BigTV English

India’s New Weapon: భారత్ అమ్ములపొదిలో నయా వెపన్స్.. ఇక శత్రు దేశాల వెన్నులో వణుకే..!

India’s New Weapon: భారత్ అమ్ములపొదిలో నయా వెపన్స్.. ఇక శత్రు దేశాల వెన్నులో వణుకే..!

India’s New Weapon: సర్వసత్తాక గణతంత్య్ర భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యాంగా ఎదుగుతోంది. దీంతో పాటే.. భారత రక్షణ సామర్థ్యాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. భారత్ అమ్ములపొదిలో కొత్త కొత్త ఆయుధాలు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా, ఆత్మనిర్భర్ భారత్ తన సొంత టెక్నాలజీతో ప్రపంచం ఉలిక్కిపడే ఆయుధాలను తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈ రిపబ్లిక్ డే పెరెడ్‌లో రెండు కీలక ఆయుధాలను దేశానికి పరిచయం చేయబోతున్నారు. శత్రు దేశాల వెన్నులో వణుకుపుట్టించే ఈ క్షిపణులు 75 ఏళ్ల గణతంత్ర దినోత్సవ వేడుకలో మరింత ప్రత్యేకంగా నిలపనున్నాయి. ఇంతకీ, ఏంటీ ఈ వెపన్స్..? వాటి సామర్థ్యాలేంటీ..? భారత రక్షణ సామర్థ్యంలో ఇలాంటి క్షిపణులు, ఆయుధాలు ఇంకేమేం ఉన్నాయి..?


బలం పుంజుకుంటున్న భారత్ త్రివిధ దళాలు

భారత్ అంటేనే ఇప్పుడు ప్రపంచమంతా అలెర్ట్ అవుతోంది. అంతర్జాతీయంగా భారతదేశ పరపతి అగ్రదేశాలకు దాదాపు సమానమయ్యింది. ముఖ్యంగా, రక్షణ రంగంలో భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తోంది. “ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా.. లేదా” అనే లెవల్లో… ఒకప్పుడు, కాస్త వీక్‌గా ఉన్న భారత రక్షణ రంగం… ఇప్పుడు సగర్వంగా ఛాతి చూపి నిలుస్తోంది. జబ్బ చరిచి కమాన్ అనే స్థాయికి వెళ్లింది. బంగ్లాదేశ్ లాంటి తోక ఊపుళ్లకే కాదు.. ఆగర్భ శత్రువు పాకిస్తాన్‌తో పాటు.. చారిత్రక ఎనిమీ చైనాలకు కూడా చెమటలు పట్టించేంతగా భారత్ రక్షణ సామర్థ్యం పెరిగింది.


ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాలు కూడా భారత్ ఆయుధాలపై ఆసక్తి

ఇప్పుడు, అగ్ర రాజ్యాలను సైతం కించింతైనా కేర్ చేయని స్థాయిలో భారత్ త్రివధ దళాలు బలం పుంజుకున్నాయి. ఒకప్పుడు, దిగుమతులపై ఆధారపడిన భారత్ రక్షణ రంగం.. 75 ఏళ్ల గణతంత్రం జరుపుకునే నాటికి ప్రపంచానికి సరికొత్త ఆయుధాలను పరిచయం చేస్తోంది. ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాలు కూడా భారత్ ఆయుధాలపై ఆసక్తి చూపుతున్నాయి. దటీజ్ భారత్ అనే విధంగా భారతదేశం తన వెపనరీని అభివృద్ధి చేసుకుంది. అందులో, సరికొత్తగా రెండు కీలకమైన ఆయుధాలను ఈ రిపబ్లిక్ డేలో ప్రదర్శిస్తున్నారు.

