BigTV English

Ashok Gajapathi Raju: గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు? బంపరాఫర్!

Ashok Gajapathi Raju: గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు? బంపరాఫర్!

Ashok Gajapathi Raju: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, త్వరలోనే అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. అసలు ఆ పెద్దాయనకు పదవిపై వినిపిస్తున్న లెక్కలేంటి?


ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో గౌరవించే అశోక్ గజపతి రాజు

పూసపాటి అశోక్ గజపతిరాజు.. విజయనగరం రాజవంశస్థులు.. అయినప్పటికీ ఆయనలో ఇసుమంతైన దర్పం ఉండదంటే అతిశయోక్తి కాదు . రాజవంశస్థులు అయినప్పటికీ ప్రజాస్వామ్యంపై ఆయనకు ఎనలేని గౌరవం .. నేటికీ ఆయన పబ్లిక్‌గా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ పదం వినిపిస్తుందంటే డెమోక్రసీ పై ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు . 1978 లో రాజకీయాల్లోకి వచ్చి 2019 వరకు ఎమ్మెల్యేగా , ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా , కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.


గవర్నర్ పదవి రేసులో ఫోకస్ అవుతున్న గజపతిరాజు

వివాద రహితుడు, హుందా రాజకీయాలకు పెట్టింది పేరైన మిస్టర్ క్లీన్ కాబట్టే 2024 ఎన్నికల తరువాత టీడీపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ పదవి కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతున్న ప్రతిసారీ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన అశోక్‌గజపతి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అ పదవికి ఆయన మాత్రమే సూటబుల్ అని అటు తెలుగు తమ్ముళ్ళుతో పాటు అధినేత చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది .

విజయసాయి రాజీనామాతో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం

ఇటీవల మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి, వైసీపీకి పెట్టని గోడలా ఉండే విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి , వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు . మరోవైపు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తమిళనాడు గవర్నర్ రవిని కేంద్రం తొలగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఖాళీలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అటు బీజేపీ, ఇటు టీడీపీ ఉన్నట్లు సమాచారం . విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇస్తారంటున్నారు

కేంద్రం కేటాయించే తొలి పదవి అశోక్‌కే దక్కనుందా?

అలాగే తమిళనాడు గవర్నర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి రెండ పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది . అదే జరిగితే టీడీపీకి కేంద్రం తరఫున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం ఉందంటున్నారు. వాటిలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతిరాజు అంటే ప్రధానికి ఎంతో గౌరవం ఉందని, అందుకే ఆయనకు రాజ్యాంగ పదవి దక్కడం ఖాయమంటున్నారు.

అవినీతి మరక అంటించుకోని అశోక్ గజపతి

చంద్రబాబు ప్రత్యేకంగా అశోక్ గజపతిరాజుకే ఆ పదవి ఇవ్వడానికి కారణాలు లేకపోలేదంటున్నారు . రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా , కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుపై నేటికీ మచ్చుకైనా ఒక్క అవినీతి మారక లేదు . ఎక్కడ పార్టీకి సంబంధించి గానీ , ప్రజలను ఉద్దేశించి గానీ ఇప్పటివరకు వివాదాస్పదంగా మాట్లాడిన సందర్భమూ లేదు . టీడీపీలో చంద్రబాబుకన్నా సీనియర్ అయినప్పటికీ ఆయన పార్టీ లైన్ ను ఎక్కడా క్రాస్ చేయలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ స్టాండే తన స్టాండ్ అన్నట్లు కట్టుబడి ఉన్నారు,

నేటీకీ ఏ ఒక్కరినీ ఏకవచనంతో పిలవని రాజు

2018లో ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకి వచ్చినపుడు చంద్రబాబు ఆదేశించగానే అశోక్‌గజపతి రాజు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు . నేటికీ ఏ ఒక్కరినీ ఏకవచనంతో పిలవడం ఆయనకు తెలీదు. తమ కుటుంబ సంస్థ అయిన మాన్సస్ ట్రస్ట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనను ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొన్నారు అశోక్ . అంతేగాని జగన్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. నడవలేని పరిస్థితుల్లో కూడా టిక్కెట్లు ఆశించే ఈరోజుల్లో.. 2024 ఎన్నికల సమయంలో వయోభారం కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాలకు తాను అన్‌ఫిట్ అని, ఇక ఎన్నికల్లో పోటీచేయనని స్వయంగా ప్రకటించారు .

Also Read: ఏ క్షణ‌మైనా రజనీ అరెస్ట్.!

అదితికి మంత్రి పదవిపై నోరు తెరిచి అడగని రాజు

ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ఎన్నికల్లో ఆయనే విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే వారు . కానీ రాజకీయాల్లో కొత్తరక్తం దావాలన్నది ఆయన అభిమతం. అదలా ఉంటే ఇప్పటికీ ఏ ఒక్కరోజు తనకు గానీ , తన వాళ్ళకు గానీ ఫలానా పదవి కావాలని పార్టీ అధినేతను కోరిన దాఖలాలు లేవు . అంతెందుకు తన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు మంత్రి పదవి కావాలని కూడా ఆడగ లేదట. పార్టీ చెప్పిన పని చేయడమే మన పని అనేది ఆయన సిద్దాంతం . ఈ సిద్దాంతాలు ఉండడం వల్లనే టీడీపీ నుండి గవర్నర్ అనగానే ఆయన పేరు వినిపిస్తోందట . చూడాలి మరి ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టి , ఆ రాజ్యాంగబద్ద పదవి ఆయన్ని ఎప్పుడు వరిస్తుందో..

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×