Delhi Elections BJP Campaign| ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మూడోసారి కూడా గద్దెనెక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, 26 ఏళ్ల తరువాత మరోసారి ఢిల్లీని దక్కించుకునేందుకు బిజేపీ (BJP) భారీ వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కమలదళం అమలు చేస్తున్న వ్యూహాలు విశేషంగా కనిపిస్తున్నాయి.
ప్రత్యేక క్లస్టర్‌లు
ప్రతి నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి, మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు నివసించే ప్రాంతాల్లో బిజేపీ నేతలు ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని, అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.
Also Read: ఢిల్లీ ఎన్నికల్లో దళితులే కీలకం.. ఓట్ల కోసం ఆప్, బిజేపీ మధ్య తీవ్ర పోటీ
బూత్ స్థాయి వ్యూహం
విజయం సాధించడానికి ప్రతి బూత్‌లో 50 శాతం ఓట్లు గెలుచుకోవాలని బిజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికలతో పోల్చితే ప్రతీ నియోజకవర్గంలో 20 వేల ఓట్ల మెజారిటీ పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం బూత్ స్థాయి నుండి ఓటర్ల జాబితాను పరిశీలించి, అనుకూల, వ్యతిరేక ఓటర్లపై కచ్చితమైన అంచనాలకు వచ్చింది. వ్యతిరేక ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్చలు జరుపుతోంది.
ఢిల్లీని వదిలి వెళ్లిన ఓటర్ల కోసం ప్రత్యేక చర్యలు
కోవిడ్ కారణంగా ఢిల్లీని వదిలి స్వస్థలాలకు తరలి వెళ్లిన ఓటర్లను తిరిగి రప్పించేందుకు బిజేపీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ కార్యకర్తలు వారికి ఫోన్ చేసి, అవసరమైతే రవాణా ఖర్చు భరిస్తామని హామీ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌ల నుంచి వచ్చిన ఓటర్లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులను ప్రచారకర్తలుగా బిజేపీ నియమించింది.
భారీ సంఖ్యలోతెలుగు ఓటర్లు
ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని అంచనా. వీరిని ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన బిజేపీ, టిడీపీ నేతలు రంగంలోకి దిగారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా తమ సామర్థ్యంతో ప్రచారాన్ని శక్తివంతం చేస్తున్నారు.
జాతీయ స్థాయి నేతల బాధ్యతలు
ప్రతి నియోజకవర్గంలో పరిస్థితులను సమీక్షించేందుకు జాతీయ స్థాయి నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యనేతలకూ కొన్ని నియోజకవర్గాలను కేటాయించారు. అక్కడి ఎన్నికల నిర్వహణపై రోజు వారి నివేదికలు అందజేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.
అండగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు
ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు బిజేపీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ జంట ప్రయత్నాలతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అగ్రనేతల పర్యటనలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారంలో భాగస్వామ్యమవుతున్నారు. బిజేపీ విజయాన్ని సాధించడంలో వీరి ప్రయత్నాలు కీలకంగా మారాయి.
బిజేపీ ‘‘సంకల్ప పత్రం – పార్ట్ 3’’ను కేంద్రమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, పత్రంలో బూటకపు వాగ్దానాలు లేవని, ఆప్ ప్రభుత్వం విఫలమైన చోట తమ పార్టీ నిజాయతీగా పని చేస్తుందని అన్నారు.
ముఖ్య హామీలు:
యుమునా నది పూర్తిగా శుభ్రపరిచే చర్యలు మూడు ఏళ్లలో పూర్తి.
1,700 అనధికార కాలనీలకు యాజమాన్య హక్కులు.
రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ. 5 లక్షల ప్రమాద బీమా.
50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.
20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు.
గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు.
ఆయుష్మాన్ భారత్ పథకం అమలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరుగనుండగా, ఫలితాలు 8న వెలువడతాయి.