E-Paper
Advertisement

High Tension in Kaparthi: డ్రైనేజీలో BRS బ్యాలెట్ పేపర్స్.. కలెక్టర్ సీరియస్

High Tension in Kaparthi: డ్రైనేజీలో  BRS బ్యాలెట్ పేపర్స్.. కలెక్టర్ సీరియస్
Advertisement

High Tension in Kaparthi: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో వెలుగుచూసిన ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పోలింగ్ ముగిసిన అనంతరం గ్రామంలోని ఓ డ్రైనేజీ కాల్వలో పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు లభ్యమవడం తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా ఆ బ్యాలెట్ పేపర్‌లన్నీ బీఆర్‌ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థికి సంబంధించిన ‘కత్తెర’ గుర్తుకు వేసినవే కావడంతో ఎన్నికల రిగ్గింగ్‌పై అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే డ్రైనేజీ వద్దకు చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితిని పరిశీలించి ఎన్నికల అధికారులను, పోలీసులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచే ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి అవకతవకలు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా వేసిన ఓట్లను డ్రైనేజీల్లో పడేయడం కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు నిదర్శనమని మండిపడ్డారు.

Advertisement

తమ అభ్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు దొంగదారిలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. గులాబీ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపించడంతోనే కుట్రపూరితంగా బ్యాలెట్ పేపర్‌లను తొలగించి డ్రైనేజీలో పడేశారని విమర్శించారు. ఇది కేవలం చిన్నకాపర్తి గ్రామానికే పరిమితం కాదని, ఇలానే జిల్లాలోని అనేక గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లపై జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ, ప్రజల తీర్పును మోసం చేశారని ఫైరయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

బ్యాలెట్ పేపర్ ఓట్లు డ్రైనేజీలో లభ్యమైన ఘటనను జిల్లా యంత్రాంగం కూడా అత్యంత సీరియస్‌గా తీసుకుంది. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించారు. ప్రాథమిక విచారణలో ఎన్నికల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు జరిగినట్లు తేలడంతో స్టేజ్ -2 ఆర్వోను సస్పెండ్ చేశారు.

మొత్తానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఈ ఘటన.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఎన్నికల స్వచ్ఛతను కాపాడే దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

చిన్నమాధారం సర్పంచ్ ఎన్నికపై వివాదం

నల్లగొండ జిల్లా కనగల్లు మండలం చిన్నమాధారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఫలితంపై తీవ్ర వివాదం కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఈ ఎన్నికలు రాజకీయంగా హోరాహోరీగా సాగడమే కాకుండా, ఫలితాల ప్రకటన తర్వాత ఆరోపణలు–ప్రత్యారోపణలతో ఉద్రిక్తతకు దారి తీశాయి. కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య జరిగిన ఈ పోరు చివరకు న్యాయపోరాటానికి దారి తీసే పరిస్థితి ఏర్పడింది.

చిన్నమాధారం గ్రామ పంచాయతీలో మొత్తం 8 వార్డులు ఉండగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా మల్లికంటి సుజాత, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పిండి భాగ్యమ్మ బరిలోకి దిగారు. వీరితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేశారు. వార్డు సభ్యుల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఐదు వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మూడు వార్డుల్లో గెలుపొందారు. దీంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు బీజేపీ వైపు ఉన్నాయనే అంచనాలు మొదట వినిపించాయి.

సర్పంచ్ ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ అనంతరం రెండో, మూడో రౌండ్లలో బీజేపీ అభ్యర్థి పిండి భాగ్యమ్మకు స్పష్టమైన ఆధిక్యం లభించినట్లు ఆమె వర్గం చెబుతోంది. రెండో రౌండ్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి మల్లికంటి సుజాత స్వల్ప ఆధిక్యం సాధించిందని పేర్కొన్నారు. అయితే మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సుజాత 11 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఫలితమే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది.

కౌంటింగ్ జరిగిన తీరుపై బీజేపీ సర్పంచ్ అభ్యర్థి పిండి భాగ్యమ్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలైన ఓట్ల సంఖ్యకు, లెక్కించిన ఓట్ల సంఖ్యకు పొంతన లేదని ఆమె ఆరోపించారు. కొన్ని ఓట్ల బండిళ్లు మాయం చేశారని, కావాలనే ఫలితాన్ని తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ చేస్తామని చెప్పి చివరకు చేయకుండా మోసం చేశారని ఆమె ఆరోపించారు.

మంత్రి కోమటిరెడ్డి ఒత్తిడితోనే గెలుపు తారుమారు

ఈ వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒత్తిడి ఉందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. స్టేజ్–2 అధికారి మల్లిఖార్జున్ రెడ్డికి మంత్రి ఫోన్ చేసి కాంగ్రెస్ అభ్యర్థినే విజేతగా ప్రకటించాలని చెప్పడంతోనే ఫలితం మారిందని పిండి భాగ్యమ్మ ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపైనా బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భర్త సెల్ ఫోన్‌తో పోలింగ్ స్టేషన్‌లో తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని, తమ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే మాత్రం లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులు విధులు నిర్వర్తించకూడదనే నిబంధన ఉన్నా, సీఐ ఆదిరెడ్డి పోలింగ్ స్టేషన్‌కు వచ్చి హంగామా చేశారని విమర్శించారు. తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికే లాఠీ ఛార్జ్ చేశారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

కలెక్టర్ కు ఫిర్యాదు, హైకోర్టులో కేసు

ఈ వివాదంపై బీజేపీ సర్పంచ్ అభ్యర్థి పిండి భాగ్యమ్మ, నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసి, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్ రావుతో కలిసి హైకోర్టులో కేసు వేయనున్నట్లు భాగ్యమ్మ తెలిపారు.

నార్కట్ పల్లి లో ఓటమి అభ్యర్థుల రచ్చ.

మరోవైపు నల్గొండ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. నార్కట్‌పల్లి మండలం ఓరవాణి BRS సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయారు. దీంతో ఆయన.. ఓటర్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని.. దేవుడు ఫొటోతో ఇంటింటికీ తిరిగారు. డబ్బులివ్వకపోతే పురుగుల తాగుతామని తన భార్యతో కలిసి బెదిరించారు. తనకు ఓటు వేశారా? లేదా? వేయకుంటే నా డబ్బులు నాకు ఇవ్వండి అంటూ గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లారు. ఈ వినూత్న పద్ధతిని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.

 

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×