Telangana: తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఓ కొత్త విషయాన్ని చెబుతున్నాయి. అసలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ సీట్లు ఎందుకు దక్కాయి? ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న బీఆర్‌ఎస్ ఎందుకు చతికిలపడింది? బలంగా ఉన్నామన్న బీజేపీ ఎందుకు వెనుకబడింది? అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఈ ఎన్నికల ముందు పార్టీలు రచించిన వ్యూహాలేంటి? ఆ వ్యూహాలు ఎంత మేర ఫలితమిచ్చాయి?
సోషల్ మీడియాలో పీక్స్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం
అధికార కాంగ్రెస్‌పై ప్రజల్లో పీకలదాకా కోపం ఉంది.. రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది.. అవకాశం వస్తే చాలు ఓట్లతో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. అటు బీఆర్‌ఎస్.. ఇటు బీజేపీ నేతలు ప్రతీరోజూ ఇవే మాటలను హోరెత్తిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ ప్రచారం పీక్స్‌లో సాగుతోంది. కానీ ఇవేవీ కూడా నిజం కావని తేల్చేశారు గ్రామ ప్రజలు. మొత్తం మూడు దశల్లో ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. మొదటి దశలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది.
తొలి దశలో మొత్తం 4 వేల 236 పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. ఇందులో 2 వేల 335 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు సాధించారు. అంటే మొత్తం పంచాయతీల్లో 55 శాతం పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 200 పంచాయతీలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఆ పార్టీ నేతల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇక విపక్ష పార్టీల ఆశలు మాత్రం గల్లంతయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అదే వ్యతిరేకతను అస్త్రంగా చేసుకొని ప్రచారం చేస్తూ పోయింది. నిజానికి పార్టీ అగ్రనేతలు ఈ పంచాయతీ ఎన్నికలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపించకపోయినా.. గ్రామస్థాయిలో మాత్రం జోరుగానే ప్రచారం నిర్వహించినట్టు తెలుస్తోంది. కానీ ఇవేవీ కూడా పనిచేయలేదు. కేవలం 1168 పంచాయతీలను అంటే.. 27.5 శాతం పంచాయతీలను మాత్రమే దక్కించుకున్నారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు.
ఇక బీజేపీ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకంటే 4 వేల 236 పంచాయతీలకు గాను ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నది కేవలం 189 మాత్రమే. అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీకి అన్నో ఇన్నో పంచాయతీలు దక్కింది కేవలం కామారెడ్డి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రమే. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు. అయినా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే వీటిని తీసుకుంటాయి.. తీసుకున్నాయి కూడా. గ్రామస్థాయిలో ఆయా పార్టీ నేతలనే బరిలోకి దింపాయి. అందుకే గుర్తులు లేకపోయినా పార్టీల మధ్య కుస్తీలు మాత్రం కామన్. మరి ఈ ఎన్నికలు ఇప్పుడు చెప్పుతున్న సందేశమేంటి అనే దానిపై పోలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
విపక్షాలు చెబుతున్నంత వ్యతిరేకత గ్రామాల్లో లేదా?
గ్రామాల్లో అధికారపార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. రైతులు అస్సలు సంతోషంగా లేరని.. విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. పార్టీలకతీతంగా అందరు నేతలు దాదాపుగా ఇవే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడా లెక్క కాస్త తప్పనే తేలింది. ఆ గ్రామ ప్రజలే ఇప్పుడు అధికార పార్టీకి జై కొట్టారు. సో.. విపక్షాలు చెబుతున్నంత వ్యతిరేకత గ్రామాల్లో లేదని ఈ రిజల్ట్ చెబుతోంది. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి వేగంగా జరుగడంతో పాటు.. సంక్షేమఫలాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నేతలు చెబుతున్న స్థాయిలో లేని గెలుపు
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే.. 1168 స్థానాలు దక్కించుకోవడం చిన్న విషయం కాకపోయినా.. ఆ పార్టీ నేతలు చెబుతున్న స్థాయిలో మాత్రం లేవనే చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల అంచనా ప్రకారం.. ఆ పార్టీ భారీ స్థాయిలో పంచాయతీలను దక్కించుకోవాలి. కానీ అలా జరగలేదు. దీంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్క్రిప్ట్ మార్చేశారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని.. ప్రలోభాలకు గురి చేసిందంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.
గెలుపు తమదే అనే తీరుగా బీజేపీ స్టేట్‌మెంట్స్
ఇక కమలం పార్టీ నేతలు అయితే గెలుపు తమదే అనే తీరుగా స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ అయితే బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు కేటాయిస్తామని ఆఫర్ కూడా చేశారు. కానీ వీటన్నంటిని ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదు. అసలు బీజేపీ పార్టీ నేతలను లైట్ తీసుకున్నారు. నిజానికి నేతలు పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ చేయకుండా.. నేతల మధ్య పంచాయితీలతోనే బిజీగా ఉండటంతో గ్రామ ప్రజలు ఇంకా లైట్ తీసుకున్నారు. మరి ఈ ఫలితాలు మిగిలిన దశలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలను రచించబోతుంది?ఈ ఫలితాల తర్వాత విపక్ష పార్టీలు కొలుకునే అవకాశం ఉందా?
మొదటి దశ ముగిసింది.. కాంగ్రెస్ సత్తా చాటింది. మరి ఈ ఇంపాక్ట్ రాబోయే రెండు దశలపై ఎలా ఉండబోతుంది? పార్టీ గుర్తులు లేకుండా పోటీ జరిగే ఈ ఎన్నికలు.. రాజకీయ పార్టీలకు ఎందుకంత కీలకం? గ్రామపంచాయతీలు గెలిస్తే నెక్ట్స్ జరగబోయేది ఏంటి?
