BigTV English

Kodali Nani Arrest: వంశీ బాటలో కొడాలి నాని..! త్వరలో అరెస్టేనా?

Kodali Nani Arrest: వంశీ బాటలో కొడాలి నాని..! త్వరలో అరెస్టేనా?

Kodali Nani Arrest: అధికారం శాశ్వతం.. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అన్న ధీమాతో వైసీపీ నాయకులు ఇష్టానుసారం చెలరేగిపోయారు … ఆస్తులు పెంచుకోవడానికి అక్రమాలు, అడ్డుచెప్పిన వారిపై దౌర్జన్యాలు, అరాచకాలతో అధికారంలో ఉన్న అయిదేళ్లు యధ్దేచ్చగా రెచ్చిపోయారు.. ఇప్పుడు మాజీలుగా మారిన వారి చుట్టూ ఒక్కొక్కటిగా ఉచ్చు బిగుసుకుంటుంది. ఓట్ల కౌంటింగ్ రోజునే సొంత నియోజకవర్గం నుంచి పరారైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో అలాంటి నేతలకు కౌంట్‌డౌన్ మొదలైంది.. వంశీ తర్వాత ఎవరు అన్న చర్చ అటు కూటమి శ్రేణుల్లో, ఇటు వైసీపీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


బాధితులపైనే కేసులు పెట్టించిన వల్లభనేని

దాడులు చేయించడం.. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించడం.. నమ్మించి మోసం చేయడం.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పుట్టుకతో వచ్చిన విద్య అన్న విమర్శలున్నాయి. 1997లో హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియో వద్ద పరిటాల రవీంద్రపై హత్యాయత్నం తర్వాత రవి అనుచరుడిగా చేరిన వల్లభనేని వంశీ.. ఆయనకు నమ్మకద్రోహం చేసి, తన్నులు తిరి రాయలసీమ నుంచి బహిష్కృతుడయ్యారు. పరిటాల రవి మరణాంతరం కొడాలికి నానితో ఉన్న సాన్నిహిత్యంతో జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రికమండేషన్ చేయించుకుని టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.


టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బూమరాంగ్ అయిన వంశీ ప్రయత్నాలు

2009 ఎన్నికల్లో మొదటి సారి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన వంశీకి తర్వాత చంద్రబాబునాయుడు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. రెండో సారి గెలిచాక అదే కొడాలి నాని అండతో వైసీపీలో చేరి పెద్ద కథలే నడిపించారు. అందుకే వంశీ గురించి ముందు నుంచి తెలిసిన వారెవ్వరూ ఆయన్ని నమ్మరన్న ప్రచారం ఉంది. ఇటీవల గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కేసు పెట్టిన వ్యక్తితోనే.. దాన్ని నీరుగారేలా చేసి తాను తప్పించుకోవాలని కుట్ర పన్నారు. కానీ అది ఆయనకే బూమరాంగ్ అయింది.

సత్యవర్ధన్ ను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా వాంగ్మూలం

2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై అక్కడ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ ఫిర్యాదు చేశారు. దీంతో అతనితోనే ఇది తప్పుడు కేసు అని వాంగ్మూలం ఇప్పిస్తే.. కేసు వీగిపోతుందని వంశీ స్కెచ్ గీశారు. ఆయన అనుచరులు నలుగురు హైదరాబాద్‌లో ఉన్న సత్యవర్ధన్‌ను వాహనాల్లో వచ్చి ఎత్తుకెళ్లారు. హైదరాబాద్‌ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో బంధించారు. రోజుల తరబడి అతణ్ని కొట్టి, భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చేలా లొంగదీసుకున్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనితోనే చెప్పించి వీడియో రికార్డు చేయించారు. ఆ తర్వాత వంశీ అనుచరులే దగ్గరుండి అతణ్ని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానానికి తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. ముందే రికార్డు చేయించిన వీడియోను కూడా కోర్టుకు సమర్పించారు. తర్వాత సత్యవర్ధన్‌ను తమ వాహనంలో తీసుకెళ్లిపోయారు.

వంశీని హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు

అయితే ఓటమి తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిన వంశీ స్కెచ్ వర్కౌట్ కాలేదు. సత్యవర్ధన్‌ కొన్ని రోజులుగా కనిపించకపోవడం, ఇంటికి ఫోన్‌ కూడా చేయకపోవడంతో కుటుంబసభ్యులు అతని కోసం గాలించారు. సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్‌ చేయించారని తెలిసి.. అతని తమ్ముడు పటమట పోలీసులను ఆశ్రయించారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి కూడా సత్యవర్ధన్‌ను వంశీ, ఆయన అనుచరులే అపహరించారని మరో ఫిర్యాదు చేశారు. దీంతో రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వంశీని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడులకు పాల్పడిన కృష్ణాజిల్లా నేతలు

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్‌ న్యాయస్థానంలో నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఇదే సమయంలో సత్యవర్ధన్‌ను వంశీ, అనుచరులు కిడ్నాప్‌ చేశారని అతని సోదరుడు కిరణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో పోలీసులు సత్యవర్ధన్‌ ఆచూకీ కోసం రెండు రోజులుగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఇదంతా వంశీ కుట్రే అని తేలడంతో వంశీ అనుచరుల కదలికలు, ఫోన్‌ కాల్స్‌పై నిఘా పెట్టారు. వంశీ హైదరాబాద్‌లో ఉన్నారన్న సమాచారంతో ఒక పోలీసు బృందం హైదరాబాద్‌ వెళ్లి.. ఆయన్ను అరెస్టు చేసింది. మరో బృందం విశాఖ వెళ్లి వంశీ అనుచరులు ఒక ఇంటిలో దాచి ఉంచిన సత్యవర్ధన్‌ను తీసుకురావడంతో వంశీ భాగోతం బయటపడింది.

