Bihar Election Exit Poll: బీహార్ ఫలితం ఎలా ఉండబోతోందో.. ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయ్. మరోసారి అక్కడ ఎన్డీయేదే విజయమని తేల్చేశాయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాలా అరుదుగా మాత్రమే.. తప్పుతుంటాయ్. కానీ.. ఈసారి బీహార్‌లో అలా తప్పే అవకాశమే లేదంటున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ చూశాక.. మరోసారి ఎన్డీయేదే విజయమనే లెక్క తేలాక.. చాలా మందికి అనిపించింది ఒక్కటే.. తేజస్వి యాదవ్ పరిస్థితేంటి? అని! ఆర్జేడీ మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనా?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎప్పుడో ఒకప్పుడు తప్పుతుంటాయ్ తప్ప.. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్ పోల్స్‌కు దగ్గరగానే ఉంటాయ్. బీహార్‌లో మరోసారి ఎన్డీయే అధికారం చేపట్టబోతోందని వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయ్. అంతా అనుకున్న దానికి భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కనిపించడంతో.. బీహార్ ప్రజలు ఇంత కమిటెడ్‌గా తీర్పు ఇవ్వడమేంటనే చర్చ మొదలైంది. ముఖ్యంగా.. అందరి ఫోకస్ ఇప్పుడు యువ నాయకుడు తేజస్వి యాదవ్ రాజకీయ భవిష్యత్ పైనే ఉంది. ఎన్నికల ప్రచారంలో అతను చూపించిన దూకుడు, యువతను ఆకట్టుకోవడంలో సాధించిన సక్సెస్, ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిని ముందుకు నడిపించిన తీరు.. తలపండిన రాజకీయ నేతలను, పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. కచ్చితంగా.. తేజస్వి నాయకత్వంలో.. బీహార్‌లో మహాఘట్‌బంధన్ అంచనాలకు మించి పర్ఫామ్ చేస్తుందనుకున్నారంతా. కానీ.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాకే.. బీహార్‌లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అందరికీ అర్థమైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ.. దాదాపుగా ఎన్డీయేకే మొగ్గు చూపడంతో.. అంతా అవాక్కయ్యారు.
అయితే.. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చాలావరకు ఎగ్జిట్ పోల్స్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని RJD కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఫలితాలు వచ్చినప్పుడు ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, మహాకూటమి 110 సీట్లకు పరిమితమైంది. RJD పార్టీ మాత్రం అత్యధికంగా 75 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు, వాస్తవ ఫలితాలకు.. పెద్ద తేడా వచ్చింది. ఈసారి కూడా ఎన్నికలు హోరాహోరీగా సాగడంతో.. చివరి నిమిషంలో ఓటర్ల నిర్ణయం.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చనే ఆశ.. మహాఘట్‌బంధన్ క్యాంప్‌లో ఇప్పటికీ ఉంది. ఏదేమైనా.. ఈ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఓ రైజింగ్ స్టార్‌గా నిలిచారు. అతని జీవితంలో.. 2025 బీహార్ ఎన్నికలు.. ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయ్. బీహార్ పాలిటిక్స్‌లో.. నితీశ్ కుమార్ తర్వాత అంతటి బలమైన, ప్రజలను ఆకట్టుకోగల నేతగా.. తేజస్వి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా.. యువతని ఆకట్టుకోవడంలో తేజస్వి సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉద్యోగ, ఉపాధి కల్పన అస్త్రంలో జనంలోకి వెళ్లారు. బీహార్ యువత, ముఖ్యంగా నిరుద్యోగులు భారీ ఎత్తున.. తేజస్వి యాదవ్ ప్రచారానికి తరలివచ్చారు. తాము అధికారంలోకి వస్తే.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. ఓ గేమ్ ఛేంజర్‌గా మారింది.