సొంత టెక్నలజీతో పినాక వెపన్‌ తయారీ

శత్రుదేశాల కుతంత్రాలను ధీటుగా ఎదుర్కోవాలంటే రక్షణ రంగంలో మెరుగైన ఆయుధ సంపత్తి అవసరం. అందుకే భారత్ కొన్నేళ్లుగా దీనిపై దృష్టి సారించింది. అనేక స్వదేశీ ఆయుధాలను సిద్ధం కూడా చేసింది. అందులో అత్యంత ముఖ్యమైంది పినాక. భారత భూభాగంపై కన్నేసిన చైనాకు షాకిచ్చే విధంగా భారత తన సొంత టెక్నలజీతో ఈ కొత్త వెపన్‌ను తయారుచేసింది. ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన ఈ పినాక ఎంకే-1ను భారత్ ఈ గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించనుంది. భారీ లక్ష్యాలను సైతం ఛేదించగల పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, ప్రత్యర్థి తేరుకునేలోపే టార్గెట్‌ను బూడిదగా మార్చేస్తుంది.

44 సెకండ్లలో 12 హై ఎక్స్‌ప్లోజివ్ రాకెట్లు పేల్చగల పినాక వ్యవస్థ

సాయుధ బలగాల కార్యచరణ సంసిద్ధతను మెరుగుపరచడంలో భాగంగా.. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో పినాక రెజిమెంట్‌లను మొహరిస్తున్నారు. పినాక మార్క్-1 కు 45 కి.మీ., మార్క్-2 కు 65 కి.మీ. పరిధి ఉంది. పినాక వ్యవస్థ 44 సెకండ్లలో 12 హై ఎక్స్‌ప్లోజివ్ రాకెట్లను పేల్చగలదు. ఈ వ్యవస్థ తేలిగ్గా రవాణా చెయ్యగలిగేలా, టాటా ట్రక్కుపై మోహరించి ఉంటుంది. ఇది మొదట కార్గిల్ యుద్ధంలో పాల్గొంది. పర్వతాలపై ఉన్న శత్రు దళాలను విజయవంతంగా నిర్వీర్యం చేసింది. తర్వాత, దీన్ని భారత సైన్యంలో పెద్ద సంఖ్యలో చేర్చుకున్నారు.

2014 నాటికి, ఏటా 5,000 పినాక రాకెట్లు ఉత్పత్తి

2014 నాటికి, ఏటా 5,000 పినాక రాకెట్లు ఉత్పత్తిలో ఉన్నాయి. ఎక్కువ పరిధి, అధిక కచ్చితత్వం కలిగిన మెరుగైన పినాక అభివృద్ధి దశలో ఉంది. ఈ పినాక వ్యవస్థ ధర రూ.2.3 కోట్లు. పినాక ఒక సంపూర్ణ రాకెట్ వ్యవస్థ. ఒక్కో పినాక బ్యాటరీలో… ఒక్కో దానిలో 12 రాకెట్లు కలిగిన 6 లాంచరు వాహనాలు, 3 రాకెట్ సరఫరా వాహనాలు, ఫైర్ కంట్రోల్ కంప్యూటర్ ఉన్న 2 కమాండ్ పోస్ట్ వాహనాలు ఉంటాయి. ఇందులో ఒక డిజికోరా మెట్ రాడార్ వ్యవస్థ కూడా ఉంటుంది. 6 లాంచర్లు కలిగిన ఈ బ్యాటరీ.. 1000 మీ విస్తీర్ణంలోని ప్రాంతాన్ని నిర్వీర్యం చెయ్యగల సార్థ్యంతో పనిచేస్తుంది. ఇలాంటి, 72 రాకెట్లు కలిగిన బ్యాటరీని సైన్యం మోహరిస్తుంది.

