
IPL Betting: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల తాట తీస్తున్నారు తెలుగు రాష్ట్రాల పోలీసులు. బెట్టింగ్ స్థావరాలపై వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. అటు మహబూబాబాద్ జిల్లాలోనూ ఓ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు.
ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ పీక్స్ లో ఉంది. గ్రౌండ్‌లో బ్యాట్స్ మెన్ల హిట్టింగ్ తో టీవీల ముందు కూర్చున్న అభిమానులంతా ఊగిపోతున్నారు. అయితే ఇలా ఎంజాయ్ చేసేవారు కొందరైతే.. ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు అందినకాడికి వెనకేసుకుందామనుకుంటున్నారు కొందరు బెట్టింగ్ రాయుళ్లు. టాస్ వేసే దగ్గరి నుంచి మొదలుపెడితే.. ఆఖరి బంతి వరకు ఏం జరుగుతుందనేది దానిపై బెట్టింగ్ కడుతున్నారు. ఇప్పుడిలాంటి బెట్టింగ్ స్థావరాలను కనిపెట్టి ఒక్కొక్కరి బెండు తీస్తున్నారు పోలీసులు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. విజయవాడ, ఖమ్మం జిల్లాలకు చెందిన యువకులతో స్థానికంగా ఉండే యువకులు ఫోన్ల ద్వారా, నగదు మార్పిడి ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతన్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గట్టి నిఘా పెట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 8 లక్షల రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లతో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
ఇక భాగ్యనగరంలో బెట్టింగ్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో ఐపీఎల్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో నిర్వహించిన సోదాలు బెట్టింగ్ రాయుళ్ల గుట్టును రట్టు చేశాయి. మొత్తం 12 మందిని అరెస్టు చేయగా.. మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లోని 3 లక్షల 29 వేలను పోలీసులు నిలిపివేశారు. వారి నుంచి 50 లక్షల నగదు, 20 సెల్ ఫోన్లు, 8 లాప్ ట్యాప్ లు, 4 టీవీలను స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ ను ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లోనే చూడాలి కానీ.. డబ్బులు సంపాదించే వనరుగా చూస్తే కటకటాల పాలు తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ చేస్తూ అడ్డంగా దొరికితే నిందితులపై గేమింగ్ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామంటున్నారు.