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థు్ల్లో పెరిగిన కాన్ఫిడెన్స్
మొదటి దశ ముగిసింది. అధికార పార్టీ కాంగ్రెస్ సత్తా చాటింది. మరి రెండో, మూడో దశ ఎన్నికల సంగతేంటి? ఇప్పుడిదే ప్రశ్నపై అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. మొదటి దశ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ మిగిలిన రెండు దశలపై తప్పక కనిపించబోతుందనేది మాత్రం వాస్తవం. ఇప్పటికే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్లో కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇప్పుడీ జోష్‌తో మరింత దూకుడుగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పుడు వారి ప్రచారాస్త్రంలో ఈ మొదటి దశ ఎన్నికల ఫలితాలు ఒక అంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలు పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారనడానికి ఈ ఫలితాలే ఓ సంకేతం అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. ఇది ఓటర్లను మరింత ఆకర్షించే అవకాశం లేకపోలేదు.
మిగిలిన దశల్లో సత్తా చాటితేనే ప్రయోజనం..
గత పదేళ్లలో పల్లెల్లో బీఆర్ఎస్ అధిపత్యం నడిచేది. ఎన్నిక ఏదైనా గెలుపు కారు పార్టీదే అన్నట్టుగా ఉండేది హవా. అలాంటి పార్టీకి ఈ ఫలితాలు ఒక వార్నింగ్ అనే చెప్పాలి. ఇప్పుడు మిగిలిన దశల్లో సత్తా చాటితేనే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఇప్పటికే పార్టీ షెడ్డుకు చేరిందనే విమర్శలకు మరింత బలం చేకూరినట్టైంది. బీఆర్ఎస్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లున్నాయి. తమ ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలి.. అదే సమయంలో గ్రామంలో కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించాలి. దీంతో ఇప్పుడు తమ ప్రచారశైలిని మార్చుకునే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయి సమస్యలపై కాకుండా.. స్థానిక సమస్యలపైనే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది.
గెలుపు గుర్రంవైపే మొగ్గు చూపడం మన ఓటర్ల సెంటిమెంట్
రెండో దశలో 4 వేల 332 పంచాయతీలు, 38 వేల 322 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మాములుగానే అయితే ఇండియన్ ఓటర్స్ సైకాలజీ చూస్తే ఓ పార్టీ లీడ్‌లో ఉందని తెలిస్తే గెలుపు గుర్రంవైపే మొగ్గు చూపడం మన ఓటర్ల సెంటిమెంట్. ఇప్పుడీ సైకలాజికల్ ఎఫెక్ట్ అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీపై కనిపించబోతుందని తెలుస్తోంది. అయితే తొలి దశలో కొందరు అధికార పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు భంగపాటు తప్పలేదు. ఇది ఆయా నేతలపై ఇంపాక్ట్ చూపించకమానదు. ఇలాంటి మాత్రం రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఆ పార్టీపై ఉంది. ఇప్పటికే ఈ అంశాన్ని విపక్షాలు తమ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. అటు బీఆర్‌ఎస్ కూడా తొలిదశ రిజల్ట్స్‌తో ఎంతో కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండు, మూడు దశల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించొచ్చు.
కానీ ఇక్కడో విషయం ఉంది. ఇప్పుడు పంచాయతీల్లోనే సత్తా చాటితేనే ముందు ముందు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడక అవుతుంది. అందుకే ఈ ఎన్నికలను ఏ పార్టీ కూడా లైట్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు కేవలం సర్పంచ్‌లు, వార్డు మెంబర్స్‌ను మాత్రమే ఎన్నుకోవడం కాదు. ఇవి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఒక రూట్ మ్యాప్‌ను నిర్దేశిస్తాయి. పంచాయతీ ఎన్నికల తీర్పు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీలకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగే ప్రాంతాలు అనేక పంచాయతీలను కలుపుకొని ఉంటాయి. ఒక ఎంపీటీసీ నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఏ పార్టీ మద్దతుదారుల ఆధీనంలో ఉన్నాయో లెక్కించడం ద్వారా, ఆ స్థానంలో గెలుపును అంచనా వేయడం ఈజీ అవుతుంది. అందుకే ఈ ఎన్నికలను ఏ పార్టీ కూడా లైట్ తీసుకోవడం లేదు.
Also Read: జయశంకర్ భూపాలపల్లి దారుణం.. భార్యను చంపి స్టేటస్ పెట్టిన భర్త..
అందుకే తొలిదశ ఎన్నికల ఫలితాలను చూసి సంబరపడటమో, డీలా పడటమో చేస్తే.. రాజకీయ పార్టీల భవిష్యత్తుపై ఎఫెక్ట్ పడినట్టు. మొదటి దశ ఫలితం ఒక ట్రెండ్‌ను సూచించినప్పటికీ.. మొత్తం మూడు దశల ఫలితాలు మాత్రమే తెలంగాణ పల్లె సీమల్లో ఏ పార్టీకి బలం ఉందో స్పష్టంగా తెలియజేస్తాయనేది నిజం. కానీ ఈ ఫలితాలు తర్వాత జరిగే రెండు దశల పోలింగ్‌పై ప్రభావం చూపడం మాత్రం ఖాయం.
Story By Vamshi Krishna, Bigtv