అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందట.. సేమ్ అట్లనే ఉంది ఈయన వ్యవహారం. దళిత కార్డుతో రాజకీయాల్లో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. పొద్దున లేస్తే ఏదో ఒక ఇష్యూపై ప్రెస్‌మీట్ పెట్టి తనదైన రాగం ఆలపించే ప్రవీణ్‌కుమార్ గళం స్పీకర్ విషయంలో మాత్రం మూగబోయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంగా తిట్టిన వీడియో అంతటా వైరల్ అయ్యింది. దీన్నికాదనడానికి, తప్పించుకోవడానికి వీలు లేకున్నా.. కేటీఆర్, కేసీఆర్ మాత్రం సమర్థించుకునే క్రమంలో తంటాలు పడుతున్నారు. అయినా బీఆర్‌ఎస్ పార్టీ ఈ విషయంలో అభాసుపాలైంది.
కానీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాత్రం ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పశ్చాత్తాపం ప్రకటించలేదు. పార్టీ స్టాండ్‌ను ధిక్కరించలేదు. గులాబీ పార్టీ పెద్దలను ప్రశ్నించేంత సీన్ ఆయనకు లేదనుకో. ఎందుకంటే తాము ఊహించుకుంటున్న రాబోయే ప్రభుత్వంలో ఆయన హోం మినిష్టర్. అదే భ్రమల్లో మునిగి తేలుతున్నాడు ప్రవీణ్.
అందుకే ఈ విషయంలో తానేమీ మాట్లాడలేకపోయాడు. కానీ నిత్యం సోషల్ మీడియాలో ఏదో విధంగా వైరల్‌గా నిలిచేందుకు తహతహలాడే ప్రవీణ్‌ను.. ఈ విషయంలో ఇప్పుడు అదే మీడియా ట్రోల్ చేస్తున్నది. ప్రశ్నిస్తున్నది. తన రాజకీయాల కోసం, పదవుల కోసం దళితుల ఆత్మ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టేలా ప్రవీణ్ వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.
అయితే, తగుదునమ్మా అని .. అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న రాజకీయాలకు ఆయన దూరంగా కూడా లేడు. బీఆర్‌ఎస్ నేతలతో కలిసి తిరుగుతూనే ఉన్నాడు. మరి ఈ సెషన్‌లో కీలకంగా మారిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల దాడి విషయంలో కించుత్తు కూడా ఆయన సిగ్గుపడినట్టు లేదు. కనీసం దూరంగా ఉండే ప్రయత్నం చేయడం లేదు.
కేసీఆర్ చావును కోరుతున్నారని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చే ప్రోగ్రాంను దగ్గరుండి మరీ నడిపించిన ప్రవీణ్.. మరి దళిత స్పీకర్ ఆత్మగౌరవాన్ని నడిబజారులో ఇజ్జత్ తీసేసిన వైనంపై ఎందుకు స్పందించలేదు…? అనే ప్రశ్నలు, నిలదీతలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏరికోరి తెచ్చుకున్నాడు. మాట్లాడితే పోలీసు రూల్స్ అంటాడు. నిబంధనలు వల్లెవేస్తాడు. రాజ్యాంగం ఏం చెబుతుందో వివరిస్తాడు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్సీ దురంహకారంపై మాట్లాడాడు.
కనీసం.. ఇలా మాట్లాడాల్సింది కాదు.. ఇది మంచి పద్దతి కాదు.. దీనికి నేను విచారిస్తున్నాను.. అని కూడా అనడానికి ఆయనకు నోరు రాలేదు. అంటే.. చెప్పేందుకే నీతులు.. మీరు పాటించేందుకు కాదు… అన్నట్టుగానే ఉంది ప్రవీణ్ వ్యవహారం అని తిట్టిపోస్తున్నారు. మొత్తం దళితులంతా బీఆరెస్ పార్టీకి వ్యతిరేకంగా మారడంలో ప్రవీణ్‌లాంటి వారి మౌనం, తప్పించుకునే దోరణి కూడా ఓ ప్రధాన కారణంగా చెబుతున్నారు.