Visakha Mayor Seat: ఏపీలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. అధికారం చేపట్టిన వెంటనే మేయర్ ని మార్చాలని స్కెచ్ వేసింది. తమకు మద్దతు ఇచ్చే వైసీపీ కార్పొరేటర్‌లను పార్టీలో చేర్చేసుకుంది. తర్వాత అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చేసింది. అయితే మరో పది రోజుల్లో మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్న కూటమి నాయకులకు వైసిపీ చెక్ పెట్టింది. వైసిపి కార్పొరేటర్లు అందరితో క్యాంపు రాజకీయానికి తెర లేపింది.. అసలు వైజాగ్ కౌన్సిల్లో ఎవరి బలమెంత? కూటమి పార్టీలు వైసీపీకిక చెక్ పెడతాయా?
మున్సిపల్ కార్పొరేషన్లపై కూటమి ప్రభుత్వం కన్ను
ఆంధ్రప్రదేశ్ లో అనుకూలంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా కార్పొరేషన్ల మేయర్లను మార్చి తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి 90 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, పంచాయతీలను గెలుచుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలామంది వైసీపీ నుండి కూటమిలోని టిడిపి, జనసేనలో జాయిన్ అయిపోతున్నారు. టిడిపి కూడా రాష్ట్రంలోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్ లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది.
విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవడానికి టీడీపీ యత్నాలు
ముఖ్యంగా ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి టిడిపి వేగంగా పావులు కదుపుతుంది. వైసీపీ నుండి కూటమి అధికారం చేజిక్కించుకున్న వెంటనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లోని అనేకమంది కార్పొరేటర్లు టిడిపి, జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు… విశాఖపట్నంలోని 98 డివిజన్లలో 56 మంది కార్పొరేటర్లు వైసిపి గెలుచుకుంది. టిడిపి 30 మంది కార్పొరేటర్ లను, జనసేన ఐదుగురు కార్పొరేటర్ లను గెలుచుకుంది. బిజెపి, సిపిఎం, సిపిఐల నుంచి తలా ఒక కార్పొరేటర్ గెలుపొందగా, నలుగురు స్వతంత్రులుగా విజయం సాధించారు.
వలసలతో 36కి తగ్గిపోయిన వైసీపీ బలం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి, జనసేన, బిజెపి కార్పొరేటర్లతో ఇండిపెండెంట్లు కూడా కలిసిపోయారు. వైసీపీ నుంచి కూడా కొందరు పార్టీ మారడంతో ప్రస్తుతం వైసీపీ దగ్గర 36 మంది కార్పొరేటర్లు మిగిలారు..కూటమికి ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 70 మంది బలం ఉంది. జీవీఎంసీ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 74 ఓట్లు కావాలి. అంటే ఇంకా కూటమికి వైసీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు ఓటు వేయాల్సి ఉంది. దీంతో కూటమి పెట్టే అవిశ్వాసం గెలవకుండా ఉండడానికి వైసిపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 74 ఓట్లు అవసరం
కూటమి వ్యూహాన్ని గమనించిన వైసిపి 36 మంది కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో సహా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. విశాఖ నుంచి బెంగళూరుకు ఫ్లైట్లో కార్పొరేటర్ లను పంపింది. ఏప్రిల్ 5వ తేదీ లోపు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనుకుంటున్న కూటమి నాయకులకు వైసీపీ కార్పొరేటర్లు అందుబాటులో లేకుండా పది రోజులకు పైనే క్యాంపులో ఉంచడానికి ఏర్పాటు చేశారు వైసిపి సీనియర్ నాయకులు.. మాజీ మంత్రులు అయిన బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా కార్పొరేటర్లతో చర్చించి ఈ క్యాంపు రాజకీయానికి తెరలేపారు.
36 మందితో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన వైసీపీ
బెంగళూరులో మూడు రోజులు కార్పొరేటర్‌లను క్యాంపులో ఉంచి పార్టీ అధ్యక్షుడు జగన్‌తో మాట్లాడిన తర్వాత ఆ 36 మంది కార్పొరేటర్ల కుటుంబసభ్యులను మరో రాష్ట్రానికి తరలించి.. అక్కడ ప్రత్యేక క్యాంపులో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది .. ఇంకా సంవత్సరం పాటు మేయర్ పదవీకాలం ఉంది. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక్క నెల ముందైనా సరే టిడిపి కూటమి మేయర్ హోదాను తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఏపీలో కీలకమైన విశాఖ కార్పోరేషన్ వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో ఇప్పుడు జీవీఎంసీ మేయర్ పీఠం అన్ని పార్టీలకు సవాల్ గా మారింది.
పది రోజులు క్యాంపులో ఉంచడానికి వైసీపీ నేతల ఏర్పాటు
ఇప్పటికే వైసీపీ నుండి కార్పొరేటర్లు టిడిపి, జనసేన పార్టీలో జాయిన్ అయిపోవడం, కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని కూటమి ప్రచారం చేస్తున్న తరుణంలో వైసీపీ నాయకులు తమ కార్పొరేటర్ లను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇప్పటికే జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ అయిన హరేంద్రియ ప్రసాద్‌కు కూటమి నాయకులు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి నాయకులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఎవరు కూటమి నాయకులకు టచ్ లో లేకుండా ఉండేలాగా వైసిపి స్కెచ్ గీసింది.
పీల శ్రీనివాస్ కు మేయర్ యోగం
మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిస్తే కూటమి నుండి టిడిపి ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాస్‌ను మేయర్ పీఠంపై కూర్చోపెట్టాలని భావిస్తున్నారు. అందుకే శ్రీనివాస్ వైసిపి కార్పొరేటర్ లను టీడీపీలోకి జాయిన్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని వైసిపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం తీర్మానం కూటమి నెగ్గకుండా చేయగలమని సవాల్ విసురుతున్నారు. మరి విశాక మేయర్ పీఠం విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.