తేజస్వి యాదవ్.. మహాఘట్‌బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. దాదాపు ఒంటరి పోరాటాన్ని నడిపించారు. నితీశ్ కుమార్, ప్రధాని మోడీ లాంటి అగ్ర నేతల ఉమ్మడి శక్తిని ఎదుర్కొని కూడా ప్రచారంలో బలంగా నిలబడ్డారు. చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చారు. ఆర్జేడీ అంటే కేవలం.. ముస్లిం-యాదవ్ ఓట్ బ్యాంక్ అపవాదును తొలగించడానికి తేజస్వి ప్రయత్నించారు. ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలకు ప్రధానం చేసి.. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేశారు. అయినప్పటికీ.. బీహార్ ప్రజలు ఎందుకు తేజస్వి యాదవ్‌కి మద్దతుగా నిలవలేకపోయారనే చర్చ మొదలైంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై.. మహాఘట్‍బంధన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. మరో ఐదేళ్లు తేజస్వి అపొజిషన్‌కే పరిమితం అవుతారు. అధికారంలోకి వస్తామనే ఆశల నుంచి.. మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవడం అనేది.. తేజస్వి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇది.. అతని రాజకీయ భవిష్యత్‌పై ప్రతికూలం ప్రభావం చూపే చాన్స్ కూడా ఉందంటున్నారు. అయితే.. ఆర్జేడీ మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచే అవకాశం ఉన్నందున.. తేజస్వి యాదవ్ బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషిస్తారా? అధికారం దక్కలేదని కుంగుబాటుకు గురవుతారా? అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. తేజస్వి యాదవ్ వయసు 40 ఏళ్ల లోపే ఉంది. రాజకీయంగా ఇది చాలా చిన్న వయసు. మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదంటున్నారు. నితీశ్ కుమార్ వయసు పెరుగుతోంది కాబట్టి.. రాబోయే రోజుల్లో తేజస్వికే ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
క్యాంపెయిన్ ఇరగదీశారు. హామీలు.. గట్టిగానే గుప్పించారు. ఈసారి.. బీహార్ మొత్తం తేజస్వి వైపే నిలబడుతుందన్నట్లుగా కనిపించింది ఎలక్షన్ పిక్చర్. కానీ.. పోలింగ్ ముగిశాక గానీ తెలియలేదు.. బీహార్ పల్స్ ఎలా ఉందనేది? ఎగ్జిట్ పోల్స్ మరోసారి ఎన్డీయే వైపే మొగ్గడంతో.. తేజస్వి యాదవ్ పడిన కష్టమంతా ఏమైపోయిందనే క్వశ్చన్ రైజ్ అయింది. ఎందుకు.. బీహార్ ప్రజలు మహాఘట్‌బంధన్‌ని నమ్మలేదు? తేజస్వి హామీలు ఓవర్ డోస్ అయ్యాయా? అలవి కానీ హామీలే.. ఆర్జేడీని ముంచేశాయా?
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలవగానే.. అందరి దృష్టిని ఆకర్షించింది రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఒక్కడే. యువ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి.. ఉవ్వెత్తున ఎగిసిన నిరుద్యోగ నిరసనను అస్త్రంగా మలుచుకుని, బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తాడనే భారీ అంచనాలు కనిపించాయ్. ముఖ్యంగా ఆయన ప్రకటించిన లక్షలాది ఉద్యోగాల హామీ ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని అంతా భావించారు. కానీ.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్.. అప్పటికే ఉన్న అంచనాలకు భిన్నంగా.. ఎన్డీయే కూటమి మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉందని సూచించాయ్. దాంతో.. తేజస్వి యాదవ్ ప్రచార హంగామా, మహాఘట్‌బంధన్ కూటమి పడిన కష్టం.. ఎందుకు ఫలించలేదనే ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా.. బీహార్ ప్రజలు ఎందుకోసమని.. ఈ యువ నాయకుడి మార్పు నినాదాన్ని పూర్తిగా నమ్మలేదనే అనుమానం కూడా అందరిలోనూ తలెత్తుతోంది.
10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్‌లో నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్న యువతని ఆకర్షించేందుకు ఇదొక బలమైన హామీ. కానీ.. చాలా మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంత ప్రజలు.. ఇదొక అలవికాని హామీగా భావించారనే చర్చ జరుగుతోంది. ఒకేసారి 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటే.. రాష్ట్ర ఖజానాపై పడే భారం, అమలులో ఉండే సవాళ్ల లాంటి అంశాలను.. ఎన్డీయే కూటమి బలంగా ప్రచారం చేసింది. ఇదే.. ఓటర్లలో సందేహాలను పెంచింది. ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయ ఓటర్లు, ఇన్‌స్టంట్ డెవలప్‌మెంట్ కంటే.. స్థిరమైన, నమ్మదగిన పాలన వైపే మొగ్గు చూపారు. తేజస్వి యువనేత అయినప్పటికీ.. ఇంత పెద్ద హామీని అమలు చేయగలిగే సామర్థ్యంపై.. జనంలో పూర్తిగా నమ్మకం కుదరలేదనేది విశ్లేషకుల మాట.