భారత్‌ ఆయుధ వ్యవస్థ పినాకపై ఆసక్తి చూపుతున్న ఫ్రాన్స్

ఈ రాకెట్లన్నిటినీ 44 సెకండ్లలో పేల్చొచ్చు. ఇక, ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల మధ్య చాలా దేశాలు మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ల పట్ల ఆసక్తిని కనబరుస్తున్న తరుణంలో.. పినాక రాకెట్‌ను ఆర్మేనియాకు కూడా సరఫరా చేయడం ప్రారంభించింది. అత్యంత శక్తివంతమైన ఈ స్వదేశీ పినాక రాకెట్‌పై ఇటీవల ఆగ్నేయాసియా, యూరప్‌లోని అనేక దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. అంతెందుకు, ప్రపంచంలోని అతి శక్తిమంతమైన దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్‌… M51 జలాంతర్గాములు, రాఫెల్‌ యుద్ధవిమానాలు, లుక్‌లెహ్‌ శతఘ్నుల వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు ఉన్నప్పటికీ…భారత్‌కు చెందిన పినాకను కావాలనుకుంటోంది. ఇందులో భాగంగా, గతేడాది నవంబర్ నుండి ఫ్రెంచ్‌ ఆర్మీ అధికారులు భారత్‌తో చర్చలు జరుపుతున్నారు.

మొట్టమొదటిసారిగా పరేడ్‌లో ప్రళయ్ మిస్సైల్ ప్రదర్శన

ఇక, మరో అత్యద్భుతమైన ఆయుధాన్ని కూడా ఈ రిపబ్లిక్‌ డేలో భారత్ ప్రదర్శిస్తోంది. మొట్టమొదటిసారిగా పరేడ్‌లో ప్రళయ్ మిస్సైల్ కన్పించనుంది. ఇది శత్రువులకు సవాలుగా మారే అత్యాధునిక ఆయుధం. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ భారత్ శక్తి సామర్ధ్యాలకు ఓ మచ్చుతునక. సరిహద్దు రక్షణలో ప్రళయ్ మిస్సైల్ కీలకంగా మారుతుంది. చైనా, పాక్‌లకు చెక్ పెట్టాడానికి, ప్రత్యేకంగా ప్రళయ్‌ను ఎల్ఐసీ, ఎల్ఓసీ‌ వెంట మొహరించేందుకు రూపకల్పన జరిగింది.

500 నుండి 1000 కిలోల వరకూ పేలోడ్ తీసుకెళ్లగలదు

శత్రువుల వ్యూహాల్ని ఇది ధ్వంసం చేయగలదు. ఇతర మిస్సైల్స్‌తో పోలిక ప్రళయ్ మిస్సైల్‌ను చైనాకు చెందిన డోంగ్ ఫెంగ్ 12, రష్యాకు చెందిన ఇస్కాండర్ మిస్సైల్‌కు సమానమని తెలుస్తోంది. ఈ మిస్సైల్ యుద్ధ మైదానంలో శత్రువులకు దీటైన సమాధానం చెబుతుంది. ప్రళయ్ మిస్సైల్ సాంకేతిక ప్రత్యేకతలు ఈ మిస్సైల్ 350 కిలో మీటర్ల నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే, 500 నుండి 1000 కిలోల వరకూ పేలోడ్ తీసుకెళ్లగలదు. లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

మిస్సైల్‌ను మొబైల్‌ లాంచర్లతో ప్రయోగించొచ్చు

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-DRDO అభివృద్ధి చేసిన ఈ వార్ వెపన్.. భూ ఉపరితలం నుండి ఉపరితలం నుండి ప్రయోగించగలిగిన స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అత్యంత కచ్చితత్వంతో ఛేజ్ చేయగలిగిన ఈ మిస్సైల్‌ను మొబైల్‌ లాంచర్లతో ప్రయోగించొచ్చు. వీటిని క్వాసీ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌గా పిలుస్తారు. ఇవి బాలిస్టిక్, క్రూయిజ్‌ మిస్సైల్స్‌ రెండింటి లాగా పనిచేస్తాయి. భారత రక్షణ రంగ వ్యూహంలో భాగంగా దేశ ఉత్తర సరిహద్దులను బలోపేతం చేయడానికి ప్రళయ్‌ క్షిపణి సేవలను వినియోగిస్తున్నారు.

దక్షిణ కొరియా హ్యూన్మూ-2తో సమానం

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగించిన ‘ప్రలే’ క్షిపణి, చైనా ‘డాంగ్ ఫెంగ్ 12’, రష్యా ‘ఇస్కాండర్’, దక్షిణ కొరియా హ్యూన్మూ-2తో పోల్చదగని ప్రళయ్‌ను ఇప్పుడు భారత్‌లోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌ల కోసం దాదాపు 500 వందల ప్రళయ్ క్షిపణులు ఆర్డర్‌లో ఉన్నాయి.

