Governor vs Government: దక్షిణ భారత రాష్ట్రాల్లోని గవర్నర్లు.. ఫుల్ గరం మీద ఉన్నారు. తమిళనాడు, కేరళ మాదిరిగానే.. కర్ణాటకలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చదవకుండా పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం.. ప్రగతి మార్గంలో నడుస్తోంది. సమావేశాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా అంటూ.. రెండే రెండు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించేశారు. తర్వాత.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సభ నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం.. గవర్నర్, కర్ణాటక గవర్నమెంట్ మధ్య విభేదాలకు దారితీసింది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది.. రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
రెండేళ్లుగా గవర్నర్ థావర్‌చంద్.. కాంగ్రెస్ సర్కార్ తయారుచేసిన.. అసెంబ్లీ ప్రసంగాలను యథావిధిగా చదివారు. ఈసారి తన ధోరణి మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలతో.. తన ప్రసంగాన్ని సిద్ధంచేసిన తీరును ఆయన ముందుగానే ఆక్షేపించారు. దాంతో.. ఆయన సభకు వస్తారా? రారా? అనే ఉత్కంఠ కూడా కనిపించింది. ఎట్టకేలకు సభకు వచ్చిన ఆయన.. రెండు లైన్లు మాత్రమే చదివి సభ నుంచి వెళ్లిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. క్యాబినెట్ సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదవుకుండా వెళ్లిపోవడంపై నిరసన తెలియజేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సుప్రీంకోర్టుని ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఎపిసోడ్‌తో.. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ తీరుపై అధికార కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గవర్నర్ ప్రసంగంలో.. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలే ఈ వివాదానికి కారణమనే చర్చ జరుగుతోంది. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందనే వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. వీటిపైనే.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వాటిని తొలగించాలని కోరారు. తొలగించకపోతే.. సభలో ప్రసగించబోననే సమాచారం కూడా ప్రభుత్వానికి పంపారు. కానీ.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ పని చేయలేదు. దాంతో.. గవర్నర్ మొక్కుబడిగా కర్ణాటక విధానసభకు రావడం, తాను చెప్పాలనున్న రెండు మాటలు చెప్పి వెళ్లిపోవడమే ఇప్పుడు డిబేట్‌కు దారితీసింది.
తమిళనాడులోనూ ఇంచుమించుగా ఇదే సీన్ కనిపించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి.. సభను ఉద్దేశించి ప్రసంగించకుండానే, సమావేశాలను బహిష్కరిస్తూ బయటకు వెళ్లిపోయారు. తమిళ తల్లి ప్రార్థన గీతం పూర్తవగానే జాతీయగీతం ఆలపించలేదని, ఇది ఆ గీతాన్ని అవమానించడమేనని తెలిపారు. సభలో ప్రసంగ సమయంలో తన మైక్ కట్ చేసి తనని అవమానించారని, అందుకే బయటకు వచ్చేశానని తెలిపారు. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ సమావేశాల నుంచి బయటికెళ్లడం ఇది వరుసగా నాలుగోసారి. ఈసారి తనకిచ్చిన ప్రసంగ పాఠంలో తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రజాసమస్యల్ని విస్మరించిందన్నారు. రాష్ట్రానికి వచ్చాయని చెబుతున్న పెట్టుబడుల్లో చాలావరకు ఒప్పందాలు పెండింగ్‌లో ఉండటం, నేరాలు పెరగడం, డ్రగ్స్ కారణంగా ఆత్మహత్యలు, టీచర్ పోస్టులు భర్తీ కాకపోవడం, పంచాయతీ ఎన్నికలు జరగకపోవడం లాంటి వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందుకోసమే.. ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ప్రకటించారు. ఈ ఎపిసోడ్.. తమిళనాడు అసెంబ్లీతో పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేసింది.
కేరళ అసెంబ్లీలోనూ ఇలాంటి ఉద్రిక్త పరిణామాలే చోటు చేసుకున్నాయ్. ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలోని కీలక భాగాలను చదవకుండా దాటవేయడం పెను వివాదానికి దారితీసింది. మంత్రివర్గం ఆమోదించి ఇచ్చిన ప్రసంగ పాఠంలోని ముఖ్యమైన అంశాలను ఉద్దేశ పూర్వకంగా చదవలేదని సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. గవర్నర్ సభ నుంచి వెళ్లిపోగానే, సీఎం విజయన్ స్పీకర్‌ని కలిసి తన నిరసన వ్యక్తం చేశారు. ప్రసంగంలోని 12వ పేరా ప్రారంభ అంశాలను, అలాగే.. 15వ పేరా ముగింపులో ఉన్న కీలక భాగాలను గవర్నర్ చదవకుండా వదిలేశారని సీఎం, స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు, రాష్ట్ర హక్కుల గురించి ప్రస్తావించినప్పుడు.. గవర్నర్లు ఇలా సెలెక్టివ్ రీడింగ్‌కి పాల్పడుతుంటారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. వరుసగా మూడు దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వివాదాస్పదం కావడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారు.. ప్రభుత్వ విధానాలకు అద్దం పట్టాల్సి ఉండగా.. ఇలాంటి ఘర్షణలు ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. గవర్నర్ల తీరు.. రాజ్యాంగపరంగా గవర్నర్ అధికారాలపై మరింత చర్చకు దారితీసింది.
