TG Rising Global Summit: తెలంగాణని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చే విజన్‌తో.. రేవంత్ సర్కార్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. భారీ పెట్టుబడులని ఆకర్షించడమే టార్గెట్‌గా ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. ఫోర్త్ సిటీలో.. ఏమేం కంపెనీలు రాబోతున్నాయ్? ఈ సమ్మిట్ తర్వాత.. హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్‌గా మారుతుందా? భవిష్యత్ భారతానికి.. ఫ్యూచర్ సిటీ గర్వకారణంగా మారేలా తీర్చిదిద్దబోతున్నారా?
ఇంకొన్ని రోజుల్లో.. ఇండియా మొత్తం తెలంగాణ వైపు చూసే రోజు రాబోతోంది. ఇందుకోసం.. భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయ్. ఈ నెల 8,9 తేదీల్లో.. గ్లోబల్ సమ్మిట్ మెగా ఈవెంట్ జరగనుంది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో.. ఈ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కమ్ జాయిన్ ది రైజ్.. అనే నినాదంతో అందరికీ ఆహ్వానాలు పంపుతోంది. కేవలం.. పెట్టుబడుల సదస్సుగానే కాకుండా.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని.. గ్లోబ్ మొత్తం తెలిసేలా ఈ గ్లోబల్ సమ్మిట్‌ని నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఈ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులతో పాటు రాబోయే రెండు దశాబ్దాల తెలంగాణ ప్రస్థానాన్ని తెలియజేసేలా.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంట్‌ని కూడా ఆవిష్కరించనున్నారు. జాతీయ వృద్ధి లక్ష్యాలకు తగ్గట్టుగా, వికసిత్ భారత్ 2047 స్ఫూర్తితో రోడ్ మ్యాప్ రూపొందించారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడం, అన్ని రంగాల్లో సమానమైన ప్రగతి సాధించడం, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే.. ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యంగా కనిపిస్తోంది. భవిష్యత్ తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? పెట్టుబడిదారులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అనేది.. ఈ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నారు. మరోవైపు.. ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని
విదేశీ ప్రతినిధులకు పరిచయం చేయనుంది ప్రభుత్వం. పెట్టుబడులంటే వ్యాపారం మాత్రమే కాదు.. ఇక్కడి జీవన విధానం, సురక్షితమైన వాతావరణం కూడా కీలకమేననే విషయాన్ని చాటి చెప్పనున్నారు. ఇండియాలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. ఇన్వెస్టర్లందరికీ తెలంగాణే తొలి ఛాయిస్ కావాలనే టార్గెట్‌తో.. ఈ సమ్మిట్‌ని డిజైన్ చేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా స్టేట్‌ని తయారుచేసేందుకు అవసరమైన అన్ని వనరులు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
2047 నాటికి తెలంగాణని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో.. ఎంటర్‌టైన్‌మెంట్, టూరిజంతో పాటు ఇతర రంగాల్లో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో.. గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. దీనికి సంబంధించి.. గ్లోబల్ సమ్మిట్‌లో అగ్రిమెంట్ కుదుర్చుకోనున్నారు. రిలయన్స్ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్‌కి చెందిన వంతారా సంస్థ.. యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వెల్డ్ లైఫ్ కన్జర్వేటరీ, నైట్ సఫారీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇక.. ఫుడ్‌లింక్ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్ కంపెనీ 3 వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుంది.
తెలంగాణ స్టేట్ పెట్టుబడులకు డెస్టినేషన్‌గా ఎలా మారిందో వివరించేలా.. ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ఫార్మా ఎకో సిస్టమ్.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందింది. అలాగే.. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న సానుకూలతలను ప్రభుత్వం హైలైట్ చేయనుంది. విస్తారమైన భూములు అందుబాటులో ఉండటం, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన రోడ్లు, మౌలిక వసతులు, 24 గంటల విద్యుత్ సరఫరా లాంటి అంశాలను.. ఇన్వెస్టర్ల ముందుంచనున్నారు. ప్రభుత్వం తరఫున అందించే రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా డిజైన్ చేసిన ప్రజంటేషన్లు.. గ్లోబల్ సమ్మిట్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. గత రెండేళ్ల సక్సెస్ స్టోరీలతో పాటు రాబోయే 22 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌ని వివరించేలా పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ ఇవ్వనున్నారు.
దేశ, విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రముఖులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న రాజకీయ నేతలు, టెక్ దిగ్గజాలు, కంపెనీల సీఈవోలకు కూడా ఇన్విటేషన్లు పంపించారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మొదలుకొని.. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యుల వరకు ఎందరో ప్రముఖులను ఈ వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. భారత ప్రధాని నరేంద్రమోడీని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, కుదుర్చుకోబోయే ఒప్పందాలు.. తెలంగాణ ఆర్థిక గతిని మారుస్తాయని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. కేవలం.. రెండు రోజుల కార్యక్రమంగానే కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ప్లీనరీ సహా, సీఎం వన్ టు వన్ మీటింగ్స్ కూడా డిజైన్ చేశారు. ఈ నెల 13న గ్లోబల్ సమ్మిట్ ముగింపు ఈవెంట్‌ని కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఓ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మెస్సీ రాకతో.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ క్రీడా వేదికలపైనా మార్మోగుతుందని భావిస్తున్నారు. పెట్టుబడుల సదస్సు, క్రీడా సంబరానికి లింక్ చేస్తూ.. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం.. తెలంగాణ రైజింగ్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా.. అద్భుతమైన ముగింపుగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఒక్క తెలంగాణనే కాదు.. ఇండియా ఫోకస్ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మీదే ఉంది. గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను, వివిధ కంపెనీల ప్రతినిధులకు.. ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ సమ్మిట్‌తో.. ఇండియా గ్రౌండ్‌లోనే కాదు ఇంటర్నేషనల్ రేంజ్‌లో తెలంగాణ పేరు వినిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ గురించి డిబేట్ మొదలవుతుంది. అనుకున్న విధంగా ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించగలిగితే.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ ఫ్యూచర్ ఏ విధంగా మారుతుంది? ఇప్పుడున్న దానికంటే.. ఇంకెంత బాగుంటుంది?
