Pithapuram Politics: పిఠాపురం నియోజకవర్గం లో పవన్‌కళ్యాణ్ గెలిచి ఏడాది గడుస్తున్నా.. అక్కడ టీడీపీ, జనసేనలో ఆధిపత్యపోరుకు మాత్రం తెరపడటం లేదు. సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమంతో టిడిపి ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్చార్జి మినిస్టర్ నారాయణ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇంటి దగ్గరకు జిల్లా అధికారులను పిలిపించి పిఠాపురంలో వర్మ మాటే శాసనంగా నడుచుకోవాలని ఆదేశించారంట. అయితే డిప్యూటీ సీఎం పవన్ సెగ్మెంట్లో అది ప్రాక్టికల్‌గా అమలవ్వడం ఎంత వరకు సాధ్యమో కాని.. కూటమి పార్టీల మధ్య అధికారులు నలిగిపోవాల్సి వస్తోందంట. ఆ క్రమంలో ఉప్పాడ రక్షణ గోడపై రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్దం హాట్‌టాపిక్‌గా మారిందిప్పుడు..
పిఠాపురంలో మాటలకే పరిమితమవుతున్న కూటమి పొత్తు ధర్మం
కూటమి పార్టీల మిత్రబంధం, పొత్తు ధర్మం అవేవి మాటల్లో కనపడుతున్నాయి తప్ప పిఠాపురం జనసేన, టిడిపిలో ఆ ఐక్యత కనబడడం లేదనే టాక్ నడుస్తోందట. ఎన్నికల పూర్తైనప్పుటి నుంచి నాయకులు మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతోంది. పదవుల విషయంలో, నాయకులకు ప్రాధాన్యత విషయంలో, సమస్యలపై ఇరు పార్టీల నేతలు స్పందిస్తున్న తీరుతో రెండు పార్టీల నాయకుల మధ్య గ్యాప్ ఉందనేది తెటతెల్లమవుతోందని పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న చర్చ. తాజాగా సొసైటీ బ్యాంకుల చైర్మెన్ల విషయంలో కూడా ఈ గ్యాప్ మరోసారి బయట పడింది.
12 సోసైటీ చైర్మన్ పదవులను పంచుకున్న మిత్ర పక్షాలు
పిఠాపురం నియోజవర్గ పరిధిలో 12 సొసైటీ బ్యాంకులకు గాను ఏడు సొసైటీ బ్యాంకుల చైర్మన్ పదవులు జనసేనకు, నాలుగు టిడిపికి, ఒకటి బిజెపిలకు కేటాయించేలా వర్మతో భాగ్యనగరంలో జనసేన పెద్దలు కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే వర్మ అక్కడే చక్రం తిప్పారంట. నియోజకవర్గంలో ఉన్న మేజర్ సొసైటీలు నాలుగూ టిడిపి వశమయ్యాయి.. వర్మ నాలుగు సొసైటీలకు గాను ఓసీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సమానంగా చైర్మన్ పదవులు కేటాయించారు. జనసేన మాత్రం 7 సొసైటీలకు కాపులనే నియమించడంతో మిగిలిన సామాజిక వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోందం. దీన్ని బట్టి చూస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆధిపత్య పోరు పెరుగుతుందే తప్ప కానీ తగ్గేలా కనబడడం లేదంటున్నారు
ఉప్పాడ తీరం కోతపై ఎవరి స్టేట్‌మెంట్లు వారివే
పిఠాపురం సెగ్మెంట్ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతంలో కోత విషయంలోను రెండు పార్టీల నాయకులు స్పందించిన తీరు కూడా చర్చకు దారి తీస్తోందంట. సాగర కోత సాక్షిగా మత్స్యకారులను తమ వైపు తిప్పుకోవడానికి జనసేన, టిడిపి పార్టీలు వేరువేరుగా ప్రకటనలు చేయడం ఆధిపత్య పోరును మరింతం ముదిరేట్లు చేశాయనే చర్చ నియోజకవర్గంలో నడుస్తోందట. మేమంటే మేము అనే విధంగా నాయకులు చేసిన ప్రకటనలు, పర్యటనలు అందుకు అద్దంపడుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉప్పాడ సముద్ర తీర రక్షణ గోడ విషయంలో ఇటీవల ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయంలో కూటమిలోని అటు టిడిపి, ఇటు జనసేన మధ్య విభేదాలు మరోసారి రాజుకున్నాయట.
మాజీ ఎంపీ వంగా గీత వినతులను పట్టించుకోని కేంద్రం
ఉప్పాడ తీరం రక్షణ, సముద్రపు కోత శాశ్వత పరిష్కారం కోసం రూ.323 కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించామని గత నెల 18న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. గతంలోనూ తీర రక్షణ గోడకు అనేక ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్రం దీనికి సంబంధించిన నిధులను కేటాయించ లేదు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి తీరప్రాంత రక్షణ కోసం నిధులను కేటాయించాలని విజ్ఞప్తులు చేశారు. కానీ అవేమీ వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు పంపగా పనులు ప్రారంభం అయిపోయాయి అన్నట్టు జనసేన శ్రేణులు విసృత్తంగా ప్రచారం చేశారు. కేవలం ప్రతిపాదనలు పంపి, కేంద్రం నుంచి ప్రకటన వెలువడకుండానే జనసైనికులు చేసుకుంటున్న ప్రచారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇబ్బందుల్లో ఉంటే కనీసం పలకరించే నాయకులే లేకుండా పోయారని, ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం లేనిపోని హడావుడి చేస్తున్నారని ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే స్పాట్
ఆ క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ రంగంలోకి వచ్చారు.తీర ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడారు. స్థానికులతో కలిసి మాట్లాడిన వర్మ… ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఉప్పాడ తీరాన్ని రక్షించి తీరుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని స్థానికులకు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో సీన్‌లోకి జనసైనికులు వచ్చారు. ఉప్పాడ పరామర్శ యాత్ర కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లైంది. ఉప్పాడ తీర రక్షణ విషయంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకపోవడంతో జనసేన పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. తన సొంత క్రెడిట్ కోసం వర్మ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ జనసేనాని ప్రతిపాదనలు పంపితే మీరు ఎలా ప్రచారం చేసుకుంటారని మండిపడుతున్నారు. మొత్తానికి పిఠాపురంలో జనసేన, టిడిపిల మధ్య వైరం ఏదో ఒక ఇష్యూలో తరచు రచ్చకు ఎక్కుతుండటం సామాన్యులకు అంతుపట్టకుండా తయారైందంటున్నారు.
Story By Rami Reddy, Bigtv