Big Stories

Yuvagalam: లోకనాయకుడా!.. తండ్రిని మించిన తనయుడా!!.. యువగళం@ 1000km..

nara lokesh yuvagalam1000 km

Yuvagalam: యువగళం ప్రకటించగానే వైసీపీ నేతలు కామెడీ చేశారు. లోకేశ్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. నవ్విన నోళ్ల మధ్యే.. కుప్పంలో తొలిఅడుగు వేశారు నారా వారి తనయుడు. మొదటిరోజే తారకరత్న రూపంలో అపశృతి. రోజా లాంటి లీడర్లు మళ్లీ రెచ్చిపోయారు. నారా లోకేశ్ అవేవీ పట్టించుకోలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లారు. అలా అలా.. 1000 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు.

లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్‌ దగ్గర 1000 కి.మీ.ల మైలురాయిని దాటింది. అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదోని పట్టణంలోని 21వ వార్డును దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు నారా లోకేశ్‌.

పాదయాత్రతో నారా లోకేశ్ మరింత రాటుదేలారు. తనలోని అసలుసిసలు రాజకీయ చాతుర్యాన్ని బయటకు తీశారు. సెల్ఫీ ఛాలెంజ్ అందులో భాగమే. మొదట్లో తనతో కలిసి అడుగులు వేసిన ప్రజలతో సెల్ఫీలు దిగేవారు లోకేశ్. ఆ తర్వాత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, వచ్చిన సంస్థల ముందు సెల్ఫీ దిగుతూ.. సీఎం జగన్‌ను ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్ట్రాటజీ బాగా వర్కవుట్ అవుతోంది. సోషల్ మీడియా హోరెత్తుతోంది. వైసీపీని ఫుల్‌గా ఇరకాటంలో పడేస్తోంది. ఇష్టం ఉన్నా, లేకున్నా లోకేశ్ సెల్ఫీలపై స్పందించాల్సి వస్తోంది అధికార పార్టీకి. లేదంటే, వైసీపీకి అడ్డంగా బుక్ అయ్యే ప్రమాదం ఉంది మరి.

తండ్రి నుంచి ఇన్నాళ్లు రాజకీయ పాఠాలు నేర్చుకున్న లోకేశ్.. యువగళం పాదయాత్రలో చంద్రబాబునే మెప్పించే వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్‌కు పెద్దాయన ఫుల్ ఫిదా అయ్యారు. చంద్రబాబు సైతం తన హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ముందు సెల్ఫీ దిగి.. జగన్‌కు సవాల్ విసరడంలో లోకేశే స్ఫూర్తి. తనయుడి స్ట్రాటజీని తండ్రి ఫాలో అవడం.. అందులోనూ చంద్రబాబులాంటి రాజకీయ యోధుడినే మెప్పించడం మాములూ విషయమా. అందుకే, తండ్రికి తగ్గ తనయుడు.. కొన్ని విషయాల్లో తండ్రిని మించిన కొడుకు.. అనిపించుకుంటున్నారు నారా లోకేశ్.

ఇక, ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే.. అక్కడి స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు లోకేశ్. ఎక్కడికక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని, అరాచకాలను ఎండగడుతున్నారు. ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా వ్యూహాత్మక విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల ధర్మవరంలో పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫాంహౌజ్‌ ఆక్రమణలపై డ్రోన్ విజువల్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సూటిగా, సుత్తిలేకుండా అటాక్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్లూ మార్నింగ్ వాక్‌లతో, యూట్యూబ్ వీడియోలతో కేతిరెడ్డి సంపాదించుకున్న క్రేజ్ అంతా.. లోకేశ్ దెబ్బకు ఒక్కరోజులోనే మటాష్. దటీజ్ లోకేశ్.

తనయుడిని చూసి తండ్రిగా తెగ సంతోష పడుతున్నారు చంద్రబాబు. యువగళం పాదయాత్రతోనే లోకేశ్‌లోని నాయకత్వ లక్షణాలు మరింతగా బయటకు వచ్చాయి. అందుకే, యువగళం యాత్ర సరికొత్త లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసింది. వెయ్యి మైళ్ల ఈ ప్రయాణం.. ఎన్నికల లక్ష్యానికి మరింత చేరువ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

Latest News