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్.. కేవలం రాష్ట్రానికే కాదు యావత్ దేశానికి ఫోకస్ పాయింట్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులకు ఆహ్వానం పంపడంతో.. ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఈ సమ్మిట్ సక్సెస్ అయి, అనుకున్న విధంగా పెట్టుబడులను ఆకర్షించగలిగితే.. హైదరాబాద్ మాత్రమే కాదు తెలంగాణ భవిష్యత్తులోనూ విప్లవాత్మక మార్పులు వస్తాయి. దానికోసమే.. దావోస్ బిజినెస్ ఫోరమ్‌కి ఏమాత్రం తీసిపోని రీతిలో, వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ రేంజ్‌లో.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయ్. ఇందుకోసం.. ముచ్చర్లలోని భారత్ ఫ్యూచర్ సిటీని అన్ని విధాలుగా ముస్తాబు చేస్తున్నారు. 500 కంపెనీల నుంచి వెయ్యి మందికి పైగా గ్లోబల్ డెలిగేట్లు సమ్మిట్‌కు హాజరుకానున్నారు. దాంతో.. ఈ సదస్సుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దేశ, విదేశాలనుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతిని, కళా, వారసత్వ సంపదను పరిచయం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత ఎక్కువమంది పొలిటికల్ ఐకాన్స్‌ని, కార్పొరేట్ దిగ్గజాల్ని రప్పించి.. సమ్మిట్‌ని సూపర్‌సక్సెస్ చేయాలన్నది సర్కార్ ఆలోచన. తెలంగాణ అంటే భవిష్యత్ భారతానికి గర్వకారణం అనేదే.. గ్లోబల్ సమ్మిట్ మెయిన్ థీమ్.
ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ మ్యాప్‌లో ఉంది. ఇప్పుడు. ఫ్యూచర్ సిటీ ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. హైదరాబాద్ కేవలం ఓ ఐటీ కేంద్రంగానే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, స్పేస్ టెక్నాలజీ లాంటి అత్యాధునిక రంగాలకు గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుంది. అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాలు, స్టార్టప్‌లు ఇక్కడ నెలకొల్పడం వలన.. యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రధానంగా.. తెలంగాణలో 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా.. విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని.. పెట్టుబడిదారులకు వివరించనున్నారు. అంతేకాదు.. ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్టర్లకు అనుకూల అంశాలైన ఔటర్ రింగ్ రోడ్డు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్డు, రైలు మార్గం, డ్రైపోర్ట్ గురించి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే.. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు కూడా మొదలయ్యాయ్.
పరిశ్రమల స్థాపనకు క్లియరెన్స్ మరింత సులభతరం చేసేలా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీజీ-ఐపాస్ 2.0 పేరుతో తీసుకురానున్న కొత్త విధానంలో.. ఆటోమేటిక్ అనుమతుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి.. 2039 నాటికి పూర్తిగా ఆటోమేటెడ్ క్లియరెన్స్ ఇచ్చే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అలాగే.. వాణిజ్యపరమైన వివాదాల పరిష్కారం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా.. అధిక వృద్ధి రేటు ఉన్న స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమల కోసం ఈక్విటీ గ్యారెంటీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం వల్ల చిన్న పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయి సంస్థలుగా ఎదిగేందుకు, మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు రూట్ క్లియర్ అవుతుంది. పెట్టుబడులు పెరిగితే, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడతాయి. ప్యూచర్ సిటీలోనూ కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, టెక్ పార్కులు వస్తాయ్. కేవలం ఐటీ, ఫార్మానే కాదు ఫిన్‌టెక్ , ఏరోస్పేస్, హెల్త్‌టెక్, గ్రీన్‌టెక్ లాంటి హై-టెక్ రంగాల్లో లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇవి అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు కాబట్టి, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం సైతం పెరుగుతుంది. ఫ్యూచర్ సిటీ విజన్ వల్ల.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా తదుపరి స్థాయికి వెళతాయ్. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తే గనక భారత్ ఫ్యూచర్ సిటీ.. ఇండియా సిలికాన్ వ్యాలీగానూ, ఆసియాలో టెక్నాలజీ గేట్ వే గా ఎదుగుతుంది. ఇది.. ఉద్యోగాలను సృష్టించే ఓ ఇంజిన్‌గా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్‌ని, ఇతర కంపెనీలను ఆకర్షించే మ్యాగ్నైట్‌గా మారుతుంది.
Story by Anup, Big Tv