాన్ని మర్చిపోకముందే.. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తర్వాత.. దేశంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా.. దానిని యావత్ భారత్‌పై దాడిగా పరిగణిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో.. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతోందనే ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నెక్ట్స్ ఏం చేయబోతోంది అనే దానిపైనే.. అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో అమాయక భారత ప్రజలు అసువులు బాశారు. ఇది ఆత్మాహుతి దాడి అయినా కావొచ్చు, లేకపోతే పేలుడు పదార్థాలను తరలిస్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంటల్ బ్లాస్ట్ అయినా.. అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ పేలుడు ఎలా సంభవించిందనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడుకు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడుకు గురైన కారులో ఉన్న వ్యక్తి.. డాక్టర్ మహ్మద్ ఉమర్‌గా గుర్తించారు. ఇతను.. ఫరీదాబాద్ మాడ్యూల్‌లో ఉగ్రవాది అని నిఘా వర్గాలు తేల్చాయ్.
ఫరీదాబాద్‌లో భారీ స్థాయిలో 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం, డాక్టర్ల ముసుగులో ఉన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ వార్త.. దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో.. తాను కూడా పట్టుబడతాననే భయంతోనే.. టెర్రరిస్ట్ ఉమర్ ఈ దాడికి పాల్పడటం గానీ, లేక తన దగ్గరున్న పేలుడు పదార్థాలను మరో చోటుకు తరలించేందుకు చేసిన ప్రయత్నం వల్ల గానీ ఈ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానాలున్నాయి. ఇప్పుడు.. ఈ కోణాల్లోనే ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ దారుణ ఉగ్రదాడిపై.. ప్రధాని మోడీ కూడా తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ పేలుళ్ల కుట్రదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగానే చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు.. ఈ దాడికి సంబంధించిన మూలాలను గుర్తించి.. అందుకు కారణమైన వాళ్లని వెంటాడతాయని, బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఇదే ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్ర దాడి జరిగినప్పుడు.. భారత సర్కార్ ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై గట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ దేశ ప్రజల్లో ఐక్యతను పెంచడంతో పాటు భారత ధృడ సంకల్పాన్ని మిగతా ప్రపంచానికి చాటి చెప్పింది. ఇప్పుడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోనే., అది కూడా ఎర్రకోట సమీపంలో దాడి జరగడం అనేది.. దేశ భద్రతని సవాల్ చేస్తోంది. ఇదొకి.. ఉగ్ర మూకల నుంచి వచ్చిన తీవ్రమైన హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉగ్ర సంస్థల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే గనక.. కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? అన్న దానిపై.. తీవ్ర చర్చ జరుగుతోంది.
2016లో ఉరి టెర్రర్ ఎటాక్, 2019లో పుల్వామా ఎటాక్ తర్వాత.. భారత్ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా గట్టి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఏడాది జరిగిన పహల్గామ్ ఎటాక్ తర్వాత.. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో.. పాకిస్థాన్‌లోని కీలక ఉగ్రస్థావరాలన్నింటిని ఎయిర్ స్ట్రైక్స్‌తో ధ్వంసం చేసింది. సుమారు వంద మంది వరకు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించారు. ఆ తర్వాత.. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అవి.. యుద్ధం వరకు దారితీశాయ్. ఇంత జరిగిన తర్వాత కూడా ఉగ్రమూకలకు బుద్ధి రాలేదు. భారత్‌లో అలజడి సృష్టించేందుకు, ఉగ్రదాడులతో.. భారత్‌లో అశాంతి రేపేందుకు ప్రయత్నిస్తున్నాయ్. అందులో భాగంగానే.. ఇక్కడున్న వారిని తమవైపు ఆకర్షించుకుంటూ.. రాడికలైజేషన్ చేస్తున్నాయ్. ఈ క్రమంలోనే.. ఢిల్లీలో కారు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు కూడా పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్ర స్థావరాలపై.. భారత్ మరో భారీ స్ట్రైక్ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దేశంపై దాడి అంటే.. కేవలం కశ్మీర్‌లో మాత్రమే కాదు. దేశ రాజధానిలో జరిగిన ఈ దాడికి మించిన ప్రతీకారం ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు.. దేశంలోని స్లీపర్ సెల్స్‌ను, లోకల్ మాడ్యూల్స్‌ని ఉపయోగించుకుంటున్నట్లుగా రుజువైతే.. దేశవ్యాప్తంగా నిఘా పెంచి, టార్గెటెడ్ యాంటీ-టెర్రర్ ఆపరేషన్లని పెంచే అవకాశం ఉంది. ఇందులో.. ఫరీదాబాద్ మాడ్యూల్‌ని గుర్తించడమే తొలి అడుగు. అంతేకాదు.. పాకిస్థాన్‌ని అంతర్జాతీయ వేదికలపై మరోసారి ఏకాకిని చేసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచొచ్చు. బాంబు పేలుడు తర్వాత.. పహల్గామ్ తర్వాత ఢిల్లీలోనూ అంతర్గత భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయ్. దేశ సరిహద్దులతో పాటు ముఖ్యంగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో.. భద్రతా బలగాల మోహరింపు, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి.. ఢిల్లీ బ్లాస్ట్‌కి సంబంధించిన దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. అయితే.. దేశ రాజధానిపై జరిగిన ఈ దాడిని ప్రభుత్వం ఏమాత్రం తేలికగా తీసుకోలేదనే చర్చ నడుస్తోంది. ప్రధాని మోడీ హెచ్చరికల ప్రకారం.. ఈ దాడి వెనుక ఎంతటి ఉగ్ర సంస్థ ఉన్నా.. ప్రతీకారం తీవ్రంగా, కౌంటర్ ఎటాక్ స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఈసారి చేపట్టబోయే ఆపరేషన్.. ఇండియాలోని ప్రతి పౌరుడికి భద్రతపై భరోసానిచ్చే విధంగా ఉండాలని జనం కోరుతున్నారు.
ఢిల్లీ కారు బ్లాస్ట్ మాడ్యూల్ మూలాలు.. రాడికలైజేషన్‌తో ముడిపడి ఉన్న రెండు టెలిగ్రామ్ గ్రూపులతో లింక్ అయి ఉన్నాయి. ఇండియా అంతటా లాజిస్టిక్స్, పేలుడు పదార్థాలను సమన్వయం చేయడంలో.. ఈ టెర్రరిస్ట్ డాక్టర్లే కీలకపాత్ర పోషించారు. అయితే.. ఈ ఉగ్రదాడి వెనుక జైషే మహ్మద్ ఫౌండర్.. మసూద్ అజార్ ఉండొచ్చనే అనుమానం బలపడుతోంది. ముంబై, పార్లమెంట్, పఠాన్‌కోట్, పుల్వామా దాడుల వెనుక ఉన్న మసూదే.. ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ వెనుక కూడా ఉన్నాడనే చర్చ జరుగుతోంది. అదే నిజమైతే.. భారత్ మరో సిందూర్ లాంటి ఆపరేషన్‌తో గట్టి బుద్ధి చెబుతుందా?
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ మూలాన్ని.. రెండు టెలిగ్రామ్ గ్రూపుల నుంచి గుర్తించారు. ఫర్జాందన్-ఎ-దారుల్ ఉలూమ్, ఉమర్ బిన్ ఖత్తాబ్ అనే ఈ గ్రూపులు.. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ టెర్రరిస్టులు నడుపుతున్నారు. డాక్టర్లను తీవ్రవాదం వైపు ఆకర్షించడంలో.. ఈ గ్రూపులే కీలకపాత్ర పోషించాయని భావిస్తున్నారు. ఎర్రకోట దగ్గర బ్లాస్ట్ అయిన ఐ20 కారుని నడుపుతున్న డాక్టర్ ఉమర్.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న డాక్టర్లను.. రాడికలైజ్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వీరి వెనుక.. షోపియన్‌కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ వాఘా.. ఈ గ్రూపుల్లో ఒకదాని ద్వారా రాడికలైజేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొదట్లో వీరి సంభాషణలు.. కశ్మీర్ ఆజాదీ, కశ్మీరీల అణిచివేతకు సంబంధించి మొదలయ్యాయి. ఆ తర్వాత.. నెమ్మదిగా గ్లోబల్ జిహాద్, ప్రతీకారం లాంటి విస్తృత లక్ష్యాలకు మారింది.