‘సంజయ్’ అనే పేరుతో ఆటోమేటిక్ నిఘా వ్యవస్థ

ఇక, భారత సైన్యం, నిఘా సామర్థ్యాలను ఆధునీకరించే దిశగా భారత్ కీలక వ్యవస్థలను కూడా రూపొందిస్తోంది. తాజాగా, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఓ యుద్దభూమి నిఘా వ్యవస్థను ప్రారంభించారు. సంజయ్ అనే పేరుతో ఉన్న ఈ అధునాతన ఆటోమేటెడ్ సిస్టమ్.. గ్రౌండ్, ఏరియల్ సెన్సార్‌ల నుండి డేటాను సేకరిస్తుంది. ఈ ఇన్‌పుట్‌లు ఆర్మీ డేటా నెట్‌వర్క్, శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఏకికృతం చేసి, కచ్చితత్వాన్ని నిర్ధారిస్తాయి. ఈ వ్యవస్థ యుద్దభూమిలో ఏం జరుగుతుందో.. అద్దంలా చూపిస్తుంది.

చొరబాట్లను నిరోధం, అనుమానమున్న పరిస్థితులపై నిఘా

దీని ద్వారా, ఆర్మీ కమాండ్, హెడ్‌క్వార్టర్స్‌కు కేంద్రీకృత వెబ్ అప్లికేషన్‌తో నిర్ణయం తీసుకోవడానికి అవసరమయ్యే ఖచ్చితమైన, రియల్-టైమ్ సమచారాన్ని అందిస్తుంది. అత్యాధునిక సెన్సార్‌లు, అత్యాధునిక విశ్లేషణలతో రూపొందించిన ‘సంజయ్’ భారత భూ సరిహద్దులను పర్యవేక్షించడం, చొరబాట్లను నిరోధించడం, అనుమానమున్న పరిస్థితులపై అవగాహన కల్పించే విధంగా పనిచేస్తుంది. ఇది, ఇంటెలిజెన్స్, నిఘా కార్యకలాపాలలో కీలకంగా ఉంటుంది. ఇది భవిష్యత్ యుద్దభూమిలో విప్లవాత్మక ఫలితాలను అందిస్తుంది.

14 లక్షల క్రియాశీల సైన్యం

భారత్ యుద్ధ సామర్థ్యం మామూలుగా లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం కలిగిన మూడో దేశంగా ఉన్న భారత్‌ను ఎదుర్కోవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే. ఇండియాన్ ఆర్మీ పవర్ తెలిపే ఒక మాట ఇక్కడ చెప్పాలి. “ఒక సైన్యంలో.. బ్రిటీష్ ఆఫీసర్, అమెరికన్ వెపన్స్, భారత సైన్యం ఉంటే… దాన్ని ఎవ్వరూ ఓడించలేరంట”. ఈ పాత కాలం నాటి నానుడికి ఇప్పుడు సరికొత్త మార్పు తోడయ్యింది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. “ఇండియన్ ఆఫీసర్, ఇండియన్ సైన్యం, ఇండియా వెపన్స్ ఉంటే..” ఎవ్వరైనా అడుగు ముందుకెయ్యాలంటే హడలిపోవాల్సిందే! ఎందుకంటే, అలాంటి అత్యాధునిక ఆయుధాలు ఇప్పుడు భారత్ సొంతం.

