E-Paper
Advertisement

Telangana Gulf Victims: గల్ఫ్‌లో గోసలు.. గుండెలు పిండేసే జీవితాలు..

Telangana Gulf Victims: గల్ఫ్‌లో గోసలు.. గుండెలు పిండేసే జీవితాలు..

Telangana Gulf Victims: కాలం మారుతుంది.. కానీ, కంటతడి పెట్టించే గాధలు.. గుండెలు పిండేసే బాధలు మాత్రం మారడం లేదు.. కుటుంబం కోసం ఉన్న ఊరిని విడిచి దేశం కాని దేశానికి వెళ్లి.. నరకయాతన అనుభవిస్తున్నవారు ఎందరో.. ఒక్కోక్కరిది ఒక్కో కష్టం.. ఇంతకు ముందు గల్ఫ్ వాసుల వేదన అరణ్య రోదనే అయ్యేది. కానీ, ఇప్పుడు ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. తెలిసేది కొన్నే.. కానీ, తెలియాల్సింది చాలా ఉన్నాయి. మరీ వచ్చిన ఫిర్యాదుల పై ప్రభుత్వం ఏం చేయనుంది. ఇంకా ఎన్నాళ్లు ఈ వేదన..

గల్ఫ్‌కు వెళ్లేవారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. తమ కుటుంబానికి ఆసరాగా ఉండాలని కొందరు.. పిల్లల చదువులు సాఫీగా సాగాలని మరికొందరు.. నిలువ నీడకోసం ఒక ఇల్లు కట్టుకొవాలని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంతో దూరతీరాలకు వెళతారు. తినీతినక తింటారు. ఓవర్ టైంలు చేస్తూ ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచి పల్లెలకు పంపుతారు.

ఇంత కష్టపడుతున్నారు కదా.. ఎంత సంపాదిస్తున్నారు అంటే.. వెళ్లే చాలామందిలో కొందరివి తప్పితే చాలామందివి చిన్న జీతాలే. దీంతో వచ్చినవి పొదుపుచేసి పంపడం రెండేళ్లకో, ఐదేళ్లకో అయిన వారిని చూసి వచ్చి మళ్లీ పనిలో పడడం ఇదే కథ. కానీ ఈ ప్రయాణంలో ఇప్పుడు విషాదగాథలు ఎక్కువవుతున్నాయి.

ముందుగా కొన్ని లెక్కలు చూద్దాం. గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వచ్చి ఇరుక్కుపోయాం.. వేధింపులను ఎదుర్కొంటున్నాం.. మోసపోయాం.. నానా తిప్పలు పడుతున్నాం అని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఇది ఏదో నోటి మాటగా చెబుతుంది కాదు.. పార్లమెంట్ ముందుకు లెటెస్ట్‌గా ఓ రిపోర్ట్‌ వచ్చింది. ఆ రిపోర్ట్‌లోనే చాలా విషయాలు ఇప్పుడు బయటికి వచ్చాయి.

మిడిల్‌ ఈస్ట్‌లో ఉపాధి కోసం వెళ్లిన భారతీయుల్లో 16 వేల 127 మంది తాము చాలా సమస్యలు ఎదుర్కుంటున్నామని ఫిర్యాదులు చేశారు. ఇలా ఫిర్యాదులు వస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. మొత్తం 3 వేల 49 ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత ప్లేస్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఈ దేశంలో 1587 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఓమన్ నుంచి 613 ఫిర్యాదులు.. కువైట్ నుంచి 549 ఫిర్యాదులు వచ్చాయని రిపోర్ట్ చెబుతోంది.

ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వైర్‌డ్.. ECR అంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉద్యోగం చేయాలంటే ఇండియన్ పాస్‌పోర్ట్‌తో పాటు.. మనకి ఉద్యోగం ఇచ్చే కంపెనీకి సంబంధించిన వివరాలన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. ఇది స్కిల్ లేని.. సెమీ స్కిల్‌డ్‌ ఉద్యోగులకు రక్షణ కల్పిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ECR దేశాల్లో పనులు చేస్తున్న వారిలో తెలంగాణ వారే అధికం. గడచిన పదేళ్లలో ఒక్క మన రాష్ట్రం నుంచే 15 లక్షల మంది ఉద్యోగులు వివిధ దేశాల్లో వెళుతున్నారు.

