Political War: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణలో తిరగనీయబోమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. దానిపై కవిత తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. అయితే మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పార్టీ పరంగా ఆశించిన మద్దతు లభించకపోవడంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో పార్టీ తమవారికి అండగా నిలుస్తుంటుంది. ముఖ్యనేతలు నైతిక మద్ధతు ప్రకటిస్తూ ప్రత్యర్ధులకు కౌంటర్ ఇస్తారు. కానీ కవిత విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
కవితను తెలంగాణలో తిరగనీయబోమంటున్న తీన్మార్ మల్లన్న
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తెలంగాణలో తిరగనీయబోమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తన న్యూస్ కార్యాలయంపై , తమపై దాడులు చేయెుచ్చు కానీ.. తమ ఆత్మాభిమానాన్ని చంపలేరన్నారు తీన్మార్ మల్లన్న. ఇది తనపై జరిగిన దాడి కాదని.. యావత్తు బీసీలపై జరిగిన దాడి అని ఈ సందర్భంగా మల్లన్న అభివర్ణించారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు తన కార్యాలయంపై దాడి చేశారంటూ మల్లన్న మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందన్నారు.
మల్లన్నపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ ఇంటికెళ్లి మరీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుగోబోమని తీన్మార్ మల్లన్నను ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు. మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అంటూ ప్రశ్నించారు.తీన్మార్ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని చెప్పుకొచ్చారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి విచక్షణతో మాట్లాడాలని తీన్మార్ మల్లన్నకు కవిత సలహా ఇచ్చారు. బీసీ అయినంత మాత్రాన.. మల్లన్న ఏది పడితే అది మాట్లాడితే కుదరదని కవిత అన్నారు. ‘నన్ను బయట తిరగనివ్వను అనటానికి మల్లన్న ఎవరు?. వెంటనే తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన కవిత మల్లన్న ఇష్యూ
బీఆర్ఎస్‌లో ప్రస్తుతం కవిత – మల్లన్న ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిందట. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు నోరు విప్పడం లేదు. దాంతో కవితను బీఆర్ఎస్ దూరం పెడుతుందా?….కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ పెరిగింది? ..కవిత విషయంలో ముఖ్యనేతల కూడా మౌనం వహించడం ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌లో నిర్వహించిన రజతోత్సవ సభ తర్వాత జరిగిన పరిణామాలతో కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు ఆర్ధమవుతోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.
కవితకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కవితపై ఎమ్మెల్సీ మల్లన్న కామెంట్స్ చేయడం….కవిత అనుచరులు మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం…కార్యాలయంపై దాడి ఘటనపై ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు చేయడంతో కవితపై కేసు నమోదు కావడం చకచక జరిగిపోయాయి. ఇంత వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నా…కవిత విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేయకపోవడంపై పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌లో కీలకమైన కేటీఆర్ స్పందించలేదు…దీంతో మనకెందుకులే అనుకున్నారామో ఏమో కానీ మాజీ మంత్రులు, ముఖ్యనేతలు కూడా మౌనం వహించారు. దాంతో బీఆర్ఎస్‌లో కవిత పాత్ర ఏంటి?… గులాబీ పార్టీలో కల్వకుంట్ల వారసురాలి శకం ముగిసినట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్‌లో కవిత స్థానంపై గులాబీ శ్రేణుల్లో చర్చ
ఇటీవల కాలంలో బీఆర్ఎస్లో అంతర్గత సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లన్న ఇష్యూలో కవితకు మద్దతు ఇవ్వకపోవడం వెనుక పార్టీలో ఆమె స్థానంపై జరుగుతున్న చర్చకు కారణమైంది. ఇంత జరుగుతున్నా కవితకు మద్దతుగా కేటీఆర్ స్పందించకపోవడంతో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పరిణామాలు బహిర్గతం అవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కొందరు ఇది పార్టీలో కవిత ప్రాబల్యం తగ్గిపోవడానికి సంకేతం అని భావిస్తుంటే, మరికొందరు ఇది కేవలం పార్టీ వ్యూహాత్మక మౌనం అని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ ఫ్యామిలీ ఎపిసోడ్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
కేటీఆర్ పార్టీలో తన చెల్లెల్ని పక్కన పెట్టాలని చూస్తున్నారా?
కేసీఆర్ కుటుంబంలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వదంతులు చాలా కాలంగా ఉన్నాయి. తాజా మల్లన్న వివాదం వదంతులకు బలం చేకూర్చినట్లైంది. ముఖ్యంగా కేటీఆర్, కవిత మధ్య పొసగడం లేదని, కేటీఆర్ తన చెల్లెలు కవితను పార్టీలోపక్కన పెట్టాలని చూస్తున్నారని సోషల్ మీడియాలోను, రాజకీయ విశ్లేషకులలో చర్చ జరుగుతోంది. ముఖ్యమైన అంశాల్లో బీఆర్ఎస్ కంటే కవిత ముందుగా స్పందించడం, ప్రజల్లోకి వెళ్లడం, ఆందోళనలు చేయడం పార్టీ ముఖ్యనేతలకు రుచించడంలేదంట. దీంతో కవితకు సంబంధించిన ఇష్యూలపై పార్టీ ముఖ్యనేతలందరూ ఎలాంటి ప్రకటనల కానీ, మాట్లాడానికి ముందుకు రావడంలేదనేది పార్టీలో జరుగుతున్న చర్చ. కవితకు పార్టీ నుంచి బహిరంగ మద్దతు లభించకపోవడంపై ఆమె అసంతృప్తిగా ఉన్నారనేది ఇంటర్నల్‌గా నడుస్తున్న చర్చ.
పార్టీలో పరిణామాలపై స్పందించని కేటీఆర్, కవిత, హరీష్
పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో క్యాడర్‌ను కన్ఫ్యూజన్ నేట్టేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి పార్టీ నేతల్లోను నెలకొందంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అటు కవిత గానీ, ఇటు కేటీఆర్, హరీష్ రావులు కానీ నేరుగా పెద్దగా స్పందించడంలేదు. మల్లన్న ఇష్యూలో బీఆర్ఎస్ అధిష్టానం, ముఖ్యంగా కేటీఆర్ మౌనం వహించడం వల్ల కవితను వారు దూరం పెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. అటు పార్టీ కార్యాలయంలో కూడా కవిత ప్రెస్ మీట్‌లు పెట్టేందుకు అనుమతి ఇవ్వడంలేదంట. రజతోత్సవ సభ తర్వాత కవిత తెలంగాణ భవన్‌కు వచ్చిన సందర్భం లేదు. తన కార్యకలాపాలన్నీ జాగృతీ కార్యాలయం నుంచి నిర్వహించడం కూడా అధిపత్య పోరు వాదనలకు ఊతమిస్తోంది.
Also Read: తైవాన్ చుట్టూ చైనా గేమ్.. మరో యుద్ధానికి రంగం సిద్ధమైందా?
మొత్తంగా బీఆర్ఎస్ లోని అంతర్గత రాజకీయాలపై, నాయకుల మధ్య సంబంధాలపై మల్లన్న ఎపిసోడ్ మరో సారి చర్చకు కారణమైంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరిన్ని స్పష్టతలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై మరింత చర్చను రేకెత్తించింది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
Story By Rami Reddy, Bigtv