CM progress Report: తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. ఢిల్లీనైనా ఢీ కొడతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదం ఉంటే.. రాష్ట్రం కోసం ఏ విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విజన్ డాక్యుమెంట్‌ని.. గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాల పేరిట.. సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం జిల్లాలను చుట్టేశారు. తెలంగాణని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేలా రోడ్ మ్యాప్ తయారుచేశామని తెలిపారు.
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే విజన్ డాక్యుమెంట్‌ని ఆవిష్కరించడమే.. ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ అధికారులతో.. సీఎం రివ్యూ నిర్వహించారు. విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపునిచ్చే విషయంలో.. సీఎం కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలకు.. విజన్ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యతనివ్వాలన్నారు.ఈ విజన్ డాక్యుమెంట్ డిజిటల్ రూపంలో పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, దాని ప్రాముఖ్యత, ప్రభుత్వ దార్శనికతను దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో తెలియజెప్పేలా ఉండాలన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా.. ఢిల్లీనైనా ఢీ కొడుతా! నిధులు తీసుకొస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి కావలసిన నిధులు, రావలసిన అనుమతుల కోసం ప్రధాని, కేంద్రమంత్రులని అడగటం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అన్నారు. ఒకటికి వంద సార్లు తిరుగుతానని చెప్పారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా.. వరంగల్ జిల్లా నర్సంపేటలో 532 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. నిరుపేదలు, దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ పిల్లలు చదువుకుంటేనేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. చదువొక్కటే బతుకుల్లో మార్పు తెచ్చి.. సమాజంలో గౌరవంగా నిలబెడుతుందని, ప్రపంచంతో పోటీ పడేలా చేస్తుందన్నారు.
రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలంటే.. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ కీలకమన్నారు. ఆయా రంగాల్లో లక్ష్యాలను సాధించడానికి.. ప్రపంచ స్థాయిలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌తో సమంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. పక్క రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలుంటే, తెలంగాణలో ఒక్కటి మాత్రమే ఉందన్నారు. డిసెంబర్ చివరినాటికి భూ సేకరణ పూర్తి చేసి మార్చి 31 లోపు వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ తరహాలోనే వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి.. ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు. ఉస్మానియా అభివృద్ధి పనులపై సీఎం ఈ వారం రివ్యూ నిర్వహించారు. యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన.. వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ని ముఖ్యమంత్రి వీక్షించారు. హాస్టల్ భవనాలు, రోడ్లు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి.. మార్పులు చేర్పులను సూచించారు. ముందుగా.. అభివృద్ధి నమూనాలి విద్యార్థుల ముందుంచాలని.. వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లతో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికలపై తుది నిర్ణయం ఖరారు కావాలని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. హాస్టల్, అకడమిక్ భవనాల నిర్మాణం విషయంలో.. వంద మంది విద్యార్థులుంటే అదనంగా మరో పది శాతం విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని చెప్పారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలోనే.. ఓయూను సందర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణలో ఆదిలాబాద్‌ను అభివృద్ధి చెందిన జిల్లాగా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి.. జిల్లాలోని పంట పొలాలకు నీళ్లిస్తామన్నారు. త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు, చనాక – కొరాట ప్రాజెక్టు నిర్మాణంతో పాటు, విమానాశ్రయం, యూనివర్సిటీ ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం లాంటి వాటికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తానే తీసుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో 260 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా.. మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్‌లు స్థాపించనున్నారు. 160 స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరుతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, పాఠశాలల్లో అదనపు గదులని నిర్మించనున్నారు. సంజయ్ నగర్ ప్రాంతంలో పోలీస్ క్వార్టర్స్, భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు.
సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని.. సంక్షేమం వైపు నడిపించడానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పనులను.. త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించినట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇక.. మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా హుస్నాబాద్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. హుస్నాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో.. భవిష్యత్తులో తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు సీఎం. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దాదాపు 263 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణంతో పాటు ఏటీసీ, ఆర్టీఏ యూనిట్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. 20 కోట్లతో హుస్నాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 86 కోట్లతో.. హుస్నాబాద్ అర్బన్-కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా 4 లైన్ల రోడ్డుని నిర్మించనున్నారు. హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా.. తెలంగాణ వంతుగా దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు సీఎం వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ.. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలనే సమగ్రమైన ప్రణాళికలతో.. రోడ్ మ్యాప్‌ను తయారుచేసినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహాకారాలు అందించాలని.. ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, రాజ్‌నాథ్ సింగ్ , మనోహర్ లాల్ ఖట్టర్‌ని కూడా గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు సీఎం. అదేవిధంగా.. ఎంపీలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించారు.
దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా.. భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ యూనివర్సిటీకి.. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. సింగరేణి లాంటి పేరొందిన సంస్థలున్న ప్రాంతంలో.. అపారమైన ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు పరిశోధన కోసం.. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణని ఇక్కడ నెలకొల్పామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో.. విద్య, నీటి పారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ వారం వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల పరిధిలో.. 152 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించనున్నారు. 122 కోట్లతో జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మక్తల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం రెండో సంవత్సరం విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలో పాడిపంటలు పండాలన్న లక్ష్యంతో.. దశాబ్ద కాలంగా పాతాళానికి తొక్కేసిన జీవో 69ని బయటకు తీయడమే కాకుండా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పనులను.. త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని.. సంక్షేమం వైపు నడిపించడానికి నిరంతరం పనిచేశామన్నారు సీఎం. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లపైనే ఖర్చు చేసిందన్నారు. ఉన్న కష్టాలను అధిగమిస్తూ, అప్పులు చెల్లించుకుంటూ.. వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక.. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 119 కోట్లతో.. అనేక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 8 కోట్లతో మక్తల్ మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 25 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్, మూడున్నర కోట్లతో మక్తల్ కేజీబీవీలో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త తరగతి గదులను నిర్మించనున్నారు. 82 కోట్లతో మక్తల్ నుంచి నారాయణపేట్ రోడ్డు తొలి దశలో 26 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు.
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. ఏమాత్రం పొరపాట్లు దొర్లినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడారం అభివృద్ధిలో భాగంగా రాతి పనులతో పాటు రోడ్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలతో పాటు మిగతా కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించిన సీఎం.. కొన్ని విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్ద పీట వేయాలని మరోసారి స్పష్టంగా చెప్పారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు.. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్.. సంజయ్ కులశ్రేష్ఠని కోరారు. ఈ వారం హైదరాబాద్ వచ్చిన కులశ్రేష్ఠ.. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై చర్చించారు. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి లోన్ రీకన్‌స్ట్రక్షన్ అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ధి రేటుతో ఉన్న తెలంగాణలో.. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో దీర్ఘకాల రుణాలు ఇవ్వాలని కోరారు. 10 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేసే విషయంపైనా కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. వచ్చే వారం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవ్వాలని.. హడ్కో ఛైర్మన్‌ని.. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్‌తో.. ఈ నెల 13న జరిగే ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి MCHRD గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఫుట్ బాల్ ప్లేయర్లతో కలిసి.. గేమ్ ఆడారు.
గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో.. భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని.. తెలంగాణని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రూపొందించిన.. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ని.. త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో.. భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగిందన్నారు. రాష్ట్రాన్ని.. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి విజన్‌తో పాటు దాన్ని అమలు చేసే వ్యూహంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే స్పష్టమైన పాలసీ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ.. బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి తెలంగాణని మూడు విభాగాలుగా విభజించి స్పష్టమైన ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాన్ని.. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించారు. మహానగరం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. ఇక.. పారిశ్రామిక కాలుష్యం, మూసీ, పురాతన వాహనాలు, వాయు కాలుష్యం లాంటి వాటిని తగ్గించడం ద్వారా నెట్ జీరో సిటీగా మార్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక.. ఓఆర్ఆర్ అవతలి వైపు నుంచి.. తెలంగాణకు మణిహారంగా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు వరకు.. పెరీ అర్బన్ ఎకానమీ కింద గుర్తించి.. ఆ ప్రాంతాన్ని మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా గుర్తించారు. అందులో ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, మిగతా నగరాలకు బుల్లెట్ ట్రైన్స్ ప్రతిపాదించారు.
ఈ జోన్‌లో హైవేలు, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ పోర్టు కనెక్టివిటీ ఉండనున్నాయి. కనెక్టివిటీ పెంచితేనే.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్యూర్, క్యూర్, రేర్.. వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చడానికి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఒక్కో రీజియన్‌లో ప్రాంతాల వారీగా ఏం చేయబోతున్నామన్నది.. డాక్యుమెంట్‌లో స్పష్టమైన వివరాలు ఉంటాయన్నారు. మారుమూల తండా నుంచి హైదరాబాద్ వరకు సమగ్రాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2034 నాటికి తెలంగాణని 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్లడానికే.. గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Story by Anup, Big Tv