ఫిర్యాదుల్లో ఎక్కువశాతం ట్రావెల్ ఏజెంట్లు చేసే మోసాలు ఉంటున్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఆ దేశంలో అడుగు పెట్టే వరకు ఒకలా.. పెట్టిన తర్వాత మరోలా ట్రీట్ చేస్తున్నారనేది దాని ఉద్దేశం. అంతేకాదు జీతాలు కూడా చెప్పినంతగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాదు.. పని చేసే ప్రదేశంలో కార్మికులకు ఎలాంటి భద్రత ఉవడటం లేదని.. పని ఒత్తిడి ఎక్కువ కావడంతో గాయాలు కావడం.. మరణాల సంఖ్య కూడా పెరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహాలను భారత్‌కు తిరిగి తీసుకురావడం ఓ పరీక్షగా మారింది.

ఈ గల్ఫ్ కష్టాలు ఎన్నటికీ తీరవు అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తూనే ఉన్నారు. తిరిగి వచ్చేద్దాం అనుకుంటే తిరిగి పంపే పరిస్థితి లేకపోవడంతో ఎడారి దేశాలకు వెళ్లిన బాధితులంతా తమ గోసను వీడియోల రూపంలో అందరికీ పంపుతున్నారు. బతుకుపై ఏదో ఒక ఆశ. ఎవరో ఒకరు తమను కనికరించకపోతారా అన్న చిన్న ఆలోచనతో వీడియోలు పంపేవారు అనేకం. మనం కూడా చూస్తున్నాం.. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసు చేసుకొని వారిని తిరిగి తీసుకురావడం. కానీ ఇలా ఎంత మందిని అని తీసుకువస్తారు? దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఉండాలి అనే డిమాండ్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది.

మాములుగా ఉపాధి కోసం దేశం విడిచి మరో దేశానికి వెళ్తున్నామంటే.. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది గల్ఫ్‌ దేశమైనా.. మరే దేశమైనా ఈ రూల్ వర్తిస్తుంది. పార్లమెంట్‌ రిపోర్ట్‌ ప్రకారం ఏజెంట్ల మోసాలు ఇంకా కొనసాగుతున్నాయని అర్థమవుతోంది. అయితే అధికారిక లెక్కలే ఇలానే ఉంటే.. అనధికారికంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం వెళ్లాలంటే పకడ్బందీగా సరైన పద్ధతిలోనే అన్ని అనుమతులు, పత్రాలతోనే వెళ్లాలి. కానీ గ్రామీణ ప్రాంతంలో అవగాహన లేక నకిలీ ఏజెంట్ల మాయలో పడి, వారి చెప్పుడు మాటలు విని, ఆశల పల్లకిలో డబ్బు ముట్టజెప్పి గల్ఫ్ ఫ్లైట్ ఎక్కుతుంటారు. అది ఏ వీసానో తెలియదు. వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. అదే అసలు సమస్య. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది భారత ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోరు. అందుకే ఎంబసీ నుంచి కూడా సరైన టైంలో సరైన సహకారం అందకుండా పోతోంది. మొదట ఈ పరిస్థితి మారాలి.

అసలు గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారు ఎలా మోసపోతున్నారో వన్ బై వన్ డీకోడ్ చేద్దాం. గల్ఫ్‌ వెళ్లాలనుకునే వారి అమాయకత్వాన్ని, బలహీనతను ఆసరాగా ఏజెంట్లు చేసుకోవడం దగ్గర్నుంచి సమస్య మొదలవుతుంది. ఇళ్లు, కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మీరు పెట్టిన ఖర్చు రెండు నెలల్లోనే తిరిగి వస్తుంది.. ఆ తర్వాత అంతా ఇంటికి పంపుకోవచ్చు అంటూ ఏజెంట్లు ఆశలు చూపిస్తుంటారు. నిజానికి ఎడారి దేశాలకు పొట్టకూటి కోసం వెళ్తున్న వారిలో చాలా మంది సరైన నైపుణ్యాలు లేని వారే ఉంటున్నారు. వారికి చట్టబద్ధంగా ఎలా వెళ్లాలి.. ఎక్కడ నమోదు చేసుకోవాలి వంటి విషయాలు తెలియవు. ఏజెంట్ చెప్పిందే ఫైనల్. అదే ఇప్పుడు అసలైన సమస్య.