ఆర్జేడీ అంటే ఇప్పటికే చాలా మంది ప్రజలకు.. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనే గుర్తొస్తుంది. 1990ల కాలంలో శాంతిభద్రతల పరిస్థితి.. జంగల్ రాజ్ అనే అపవాదు ఇప్పటికీ ఆర్జేడీకి ఉన్న బిగ్ మైనస్ పాయింట్. సీఎం నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రచారంలో పదే పదే ఈ జంగల్ రాజ్ భయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. గత పాలన, వర్తమాన ఆర్జేడీ మధ్య తేడా లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా.. బీహార్‌లోని మహిళఆ ఓటర్లు, నితీశ్ కుమార్ పాలనలో వచ్చిన శాంతిభద్రతల మెరుగుదలను బలంగా నమ్ముతారు. ఆర్జేడీ వస్తే.. మళ్లీ పాత రోజులు వస్తాయేమోనన్న భయంతో.. వారంతా ఎన్డీయే వైపు మొగ్గు చూపారనే టాక్ ఉంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాలనపై కొన్ని అపవాదులు ఉన్నప్పటికీ, సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న అనుభవం, బీహార్‌లో రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక వసతుల అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. ఇవన్నీ స్థిరమైన పాలనకు సూచికగా ఓటర్లు భావించారు. పైగా.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బీహార్‌లో కూడా బలంగా పనిచేసి, ఎన్డీయేకు అనుకూలంగా మారాయ్.
Also Read: దారుణం.. సీనియర్ల భూతానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్మ
మహాఘట్‌బంధన్ యాదవ్, ముస్లిం ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడింది. తేజస్వి ఎంత ప్రయత్నించినా.. తన పార్టీని యాదవ్-ముస్లిం ఈక్వేషన్స్ నుంచి బయట పడేయలేకపోయారు. బీసీలు, ఈబీసీలు, మహాదళితులు.. నితీశ్ కుమార్‌కు సంప్రదాయంగా మద్దతిచ్చే వర్గాలు. వారంతా.. తేజస్వి నేతృత్వంలోని కూటమికి ఓటు వేసేందుకు పెద్దగా మొగ్గు చూపలేదనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా. తేజస్వి యాదవ్ ప్రచారం శక్తిమంతంగా కనిపించింది. యువతలో.. కొత్త ఆశల్ని రేకెత్తించింది. బీహార్ ఓటర్లు కూడా మార్పు కావాలని కోరుకున్నప్పటికీ.. మార్పు కోసం రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరనే విషయం.. ఎగ్జిట్ పోల్స్ సూచించాయ్. ముఖ్యంగా.. మహాఘట్‌బంధన్ ఇచ్చిన అలవికాని హామీలు, ఆర్జేడీకి ఉన్న జంగల్ రాజ్ చరిత్ర అనే బలహీనతలు.. నితీశ్ సుపరిపాలన ఇమేజ్, కేంద్రంలో బలమైన మోడీ నాయకత్వం ముందు నిలబడలేకపోయాయ్. బీహార్ ఓటర్లు, సంక్షోభంలో ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కోరుకున్నప్పటికీ.. శాంతిభద్రతలు, స్థిరమైన పాలనకే ప్రాధాన్యత ఇచ్చారనే విషయం తేలిపోయింది. ఏదేమైనా.. ఈ ఎన్నికలు తేజస్విని ఓ బలమైన నాయకుడిగా నిలబెట్టాయ్. ఈ ఫలితాలు.. తన నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరుచుకునేందుకు, ప్రజా సమస్యలపై మరింత లోతుగా పనిచేసేందుకు అవకాశం ఇస్తుంది. ప్రజల నుంచి ఇప్పుడు దొరికిన మద్దతుని నిలబెట్టుకుంటూ.. ప్రతిపక్షానికి గనక పరిమితమైతే.. నిర్మాణాత్మక పాత్ర పోషించడం ద్వారా.. తన నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంటుంది.
Story By Anup, Bigtv