KCR New Plan: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయా? కొత్త ఏడాదిలో విపక్షం బీఆర్ఎస్ కోలుకుంటుందా? అందుకు మాజీ సీఎం కేసీఆర్ వద్ద అస్త్రాలు ఉన్నాయా? కొత్త అధ్యక్షుడి విషయంలో వన్ షాట్.. టూ బర్డ్స్ ఫార్ములాను అనుసరించాలని భావిస్తున్నారా? వారసులు అందుకు అంగీకరిస్తారా? దీనిపై పార్టీలో జరుగుతున్న చర్చేంటి?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త స్కెచ్ వేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడి విషయంలో వన్ షాట్.. టూ బర్డ్స్ ఫార్ములాను అనుసరించాలని భావిస్తున్నారట. దీనిపై వారసుల మధ్య కొంత తర్జన భర్జన జరుగుతోంది. కాబోయే అధ్యక్షుడు తానే అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరించడం పార్టీతోపాటు ఫ్యామిలీలో కొందరికి మింగుడుపడడం లేదన్నది టాక్.
పార్టీ అధ్యక్షురాలిగా కవిత అయితే బాగుంటుందని కేసీఆర్, తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం జరిగిన రెండురోజుల తర్వాత మీడియా చిట్ చాట్‌లో ఓ విషయం వెల్లడించారు కేటీఆర్. బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మనసులోని మాట బయపెట్టారు. దీనిపై ఆ పార్టీలో ఏం జరుగుతుందనే దానిపై మీడియా ఇంకాస్త లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టింది.
బీఆర్ఎస్ కొత్త అధ్యక్షుడిగా బీసీ నేత ఉండవచ్చని కేసీఆర్ సన్నిహితులు కొందరు లీక్ ఇచ్చారు. దీనిపై ఆ పార్టీ నేతలతోపాటు మిగతా పార్టీలో చర్చ మొదలైపోయింది. ఇంతకీ అధ్యక్ష పీఠం బీసీలకు అప్పగిస్తారా? లేదా అనేది సెకండ్ పాయింట్. ఈ విషయంపై కొత్త చర్చ జరిగేలా చేశారు. దాని నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా అడుగులు వేస్తారని అంటున్నారు.
ALSO READ: హైదరాబాద్ లో భారీ క్యూ.. మద్యం కోసం కాదు కానీ.. మరెందుకంటే?
ఈ విషయంలో ఇంటి నేతల ఆలోచన బయటకు రావచ్చని భావిస్తున్నారట కేసీఆర్. దాని ఆధారంగా అడుగులు వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యామిలీ అంతర్గత కలహాలకు చెక్ పెట్టేందుకు పెద్దాయన వేసిన ఎత్తుగడగా వర్ణిస్తున్నారు ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు.
ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు బీసీ నినాదంతో రేవంత్ సర్కార్ దూకుడుగా వెళ్తోంది. ఓ వైపు కుల గణన.. బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లను ఎత్తుకుంది. ఈ అంశాలపై కారు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది.
పరిస్థితి గమనించిన కేసీఆర్, బీసీ నేతను అధ్యక్షుడి కుర్చీలో కూర్చొబెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత కలహాలకు చెక్ పడుతుందని, దీనివల్ల కేటీఆర్, కవిత, హరీష్‌రావు ఒకే తాటి మీదకు వస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చిన ఈ ఫీలర్ రాజకీయంగా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.