సౌత్ ఇండియా స్టేట్స్‌లో.. గవర్నర్లకు, ఇక్కడి గవర్నమెంట్లకు మధ్య విభేదాలు రగులుతూనే ఉన్నాయ్. ఈ కొత్త ఏడాదిలో అవి పీక్ స్టేజ్‌కి చేరాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో.. కనిపించిన సీన్లు తీవ్ర దుమారం రేపుతున్నాయ్. సాధారణంగా గవర్నర్ ప్రసంగం అనేది.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, అంతకుముందు ఏడాది పనితీరుని ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే.. అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. గవర్నర్ గనక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ని ఆశ్రయించేందుకు వీలుంది. అంతేకాదు.. హౌస్ రూల్స్ ప్రకారం.. రాష్ట్ర మంత్రివర్గం ఏ ప్రసంగ పాఠాన్ని ఆమోదించిందో.. దానినే అధికారిక రికార్డుల్లోకి తీసుకుంటారు. గవర్నర్ కొన్ని అంశాలను వదిలేస్తూ చదివిన ప్రరసంగాన్ని అధికారికంగా గుర్తించబోమని కేరళ స్పీకర్ కూడా స్పష్టం చేశారు. అందువల్ల.. గవర్నర్ దాటవేసిన అంశాలు కూడా అసెంబ్లీ రికార్డుల్లో భాగమవుతాయ్. నిజానికి.. గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణిస్తారు.
గతంలోనూ గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినరయి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్‌కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా ఇలా మూడుసార్లు చేశారు. ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ప్రసంగం తప్పనిసరి అని, అది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమేనని స్పష్టం చేసింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై.. తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయ్. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో.. గవర్నర్ ప్రసంగం వద్దని చెబుతూ, రాజ్యాంగ సవరణ కోరాల్సిన అవసరముందన్నారు. తమ ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవనంత మాత్రాన, ద్రవిడ మోడల్ సర్కార్ విజయాల్ని, ప్రయోజనాల్ని దాచలేరన్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సీన్లు చూశాక.. తెలంగాణలోనూ అలాంటి సీనే రిపీట్ అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఇప్పటిదాకా.. గవర్నర్ విషయంలో.. మిగతా రాష్ట్రాల మాదిరి పరిస్థితులు తలెత్తలేదు. తమిళిసై సౌందరరాజున్ ఉన్నప్పటితో పోలిస్తే.. ఇప్పుడు లోక్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయ్. ఇప్పటివరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తమిళనాడు, కేరళ, కర్ణాటక తరహాలో ప్రసంగం మధ్యలో వాకౌట్ చేసేంత తీవ్రమైన పరిస్థితులు రాలేదు. కానీ.. ఈసారి జరగబోయే బడ్జెట్ సమావేశాలు అలా కాదు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం రద్దు చేసింది. దాని స్థానంలో.. వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈసారి గవర్నర్ ప్రసంగంలో.. ఈ అంశాన్ని గనక చేరిస్తే.. జిష్ణుదేవ్ వర్మ ఆ పేరాని చదువుతారా? దాటేస్తారా? చదవకుండా మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉపాధి హామీ చట్టం విషయంలో కేంద్రంపై విమర్శనాత్మకంగా ప్రసంగం ఉంటే.. గవర్నర్ వాటిని చదువుతారా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఏదేమైనా.. దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ చుట్టూ జరుగుతున్న చర్చలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యున్నత పదవిపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఘర్షణలు తీవ్రమవుతున్నాయ్. అప్పుడప్పుడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్లు దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం వల్ల పాలన స్తంభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయ్. గవర్నర్ వ్యవస్థ అనేది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఓ వారధిగా ఉండాలి. అది ఒక రాజకీయ ఆయుధంగా మారినప్పుడే ఇలాంటి ఘర్షణలు తలెత్తుతున్నాయ్.
Story by: Anup, Big Tv