వందల కొద్దీ మల్టీ రాకెట్ లాంచర్లు, సెల్ఫ ప్రొపెల్డ్ గన్‌లు

14 లక్షల క్రియాశీల సైన్యం, 11.55 లక్షల రిజర్వ్ సైన్యం, 2 లక్షల పారామిలిటరీ బలగాలున్న భారత సైన్యానికి ఇప్పుడు, వేలల్లో యుద్ధ ట్యాంక్‌లు, ఆర్మర్డ్ ఫైటింగ్ వాహనాలు, టోవ్డ్ ఆర్టిలరీ వెహికిల్స్ ఉంటే, వందల కొద్దీ మల్టీ రాకెట్ లాంచర్లు, సెల్ఫ ప్రొపెల్డ్ గన్‌లు, న్యూక్లియర్ వార్ హెడ్‌లు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో.. యుద్ధం చేతులతో కాదు.. ఆయుధాల సాయంతోనే జరుగుతోంది. అందుకే భారత సైన్యం తన రక్షణ దళాలకు మూడు విభాగాల్లో సాంకేతిక అభివృద్ధిని మరింత పటిష్టం చేస్తోంది.

సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్

భారతదేశానికి ఉన్న కీలకమైన కొన్ని ఆయుధ సంపత్తిని చూద్దాం… అందులో, ముఖ్యంగా.. సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ ఒకటి. భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన క్షిపణి బ్రహ్మోస్. ఇది గంటకు 4 వేల 900 కి.మీ వేగంతో దాడి చేస్తుంది. అంటే, బ్రహ్మోస్ వెపన్.. సౌండ్ స్పీడ్ కంటే 2.8 రెట్లు ఎక్కువ వేగంతో దాడి చేయగలదు. ఇక, ఇప్పుడు ఈ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌లో… హైపర్‌సోనిక్ సామర్థ్యంతో కూడిన అధునాతన ఇంజన్‌ను కూడా అమర్చుతున్నారు.

దీర్ఘ శ్రేణి, సబ్‌-సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘నిర్భయ్’

ఇది, ధ్వని కంటే 7 రెట్లు వేగంతో పనిచేస్తుంది. ఈ క్షిపణి గురించి మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, బ్రహ్మోస్ కంటే ప్రమాదకరమైన క్షిపణి అమెరికా, చైనా, పాకిస్తాన్‌లలో లేదంటే నమ్మక తప్పదు. ఇక, మరో సూపర్ వెపన్ నిర్భయ్. ఇది, అన్ని వాతావరణాలకు అనువైన, దీర్ఘ శ్రేణి, సబ్‌-సోనిక్ క్రూయిజ్ క్షిపణి. ఈ క్షిపణిని మల్టీ ప్లాట్‌ఫామ్స్ నుండి ప్రయోగించొచ్చు. సాంప్రదాయ, అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్ని, చైనాతో ప్రతిష్టంభన సమయంలో LAC దగ్గర మోహరించారు.

రోడ్-మొబైల్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి ‘ప్రహార్’

భారత్ దగ్గర మరో బ్రహ్మాండమైన వెపన్ ఉంది. సూపర్ స్ట్రైక్ చేసే ఈ వెపన్ పేరు ప్రహార్. భారతీయ ఘన-ఇంధన, రోడ్-మొబైల్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. ప్రహార్ అత్యంత వేగంగా ప్రతిస్పందించే ఆయుధం. అన్ని వాతావరణాలకు అనువైన, అన్ని భూభాగాలకు అనువైన, అత్యంత ఖచ్చిత లక్ష్య ఛేదన కోసం.. వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థను అందించడానికి అభివృద్ధి చేయబడింది. మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మొహరించిన ఆరు క్షిపణులను కలిగి ఉంటుంది. ఇది విభిన్న టార్గెట్‌లతో వివిధ రకాల వార్‌హెడ్‌లను కలిగి ఉంటుంది.

5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి

ఒకేసారి వేర్వేరు దిశల్లోకి మిసైల్స్‌ పేల్చగలిగిన టెక్నాలజీ దీని సొంతం. ఇక, భారత్ దగ్గరున్న పృథ్వీ క్షిపణి.. అణుబాంబును మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఉపరితలం నుండి ఉపరితలం వరకు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి. ఎలాంటి యాంటీ బాలిస్టిక్ క్షిపణినైనా తప్పించుకొని, 350 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించే సామర్థ్యం కలది. మరొకటి, అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది ఉపరితలం నుండి ఉపరితలం వరకు 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి. ఇలాంటి, శక్తివంతమైన 5 రకాల అగ్ని సీరీస్‌ను భారత్ తయారు చేసింది. ఇవే కాక, భారత్ దగ్గర సౌర్య లాంటి ఆధునిక వెపన్స్ కూడా ఉన్నాయి.

