అసలు బీఆరెస్ అధినేత.. తమ పార్టీ సభ్యులకు ఏం చెప్పి పంపారు? వీళ్లేం చేశారు? చర్చించాలి.. నిలదీయాలి.. అనే దిశానిర్దేశం చేశామని బయటకు ప్రకటనలు చేసినా. చర్చ కంటే రచ్చ రాజకీయానికే బీఆరెస్ మొగ్గు చూపిందా? అసలు అసెంబ్లీ సెషన్స్‌కు హాజరు కావాలనే ఉద్దేశ్యం ఆ పార్టీ నేతలకు లేదా? కయ్యానికి కాలు దువ్వేలా నల్ల టీషర్టులు, దానిపై రాతలు.. పోలీసులతో యుద్దానికి తలపడేందుకే సిద్దమై వచ్చారా? ఇదంతా ఓ వ్యూహంలో భాగమేనా? అసెంబ్లీ తొలి రోజు… ఆ మరుసటి రోజు పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఈ రాజకీయాలపై జనం ఏమనుకుంటున్నారు? ఎవరి తప్పిదం ఎంత? స్పీకర్ కంట తడి పెట్టే విధంగా రాజకీయాలను కలుషితం చేసిందెవ్వరు? ఇప్పుడు వీటిపైనే ప్రధాన చర్చ జరుగుతోంది..
కేసీఆర్ ఇదే చెప్పి పంపారా?
కేసీఆర్ దిశానిర్దేశం చేశారంటే.. అంతా ఏమనుకున్నారు? సర్కార్ ఇచ్చిన హామీలపై ప్రతిపక్షం ఇక బలమైన పోరాటానికి దిగనుందని భావించారు. అసెంబ్లీలో చర్చలు వాడీవేడీగా ఉంటాయనుకున్నారు. శాసనసభలో ఇరు పార్టీల మధ్య జరిగే చర్చ వల్ల కనీసం ఎంతో కొంత జనానికి మేలు జరుగుతుందనే భావన క్రియేట్ అయ్యింది. కానీ జనం అనుకున్నదొక్కటి.. అక్కడ జరిగింది మరొక్కటి. కొండంత రాగం తీసిన బీఆరెస్ నేతలు..ఎందుకిలా చేశారు..? చర్చను పక్కదోవ పట్టించి, రచ్చ రాజకీయం చేయడం వల్ల పార్టీ మైలేజీ పెంచుకోవడానికే ప్రయార్టీ ఇచ్చారా? చర్చ జరిగితే జనానికి మేలు జరుగుతుందనే లాజిక్‌ను మిస్ అయ్యారా? కావాలనే ఈ ఎత్తుగడను ఎన్నుకున్నారా? అవుననే సమాధానాలు వస్తున్నాయి.
కవ్వింపు చర్యలు.. పిడిగుద్దులు.. బనీను రాజకీయాలు..!
రావడం రావడమే.. నల్ల టీషర్టులు ధరించి వచ్చారు. ఇలా వచ్చినా పోలీసులు అడ్డగించేవారు కాదేమో. కానీ ఆ అంగీలపై రాతలు రాసుకున్నారు. దీనిపైనే స్పీకర్ అభ్యంతరం చెప్పి.. వారిని అడ్డుకోవాలని పోలీసులను అదేశించారు. గతంలో కూడా ఓసారి బీఆరెస్ సభ్యులు నల్ల టీషర్టులు ధరించి వచ్చినా అనుమతించారు.కానీ ఈసారి సభలో చర్చ, సర్కార్‌ను నిలదీయాలనే వ్యూహం కన్నా.. రచ్చ రాజకీయానికే బీఆరెస్ మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. అందుకే సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసుకురావడం, పోలీసులు అడ్డగించిన సమయంలో.. ఓ యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఖాకీలతో బాహాబాహీకి దిగేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. పిడిగుద్దులు కురిపించడమే కాదు.. వేలెత్తి చూపుతూ వార్నింగులు కూడా ఇచ్చారు. మేమే వస్తాం.. మీ అంతు చూస్తామనే బెదిరింపులు.. బీఆరెస్ రచ్చ రాజకీయాలను పీక్‌కు తీసుకెళ్లేలా చేశాయంటున్నారు చూసినవాళ్లు. బనీను ప్రదర్శనలతో రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేశారు హరీశ్‌రావు.
