PMEGP Scheme: నిరుద్యోగ యువత, గృహిణుల కోసం కేంద్ర ప్రభుత్వ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP) కింద రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి, వాటిని విస్తరించేలా చేసేందుకు నిరుద్యోగ యువతకు శిక్షణ, సబ్సిడీతో రుణాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. వ్యాపారాలు ప్రారంభించే వారికి 15 నుంచి 35% వరకు సబ్సిడీ ఇస్తుంది.
పీఎంఈజీపీ పథకం ద్వారా రూ.లక్ష నుండి రూ.50 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. ఈ లోన్ పై 15 నుంచి 35 శాతం వరకు రాయితీ ఇస్తుంది. మీ వ్యాపారానికి రూ.20 లక్షల లోన్ తీసుకుంటే అందులో రూ.7 లక్షల వరకు సబ్సిడీ అందుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించే వారు రూ.50 లక్షల వరకు రుణం పొందవచ్చు. సేవరంగానికి చెందిన వ్యాపార యూనిట్లకు రూ.20 లక్షల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ రుణాలు పొందేందుకు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, గృహిణులు, దివ్యాంగులు అయితే ముందుగా 5 శాతం పెట్టుబడి పెట్టాలి. జనరల్ కేటగిరికి చెందిన వారైతే 10 శాతం వరకు పెట్టుబడి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో నూతన వ్యాపారానికి 35 శాతం వరకు రాయితీ లభిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కొత్త వ్యాపార యూనిట్లకు లోన్ పై 25 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది.
పీఎంఈజీపీ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు www.kviconline.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుండి 15 రోజుల్లో అధికారులు సంప్రదిస్తారు. మీ ప్రాజెక్టుపై నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఈ శిక్షణ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత రుణం మంజూరు చేస్తారు.
రుణం పొందిన తరవాత మూడేళ్లు క్రమం తప్పకుండా రుణవాయిదాలు చెల్లిస్తేనే సబ్సిడీ వస్తుంది. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కనీసం 8వ తరగతి వరకు చదువుకుని 18 ఏళ్ల వయసు నిండిన వారు మాత్రమే పీఎంఈజీపీ పథకానికి అర్హులు.
Also Read: Tata Capital: బిగ్గెస్ట్ IPO ఆఫ్ ది ఇయర్ గా టాటా క్యాపిటల్ గ్రాండ్ ఎంట్రీ..