ఈ టెలిగ్రామ్ గ్రూప్ నిర్వాహకులు విదేశాలకు వెళ్లినప్పుడు కొందరు సభ్యులను కలిశారని.. దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ టెర్రరిస్ట్ మాడ్యుల్ రూపుదిద్దుకోవడంలో.. టర్కీ టూర్ కీలకంగా మారినట్లు చెబుతున్నారు. టర్కీ నుంచి తిరిగొచ్చిన తర్వాతే.. ఈ టీమ్ భారతదేశమంతటా తమ కార్యకలాపాలను విస్తరించినట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో చేరగా, డాక్టర్ అదీల్ సహారన్‌పూర్‌లో పోస్టింగ్ పొందాడు. ఇతర సభ్యులను.. రిక్రూట్‌మెంట్, లాజిస్టిక్స్ నిర్వహించేందుకు.. వివిధ రాష్ట్రాల్లో ఉంచినట్లు తెలుస్తోంది. మాడ్యూల్ సభ్యులతో సంబంధాలు కొనసాగించిన ప్రతి ఒక్కరినీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇప్పుడు గుర్తించే పనిలో ఉన్నాయ్. డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షాహీన్‌తో కలిసి దాదాపు 10 మంది సభ్యులు.. ఈ టెర్రర్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నారు. వీరిలో.. ఐదారుగురు డాక్టర్లే ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ డాక్టర్లంతా.. తమ వృత్తిపరమైన అవకాశాలను ఉపయోగించుకొని.. పేలుడు పదార్థాలను సమీకరించడంతో పాటు నెట్‌వర్క్ కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంతలోనే.. ఎర్రకోట పేలుడుకు సంబంధించిన కమ్యూనికేషన్లను ట్రాక్ చేసేందుకు.. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కారు పేలుడు సంభవించడానికి ముందు.. డాక్టర్ ఉమర్ ఎవరెవరితో ఫోన్ కాల్ మాట్లాడారో తెలుసుకునేందుకు.. మొబైల్ టవర్ డేటాని కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు.
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ వెనుక.. ఏకంగా జైషే మహమ్మద్ నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.
జైషే మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో షాహీన్‌కు కీలక బాధ్యతలు అందించినట్లు తెలుస్తోంది. భారత్‌లో మహిళా విభాగాలు స్థాపించి, వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందువల్ల.. ఢిల్లీలో జరిగిన ఈ కారు బ్లాస్ట్‌కు ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా.. జైషే టెర్రర్ గ్రూప్‌తో లింక్ ఉంటుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు.. అంతర్జాతీయ ఉగ్రవాది, పాకిస్థాన్ రక్షణలో ఉన్న మసూద్ అజార్ బాస్. భారతదేశంలో ఉగ్రదాడులకు పాల్పడే అగ్ర నేరస్థుల్లో.. అతనొకడు. ఢిల్లీ నడిబొడ్డున జరిగిన పేలుడు తర్వాత.. మరోసారి అందరి దృష్టి మసూద్ అజార్ మీదకే మళ్లింది. ముంబై పేలుళ్ల దాడుల నుంచి ఢిల్లీ కార్ బ్లాస్ట్ దాకా.. అతను పాక్ ఐఎస్ఐ నిధులు సమకూర్చే.. టెర్రర్ మాడ్యూల్‌లో ఇతనే కీలక సూత్రధారి.
Also Read: బీహార్ ఎగ్జిట్ పోల్స్ రివర్స్..! ఆయన పరిస్థితి ఏంటి?
ఇప్పటికీ.. మసూద్ అజార్‌కు తాము రక్షణ ఇవ్వడం లేదని పాకిస్థాన్ వాదిస్తోంది. అయితే.. ఈ ఉగ్రవాది పాక్ నీడలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడనేది బహిరంగ రహస్యమే. ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్‌తో.. అజార్‌కు ఇప్పుడు సంబంధం ఉందని తేలిపోయింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ.. భారత్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడింది. IC-814 హైజాక్ సమయంలో బందీలుగా ఉన్న విమాన ప్రయాణికులకు బదులుగా.. భారత్ మసూద్‌ని విడుదల చేసింది. ఆ తర్వాత.. అతను 1999 ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 2019 పుల్వామా దాడిలో మసూద్ హస్తం ఉంది. ఇప్పుడు.. ఢిల్లీ పేలుడు వెనుక కూడా అతని పేరే వినిపిస్తోంది. అనేక మంది అనుమానితుల అరెస్టులు, దర్యాప్తులో.. జైషేతో ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. జైషే మౌలిక సదుపాయాలు చాలా దెబ్బతిన్నాయ్. బహావల్‌పూర్‌లోని ఉగ్ర స్థావరంపై జరిగిన దాడిలో.. అజర్ కుటుంబ సభ్యులు కూడా మరణించారు. కానీ.. అజార్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పటికే.. మసూద్ అజార్ భారత్‌లో ఉగ్రదాడులు కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. జమ్ముకశ్మీర్‌లో దాడులు ముమ్మరం చేస్తానని ప్రకటించాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ నడిబొడ్డున జైషే ఉగ్ర సంస్థతో లింకులున్న వ్యక్తి కారు బ్లాస్ట్ అవడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఉగ్రదాడిపై.. భారత సర్కార్, ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
Story By Anup, Bigtv