వంశీ అరెస్టుతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గుబులు మొదలైందంట. అధికారంలో ఉండగా చెలరేగిపోయిన వైసీపీ మాజీలు తమకు కూడా ఉచ్చు బిగుస్తుందని భయపడుతున్నారంట. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు, ఎమ్మెల్యేల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అక్రమంగా ఆస్తులు కూడ బెట్టుకోవడంతో పాటు బూతులతో పేట్రేగిపోయారు. అరాచకాలు, అక్రమాలకు ఊతమిస్తూ తమ అనుయాయులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నాయకులు, ఆఫీసులపై దాడులకు తెగబడ్డారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అధికారం ఉంది కదా.. అని కన్నూమిన్ను కానకుండా అరాచకాలకు పాల్పడిన అలాంటి వారిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది.

ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న జోగి రమేష్

జగన్ హయాంలో టీడీపీ ఆఫీసులపైనా, చంద్రబాబు ఇంటిపైనా దాడులకు పాల్పడిన వారంతా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నేతలే అవ్వడం గమనార్హం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తో పాటు మాజీ మంత్రులైన జోగి రమేశ్‌, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావుతో పాటు దేవినేని అవినాశ్‌ సాగించిన అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ తాజాగా అరెస్ట్ అయ్యారు. గతంలో చంద్రబాబు కుటుంబంపై వంశీ ఎన్నో వ్యక్తిగత దూషణలు చేశారు.

అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు అభియోగాలు

చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన మాజీమంత్రి జోగి రమేశ్‌ ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. నేడో రేపో ఆయన అరెస్టు కాక తప్పదంటున్నారు. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అగ్రిగోల్డ్‌ భూములను బలవంతంగా కొనుగోలు చేశారని కూడా ఈయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో జోగి రమేశ్‌ తనయుడు ఇప్పటికే అరెస్ట్‌ అయ్యాడు. జోగి రమేశ్‌ తెలివిగా తప్పించుకున్నా.. అధికారాన్ని మాత్రం అడ్డగోలుగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు పాల్పడిన తరుణంలోనే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేయటానికి జోగి రమేశ్‌ సారథ్యం వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కూడా జోగి తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు.

Also Read:  పులివెందుల వలసలు.. జగన్ కోటపై టీడీపీ జెండా..!

బూతు పురాణాలతో చెలరేగిన కొడాలి నాని

గుడివాడకు చెందిన మరో మాజీమంత్రి కొడాలి నాని అధికారం మత్తులో చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని తిట్టని తిట్టు లేదు. ఆయన బూతు పురాణాలతో వైసీపీ నేతలే బిత్తరపోయాయి. అధికార బలంతో, బూతులతో పేట్రేగిపోయిన కొడాలి నాని గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో సూత్రధారుడిగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై తన అనుయాయులను ఉసిగొల్పారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా మాజీ జెసి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాసుదేవ రెడ్డి, కొడాలి నాని అతని అనుచరులు, ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్‌ ఉన్న తమపై దౌర్జన్యం చేసి తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు విచారణలో ఉంది.

కొడాలి నానిపై వార్డు వాలంటీర్లు ఫిర్యాదు

అలాగే తాజాగా వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు.. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని,ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసిపి నేతలపై 447,506,R/w34 ఐపిసి సెక్షన్ల కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు. కేసు నమోదు చేశారు.

వంశీ అరెస్ట్ అక్రమం అని ట్వీట్ పెట్టిన నాని

ఇలా పలు కేసులు ఎదుర్కొంటూ గుడివాడలో అడ్రస్ లేకుండా పోయిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓటమి తర్వాత మీడియా ముందుకు కూడా పెద్దగా రావడం లేదు. కొత్తగా ట్వీట్లు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకు వల్లభనేని వంశీ అరెస్ట్ ఓ ఉదాహరణ అంటూ తాజాగా ట్వీట్ పెట్టి తన అభద్రతాభావాన్ని చాటుకున్నారు.

నెక్ట్స్ హిట్‌లిస్టులో కొడాలి నాని

మరోవైపు గుడివాడ ఎమ్మెల్యే రాము కూడా కొడాలి నాని అవినీతి చిట్టా విప్పుతూ.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ కటకటాల పాలయ్యాక.. వైసీపీ నేతల అరెస్టుపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతుంది. నెక్ట్స్ హిట్‌లిస్టులో కొడాలి నానినే ముందుంటారని వైసీపీ వర్గాల్లోనే టాక్ వినిపిస్తుండటం గమనార్హం

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×