TDP At Pulivendula: వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా అండగా ఉంటున్నారు పులివెందుల ఓటర్లు.. కాంగ్రెస్ నుంచి ఆ కుటుంబసభ్యులు వరుసగా పది సార్లు గెలిస్తే.. వైసీపీ నుంచి జగన్ వరుస విజయాలతో పులివెందులను తన అడ్డాగా మార్చుకున్నారు. అయితే అక్కడ ఇంత వరకు గెలుపుగుర్రం ఎక్కని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అక్కడ పాగా వేయడానికి పావులు కదుపుతుంది. జగన్ సొంత నియోజకవర్గంలో ఆయన్న ఢీకొనడానికి ప్రణాళికలు రెడీ చేస్తుంది.. ఆ క్రమంలో ఇప్పటికే పులివెందులలో జగన్‌కి షాక్‌లు తగులుతున్నాయంట.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రాజకీయ కోట పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం దృష్టి సారించింది. అందులో భాగంగానే జగన్‌కు చెక్ పెట్టేలా టీడీపీ పావులు కదుపుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పసుపు జెండా రెపరెపలాడింది. ఆ క్రమంలో పులివెందులలో కూడా జగన్‌ను ఢీకొట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసిందంట. అందులో భాగంగా ప్రజల్లో బలం ఉన్న నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక కేడర్ సిద్ధమవుతున్నారు.
పులివెందుల టీడీపీ నేతలు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులను, చేరికలకు సంబంధించిన అంశాలను హై కమాండ్‌కు వివరిస్తున్నారంట. పులివెందుల మున్సిపాలిటీలోని 30 వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు 30 కుటుంబాలు తాజాగా టీడీపీలో చేరాయి. వారితో పాటు పులివెందులబ్రాహ్మణపల్లె నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నారంట. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో ఎన్టీఏ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆ పార్టీ నేతలతో పాటు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు టీడీపీ, జనసేనల్లో చేరుతున్నాయి. అలాగే వై నాట్175 ? అంటూ అధికారంలో ఉండగా జగన్.. వైసీపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు… కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. కుప్పంలో చంద్రబాబుని కూడా ఓడిస్తామన్న జగన్ ధీమాను నమ్మి పలువురు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులకు దిగి ఇళ్లు గుల్ల చేసుకున్నారు.
Also Read: వంశీకి 14 రోజుల రిమాండ్.. విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
ఇక అర్హత లేకపోయినా తనకు ప్రతిపక్ష నేత హోదా కేటాయించాలని జగన్.. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు లేఖ రాశారు. కానీ సంఖ్య బలం లేదంటూ స్పీకర్ స్పష్టం చేయడంతో.. జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో అటు అసెంబ్లీకి వెళ్లలేక ఇటు పులివెందులల్లో ఉండలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారాయన. వైసీపీ హయాంలో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ .. పాడా.. కింద పలు పనులు చేసిన స్థానిక కాంట్రాక్టర్లకు జగన్ ప్రభుత్వం బిల్లు చెల్లించలేదు. ఆ బిల్లుల కోసం వారు జగన్, భారతీరెడ్డిలు కనపడితే నిలదీస్తున్నారు. మొత్తానికి ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేయాలని దిగువ స్థాయి నేతలు సిద్ధమవుతున్నారు. దాంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.