Deputy Speaker: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది… కానీ ఇంకా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగలేదు. డిప్యూటీ స్పీకర్‌గా పార్టీ ఒక్కరి పేరు ప్రకటించినా.. ఇప్పటివరకు అధికారికంగా మాత్రం ఆ తతంగం మాత్రం పూర్తికాలేదు. అసలు డిప్యూటీ స్పీకర్ ఎంపికలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ చేసిన ఆ ఎమ్మెల్యేకి దానిపై ఇంట్రెస్ట్ లేదా? సదరు ఎమ్మెల్యే ఇంకేదైనా పదవి ఆశిస్తున్నారా…? ఆ పదవిని ఆఫిషియల్ గా ప్రకటించకపోవడం వెనుక ఇంకేమైనా కథ ఉందా?
తెలంగాణ లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది…గడ్డం ప్రసాద్‌కుమార్‌కి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. దీనికి కారణం క్యాబినెట్‌లో మరో రెండు బెర్తులు ఖాళీగా ఉండడమే అనే చర్చ నడుస్తోంది. అదేంటి డిప్యూటీ స్పీకర్ పదవి కి మంత్రి పదవులకు ఉన్న లింక్ ఏంటని అనుకుంటున్నారా…? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్‌గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్‌కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నట్లు 2025 జూన్ 8న ప్రకటన చేసింది.
రాంచంద్రు నాయక్‌కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నట్లు అనౌన్స్ చేసిన తర్వాత రెండో సారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తావనే లేదు. అధికారికంగా ఆయన ఎన్నిక వాయిదా పడుతూనే వస్తోంది. ప్రస్తుతం కాబినెట్ లో రెండు మంత్రివర్గ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎస్టీ సామజికవర్గానికి ఒక ఛాన్స్ దక్కుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ప్రభుత్వ విప్ గా ఉన్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడే డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకుంటే మంత్రి పదవి రేస్ నుండి ఔట్ అయిన్నట్లే అని రాంచంద్రు నాయక్ భావిస్తున్నారట.. ఇందుకోసమే డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది.
అయితే మంత్రి పదివి దక్కించుకునే అవకాశాలు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కి ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఇక్కడ ఒక లిటికేషన్ ఉందంటున్నారు. బాలునాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవరకొండ నియోజకవర్గం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంది. ఇప్పటికే ఆ జిల్లా నుంచి మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. ఇద్దరు రెడ్డి సామజికవర్గానికి చెందిన వారే… ఇక అదే సామజికవర్గానికి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండటంతో… కొత్తగా బాలు నాయక్, రాజగోపాల్ లో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కి అవకాశం వస్తే… బాలు నాయక్ కి కాకుండా ఇంకో జిల్లాకు చెందిన ఎస్టీ నేతకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు.. ఆ ఆశతోనే రాంచంద్రు నాయక్ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు తీసుకోకుండా ఎదురుచూస్తున్నారని చర్చ. చూడాలి మరి రామచంద్రునాయక్ ఎదురుచూపులు ఎంతవరకు ఫలిస్తాయో?
Also Read: మీర్‌పేట్‌లో విషాదం.. పిల్లి మరణం తట్టుకోలేక విద్యార్థిని సూసైడ్
Story by: Apparao, Big Tv