ప్రతి తెలంగాణ పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నామని బడ్జెట్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. కొత్తగా తొమ్మిది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి, ధనిక అని తేడా లేకుండా కోటి 15 లక్షల కుటుంబాలకు.. 5 లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో సరికొత్త పథకాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, పాలిటెక్నిక్ కాలేజీలను ఏటీసీలుగా తీర్చిదిద్దడం లాంటి అనేక కీలక ప్రతిపాదనలు చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్యాతా రంగాలకు పెద్దపీట వేసింది. చేయూత పథకం కింద అర్హులైన వారికి కొత్తగా 2 లక్షల పెన్షన్ల మంజూరు చేయనున్నారు. ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు చేపట్టనున్నారు. ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రతి నెలా 2 వేల స్కాలర్‌షిప్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ఖజానాపై అప్పుల భారాన్ని తగ్గించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు వేసింది. రాష్ట్రంలో గత 26 నెలల్లో లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పు అదనంగా పెరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో అధిక వడ్డీకి తీసుకున్న కొన్నింటిని పునర్‌వ్యవస్థీకరించింది. దీర్ఘకాలంలో కట్టేలా మార్చుకోవడం ద్వారా ఖజానాపై కొంత వడ్డీ భారం తగ్గింది. తీసుకున్న రుణంలో ఎక్కువ భాగం గత ప్రభుత్వం చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికే సరిపోయిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా పది శాతం కంటే ఎక్కువ వడ్డీ చెల్లించేలా రుణాలు తీసుకోవడంతో.. ఆ భారాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన 25 వేల 612 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీకి మార్చింది. రుణ చెల్లింపుల కాలాన్ని 20 నుంచి 39 సంవత్సరాలకు పెంచింది. మొత్తంగా.. 3 లక్షల 30 వేల కోట్లు.. పాత అప్పులు, వడ్డీల కింద చెల్లించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు వడ్డీ శాతాన్ని తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో భారం తగ్గుతుందని స్పష్టం చేసింది. ఆర్భాటాలకు పోకుండా, ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
ఇక, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక రిపోర్టులోనూ తెలంగాణ అద్భుత ప్రగతి కనబర్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం డేటా ఆధారంగా.. దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక నిర్వహణ గల రాష్ట్రాల్లో 8వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. 18 ప్రధాన రాష్ట్రాల లిస్టులో 44.3 సోరుతో ఫ్రంట్ రన్నర్ హోదా నిలబెట్టుకుంది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తూ, జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ముఖ్యంగా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో, అప్పులను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
సినీ పరిశ్రమ అభివృద్ధికి, సినిమాలకు సంబంధించి అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ని గ్లోబల్ సినీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ వారం నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవంలో.. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే.. రాష్ట్రంలో గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించామన్నారు. అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. నగరంలో ఐలైన్ స్టూడియో ప్రారంభించిందన్నారు సీఎం. నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టేనన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణానికి సింగిల్ విండో విధానం అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఓ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తామని తెలిపారు.
పరాభవ నామ తెలుగు సంవత్సరం.. రైతు నామ సంవత్సరం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వారం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం జరగాలని కోరుకున్నారు. ఈ సీజన్‌లో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలియజేస్తూ.. రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేశారు. పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామన్నారు. దేశంలో రైతులపై అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటించడం గర్వకారణమని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామన్నారు. రైతు భరోసా కోసం 18 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
భద్రాచలంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27న భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. అదేవిధంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న.. రైతు ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇందులో భాగంగా.. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి.. రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలోనే.. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. స్థానిక రైతులతో మాట్లాడిన తర్వాత.. తొలివిడత రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నారు.
Also Read: రైతులకు బంపర్ ఆఫర్.. రైతు భరోసా నిధుల విడుదల తేదీ ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!
Story by: Anup, Big Tv