తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇన్నేళ్లు ఒకలెక్క 2024 ఎన్నికలు ఒకలెక్క అన్నట్లుగా సాగాయనేది వాస్తవం.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలిరోజు నుంచే కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి నిరంకుశ పాలన కొనసాగించింది. అధినేత మొదలు.. సాధారణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరినీ జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రతి ఒక్కరు తీవ్రంగా ఇబ్బంది పడిన వారే. బెదిరింపులు, దాడులు, హత్యలు అనేలా వైసీపీ పాలన సాగింది. నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. చివరికి పార్టీ మీద అభిమానంతో ఎవరైనా టీడీపీ కార్యకర్త జెండా పట్టుకుంటే చాలు.. వెంటనే కేసు పెట్టి అరెస్టు చేశారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో అడ్డుకున్నారు. అమరావతి యాత్రలో చెప్పులతో దాడి చేశారు. యర్రగొండపాలెంలో రాళ్లతో దాడి చేశారు. చిత్తూరు జిల్లా అంగళ్లలో అయితే ఓ మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న నేతపై ప్రత్యక్షంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయకుండా టీడీపీ నేతలను అడ్డుకోవడమే కాకుండా.. ఏకంగా కిడ్నాప్‌లకు కూడా తెగబడ్డారు. అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణ, కుటుంబ సభ్యులపై చట్టసభలోనే అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు కేసులతో అరెస్టులు.. ఇలా ఎంత వరకు దిగజారాలో అంత వరకు దిగజారి మరీ ప్రవర్తించారు.
ఇక 2023 సెప్టెంబరులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ సర్కారు తన గొయ్యి తానే తవ్వుకుందని చెప్పాలి. ఆయన్ని 50 రోజులకు పైగా జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రం అట్టుడిగి పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చావో రేవో అన్నట్లుగా ఐదు నెలల పాటు చంద్రబాబు సహా కిందిస్థాయి కార్యకర్త వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఓ వైపు చంద్రబాబు, మరో వైపు లోకేష్, ఇతర నాయకులు, సామాన్య కార్యకర్తలు ప్రతి ఒక్కరు గెలుపే లక్ష్యం అన్నట్లుగా పని చేశారు.యువగళం పాదయాత్రతో లోకేష్ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. అటు చంద్రబాబు కూడా 75 ఏళ్ల వయసులో నవ యువకుడి మాదిరిగా మండుటెండలో కూడా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు.
వైసిపీ ఓటమే లక్ష్యంగా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వై నాట్ 175 అన్న వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు.. ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వరకు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించారు చంద్రబాబు. ఇక ఎన్నికల్లో కేవలం అమరావతి మాత్రమే ఏపీ ఏకైక రాజధాని అని స్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు.. అందుకు మూడు ప్రాంతాల ప్రజల అంగీకారం కూడా రాబట్టారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన వైసీపీకి.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం రెండే సీట్లు వచ్చాయంటే ఆ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: పవన్ వార్నింగ్.. పరారీలో 10 మంది వైసీపీ నేతలు
గతంలో ఎన్నడూ గెలవని సీట్లను కూడా టీడీపీ భారీ మెజారిటీతో సొంతం చేసుకుంది. గాజువాక, భీమిలి, మంగళగిరి వంటి నియోజకవర్గాల్లో అయితే టీడీపీ అభ్యర్థులు 90 వేల పై చిలుకు ఓట్లతో గ్రాండ్ విక్టరీ సాధించారు. 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ.. ఏకంగా 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఏపీ ప్రజలకు వివరించారు చంద్రబాబు. వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసిన జగన్ పాలనను శ్వేతపత్రాల రూపంలో సవివరంగా వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను లెక్కలతో సహా వెల్లడించారు.
అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయలేరని వైసీపీ చేసిన దుష్ర్పచారానికి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సమాధానం చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ సిబ్బంది సాయంతో బకాయిలతో సహా పెంచిన ఫించన్‌ను అర్హులందరికీ అందించారు. అలాగే ఉద్యోగులకు ఒకటో తేదీ నుంచి మూడో తేదీ మధ్యలోనే జీతాలిచ్చారు. మెగా డీఎస్సీ ప్రకటించారు. దీపం-2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై అధ్యయనం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు.
సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సక్సెస్ అయ్యారు. టీసీఎస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో భారత్ ప్రెట్రోలియం వంటి మరో 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే అమరావతి, పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నడుం బిగించారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకంగా పులివెందులలోనే వైసీపీని చావు దెబ్బ తీశారు. టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ అనే మాటను రుజువు చేస్తూ.. లోకేశ్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే.. చంద్రబాబు సైతం రెండు వారాలకు ఓసారి పార్టీ కార్యాలయంలో స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నేతల అరాచకానికి ప్రజలు ఘోరీ కట్టారని.. అందుకే తెలుగుదేశం పార్టీ ఏకంగా 135 సీట్లు గెలిచిందని, వైసీపీ 11 స్థానాలకు పరిమితమై అనామకంగా మిగిలిపోయిందని.. 2024 ఏడాదిలో తెలుగుదేశం పార్టీ పడిలేచిన కెరటం మాదిరిగా రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందని పసుపు కేడర్ సంబరాలు చేసుకుంటుంది.