విజయంత, అర్జున్, వజ్ర, జోరావర్ ట్యాంక్‌ల అభివృద్ధి

ఇక, యుద్ధ ట్యాంకుల్లోనూ భారత్ ఆత్మనిర్భరతను ఇప్పటికే సాధించింది. విజయంత దగ్గర నుండీ తీసుకుంటే.. అర్జున్, వజ్ర, జోరావర్ ట్యాంక్‌ల అభివృద్ధిలో భారత్ దూసుకుపోతోంది. ఆర్మర్డ్ ఇంజనీర్ నిఘా వాహనం లాంటివి తెలంగాణలోని మెదక్‌లో అభివృద్ధి చేసి, భారత సైన్యానికి అప్పగించారు. మానవ రహిత గ్రౌండ్ వెహికిల్ కృష్న కూడా యుద్ధ భూమిలో తన సత్తాను చాటగలదు. మరోవైపు, ఎయిర్ డిఫెన్స్‌లో కూడా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్, రిపోర్టింగ్ వ్యవస్థతో అకష్టీర్, మీడియం-రేంజ్ ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే.. బరాక్, ఆకాశ్ మిస్సైళ్లు… యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్‌ సుదర్శన్…వంటి ఆయుధ సామగ్రితో భారత్ సామర్థ్యం నానాటికీ పెరుగుతూనే ఉంది.

ఫ్యూచర్ మెయిన్ బాటిల్ ట్యాంక్

ఇప్పుడు, భారత్ మరిన్ని ఆయుధాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే, గత కొన్నేళ్లగా ఆయుధ తయారీలో భారత్ అగ్రదేశాలతో పోటీ పడుతుంది. సొంత టెక్నాలజీతో ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తిలో దూసుకెళ్తోంది. ఫ్యూచర్ మెయిన్ బాటిల్ ట్యాంక్, ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికిల్.. ఫ్యూచర్ ఇన్‌ఫాంటరీ కాంబాట్ వెహికిల్.. వంటి ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుంటుంది. అలాగే, రాబోయే కాలంలో 150 కి.మీ. లక్ష్యాన్ని ఛేదించే ప్రహార్ మిస్సైల్‌తో పాటు వెయ్యి నుండి 2 వేల కి.మీ. పరిధితో అగ్ని-P, 10 నుండి 12 వేల కి.మీ. పరిధిని చేరుకునే అగ్ని-6 వంటి అత్యాధుని ఖండాతర క్షిపణులను తయారు చేస్తుంది.

‘నాగ్’ పేరుతో యాంటీ-గైడెడ్ ట్యాంక్ మిస్సైల్

అలాగే, క్రూయిజ్ క్షిపణుల్లో భాగంగా.. హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్, నిర్భయా మిస్సైల్, బ్రహ్మోస్-NG లను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇక, ‘నాగ్’ పేరుతో యాంటీ-గైడెడ్ ట్యాంక్ మిస్సైళ్లను కూడా రూపొందిస్తోంది. ఇక, న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని 6వ దేశంగా భారత్ ఉంది. భూమి, నీరు, గాలి నుండి కూడా అణు దాడి చేయగల సామర్థ్యం భారత్ సొంతం. సో.. రక్షణ రంగంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందనడాన్ని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి, ఇకపై కూడా.. భారత్, తన సార్వభౌమత్వాన్ని, మాతృభూమిని ఏ ఇతర దేశం మద్దతు లేకుండా ఒంటరిగా కాపాడుకోగలదు.

శత్రు దేశాలకు ధీటుగా.. అత్యాధునిక ఆయుధాలతో, భారత్ ఇప్పుడు తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది. ఇక, రాబోయేది ఏ యుద్ధం అయినా.. అది ఎవరితో అయినా.. భారత్ రెడీ!

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×