సరైన వీసాలు, అనుమతులు లేకుండా వెళ్లిన వారికి అక్కడ గల్ఫ్‌లో యజమానులు అనుమతి ముద్ర వేస్తేనే ఆ దేశంలో ఉండేందుకు వీలవుతుంది. కొంతమంది యజమానులు కార్మికులను బాగానే చూసుకున్నా.. చాలా మంది నరకయాతన పెడుతుంటారు. ఫస్ట్ వారి దగ్గర్నుంచి పాస్‌పోర్టు తీసేసుకుంటారు. దీంతో కష్టమైనా, నష్టమైనా అక్కడే పని చేయాల్సి ఉంటుంది. తిండి సరిగా పెట్టక, జీతాలు ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడనివ్వరు. ఎలాగొలా తప్పించుకుని పారిపోయి బయటికొస్తే పాస్ పోర్ట్ లేని కారణంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తుంటారు. చాలామంది ఎడారుల్లో గొర్రెలు, ఒంటెలు కాపరులుగా ఒంటరిగా మగ్గిపోతున్నారు. ఉండటానికి నీడలేక ఎడారుల్లో వేసే గుడారాల్లో ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు.

అక్కడ పెట్టే టార్చర్ తో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, మరి కొంతమంది హత్యలకు కూడా గురవుతారు. చాలామంది అనారోగ్యంతో చనిపోతుంటారు. వీరిలో కొన్ని మృతదేహాలు స్వగ్రామం చేరుతుండగా, పాస్‌పోర్టు లేని మృతదేహాలు అనాథ శవాలుగా అక్కడే ఉండిపోతున్నాయి. అందుకే వీసా వచ్చిన వెంటనే దాన్ని ఏజెంట్ తో కాకుండా మరొకరితో అవసరమైతే పోలీస్ స్టేషన్ వెళ్లి క్రాస్ చెక్ చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతం వారికి అరబిక్, ఇంగ్లీష్ రాకపోవడంతో దాన్ని క్యాష్ చేసుకుంటున్న వారూ ఉండడంతో ఈ విషయంలో జాగ్రత్తలు అవసరం.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015 తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తగ్గింది. కానీ వెళ్లే వారు మాత్రం ఇంకా మోసపోతున్న వారు ఉన్నారు. అందుకే నకిలీ ఏజెంట్లను గుర్తించడం, జనంలో అవగాహన పెంచడం చాలా కీలకం. తెలంగాణలో కోరుట్ల, వేములవాడ, బాల్కొండ, జగిత్యాల, సిరిసిల్ల సహా ఉత్తర తెలంగాణకు చెందిన 21 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారు. అటు ఏపీలో కోనసీమ జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి వెళ్తున్నారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాన్నైతే మినీ గల్ఫ్ గా పిలుస్తారంటే ఏ స్థాయిలో వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఊరికో ఏజెంట్ చొప్పున పుట్టుకొచ్చారు.

విదేశాలకు వెళ్లిన వారి సంక్షేమం ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్ల సంక్షేమాన్ని చూసుకోవడం కేంద్ర, రాష్ట్రాల బాధ్యతే. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వాణిజ్య సంబంధాలకే ప్రాధాన్యత ఇస్తూ వలస కార్మికులను విస్మరిస్తున్నారనే వాదన ఉంది. చిన్న నేరాలకే చాలా మంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారని, వారికి సరైన న్యాయ సహాయం అందడం లేదనే ఆరోపనలు కూడా ఉన్నాయి. చాలా రోజులుగా గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఆ వైపుగా ఆలోచించలేదు.

కేరళలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక వ్యవస్థే ఉంది. అలాగే తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కేరళలో మాదిరిగా ముందస్తు నైపుణ్య శిక్షణ, గల్ఫ్ నుంచి వచ్చిన వారికి విస్తృత స్థాయిలో పునరావాసం, గల్ఫ్ రిక్రూటింగ్ ఏజన్సీల నియంత్రణ, కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కోరుతున్నాయి. బాధితులు రోజుకొకరు ఉండొద్దంటే తెలుగు రాష్ట్రాలు గల్ఫ్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలంటున్నారు.

Also Read: ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్.. మూడు వారాలు వెనక్కి.. న్యాయస్థానంలో ఏం జరిగింది?

గల్ఫ్‌లో పనిచేసే కార్మికులకు హెల్త్, యాక్సిడెంట్‌, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేట్ ఇవ్వాలని.. వారి కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలవాలని కోరుతున్నాయి వలసకార్మికుల గ్రూపులు. మరి ఈ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు ఆలకిస్తాయో చూడాలి.

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×