స్పీకర్ గాడు.. ఏ లం… కొడుకు అడ్డుకుంటాడు..?
పోలీసులపై కవ్వింపు చర్యలకు దిగడం మూలంగా..తమపై తిరిగి దాడి జరిగితే ఆ గాయాలను చూపి జనం కోస పోరాడే క్రమంలో సర్కార్ దమనకాండ ఇదీ అని చెప్పాలనేది బీఆరెస్ వ్యూహంగా ఉంది.పార్టీ మైలేజీ కోసమే ఇదంతా చేశారే తప్ప.. సభలోకి వెళ్లి అంశాల వారీగా, పథకాల వారీగా చర్చించాలనే ఉద్దేశ్యం బీఆరెస్ నేతల్లో కనిపించలేదు. పైగా స్పీకర్‌ను గాడు గీడు అని సంబోధిస్తూ..ఆయన తల్లిని కించపరిచేలా ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చేతలతోనే కాదు.. మాటలతో కూడా మరింత రచ్చ చేయాలనేదే వారి ఉద్దేశ్యంగా ఇక్కడ కనిపించింది. ఈ మాటలపై కనీసం ఆ పార్టీ నుంచి పశ్చాత్తాప వచనాలు కూడా రాలేదంటే.. వారి మదిలో ఎంత పక్కాగా ప్లానింగ్ రచించుకుని వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ నోరుజారిన వైనం తెలంగాణ రాష్ట్ర రాజకీయల్లో ఓ అనారోగ్య వాతావరణాన్ని నెలకొల్పింది.
అసమర్థ నేతల సమర్థింపు చర్యల ఫలితం..!
మరుసటి రోజు కూడా ఇదే తంతు కొనసాగింది. కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోగా.. కేటీఆర్, హరీశ్ లు ఇద్దరూ మధు మాటలను సమర్థించుకున్నారు. కేసీఆర్ కూడా దీన్ని లైట్ గా తీసుకున్నారనే విధంగా మాట్లాడిన కేటీఆర్.. విచారణ వ్యక్తం చేశాము కదా.. ఇంకా గొడవెందుకు? అని లైట్ తీసుకున్న వైనం.. పుండు మీద కారం జల్లినట్టే చేసింది.దీనికి కంటిన్యూగా కాంగ్రెస్ చేసిన ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సభలో చర్చ పక్కకు పోయి.. అసెంబ్లీ సెషన్స్ ముచ్చట మరిచి.. ఇలా రాజకీయాలు రోడ్డెక్కాయి. దీనికి ఆజ్యం పోసింది.. కంటిన్యూగా కవ్వింపులకు దిగింది కూడా బీఆరెస్సేనని అర్థమవుతోంది. మేమే వస్తాం.. మళ్లీ కేసీఆరే సీఎం అని ఫిక్సయిపోయినట్టున్నారు. అందుకే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే విధానాన్ని బీఆరెస్ అవలంభిస్తోందని అనుకోవాల్సి వస్తోంది. కానీ, ప్రతిపక్షంలో ఉండి కూడా.. అప్పటి అహంకారపూరిత దోరణే ఇంకా కొనసాగుతుందనే నెగిటివ్ కామెంట్స్‌ను ఆ పార్టీ పరిగణలోకి తీసుకునేలా లేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా దుందుడుకు, దూకుడు చర్యలకే కేటీఆర్ డైరెక్షన్‌లోని బీఆరెస్ ముందుకు సాగుతోందనేది స్పష్టమవుతోంది.