ఇప్పుడు ఈ వార్తెందుకు? అసందర్భమైతే కాదు. చాలా మందికి నేను చెప్పబోయే కథనం ముందే అర్థమైపోయి ఉంటుంది కూడా. కేసీఆర్ సభకు రావడం లేదు. ప్రతిపక్ష నేతగా ఇంకొకరికి అవకాశం ఇవ్వడం లేదు. పనిలో పనిగా హరీశ్ తదితరులు ఎన్టీఆర్ ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుంటున్నారు.
ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు కదా .. సాకులు వెతుక్కొని సమర్థింపు చర్యలకు దిగుతున్నారు. కానీ ఆనాడు ఏమి జరిగింది? ఎందుకు ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలకు దూరమయ్యాడు…? ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ మరోసారి దీనిపై క్లారిటీ ఇవ్వాలని ఉంది. సందర్భం కాబట్టి.
దివంగత నేత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 3 సంవత్సరాల పాటు అసెంబ్లీని బహిష్కరించి సభకు రాలేదు. 1989 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, సభలో స్పీకర్ వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, తనకు మైక్ ఇవ్వకుండా అవమానించారనే కారణంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
అంటే అప్పటికే ఆయన రెండేళ్లుగా జరిగిన సమావేశాలకు హాజరవుతూనే వస్తున్నారన్నమాట. కానీ మన కేసీఆర్ మాత్రం ఏదో మొక్కుబడిగా ఓసారి మాత్రమే బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హాజరు వేసుకుని వెంటనే వెళ్లిపోయారు. నాడు ఎన్టీఆర్ బాజాప్తా ప్రకటించి మరీ వెళ్లిపోయారు. 1991లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో తనకు మాట్లాడేందుకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఎన్టీఆర్ మండిపడ్డారు. సభలో జరిగిన అవమానానికి నిరసనగా, “మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగుపెడతాను.. అప్పటివరకు సభకు రాను” అని బాజాప్తాగా ప్రకటించి ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
ఇక్కడ కేసీఆర్‌కు అలాంటి అవమానాలేమీ జరగలేదు.ఆయన వస్తే చర్చించేందుకు రెడీగా ఉన్నామంటూ ప్రతిపక్షం ఆహ్వానిస్తూనే ఉంది. తాజాగా కేసీఆర్ దీనిపై స్పందించారు. బూతులు మాట్లాడే రేవంత్ ఉన్న సభకు నేను చర్చకు రావాలా? అని కుండబద్దలు కొట్టారు. అంటే ఇకపై తాను అసెంబ్లీకి వచ్చేదే లేదని చెప్పేశారన్నమాట. మరి ఇటు సభకు, అటు జనానికి దూరమైన కేసీఆర్.. ఎన్టీఆర్‌ను ఎలా ఆదర్శంగా తీసుకుంటారు.
ఆయనకు అప్పుడు జరిగిన తీరు వేరు.. స్పందించిన వైనం డిఫరెంటు. అన్నింటికీ మించి ఆయన సభకు రానని చెప్పిన మరునాటి నుంచే చైతన్య రథంతో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. జనంతోనే మమేకమై ఉన్నారు.వారి మద్దతు కూడగట్టి బ్రహ్మాండమైన విజయం సాధించి.. సీఎంగా మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. సభకు దూరమైన తరువాత ప్రతిపక్ష నేత బాధ్యతలను చంద్రబాబుకు అప్పగించారు ఎన్టీఆర్.
కానీ ఇక్కడ మాత్రం ఎవరికీ ఇవ్వలేదు కేసీఆర్. ఇంకా రికార్డుల్లో ఆయనే ప్రతిపక్ష నేతగా ఉంది. ఓ ప్రతిపక్ష నేతగా ఉన్న లీడర్ సభకు రాకపోతే.. వచ్చే నష్టమేమిటో.. కేసీఆర్‌కు బాగా తెలుసు.కానీ ఎవరి మీద అలక..? ప్రజల మీదా…? రేవంత్ నాయకత్వం మీదా…? తనకు తాను జాతిపితగా ప్రకటించుకున్న ప్రభావం వల్లా?