కనుమరుగు అవుతున్న కారును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కొత్త ప్రచారం మొదలు పెట్టారా ? దేవుడిని అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి విష ప్రచారానికి పూనుకున్నారా ? గత పదేళ్లు తిరుమలలో రాచమర్యాదలు పొందిన నేతలకు.. నాడు గుర్తు రాని విషయం.. ఇప్పుడు కొత్తగా ఎందుకు గుర్తొచ్చింది ? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఏపీ వాళ్లే లబ్ధి పొందారంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు ? మాజీ మంత్రి కామెంట్స్ ఓన్ గానే చెప్పారా ? గులాబీ బాస్ ఆదేశాలతోనే ఈ ప్లాన్ నడుస్తోందా.. వాచ్ థిస్ స్టోరీ.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లలో లబ్ధి పొందింది ఏపీ వాళ్లే.. కాంట్రాక్టర్లు వాళ్లే, బిల్డర్లు వాళ్లే, ఆర్థికంగా బలపడింది వాళ్లే.. టీటీడీ పాలకవర్గంలో మెంబర్లుగా ఇస్తే ఏం లాభం.. ఛైర్మన్ ఇస్తే ఏం లాభం.. ఇవి ఎవరో సామాన్య తెలంగాణ ప్రజలు అంటున్న మాటలు కాదు. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు… కాదు కాదు అన్నదమ్ముల లాగా కలిసి ఉంటున్న ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న విషప్రచారం.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన తరుణంలో.. బీఆర్ఎస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు.. అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నారు ప్రజలు. కానీ గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా వాళ్లే అయితే మరి మీరు ఏం చేశారనే కామెంట్స్ వస్తున్నాయి. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించారో మర్చిపోయి.. కాంట్రాక్ట్ ల విషయంలో తెలంగాణ ప్రజలను విస్మరించారా అని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ లు ఇవ్వడానికి తెలంగాణలో సమర్థులు లేరనుకున్నారా? ఉన్నా కూడా వారికి ఎందుకనుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి సొంత ప్రజలను పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని కోరుతున్నారట.
తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్..ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. ఓ వైపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవం.. మరోవైపు పార్టీలో కొనసాగుతున్న వలసల పరంపర.. బయటపడుతున్న నాటి బాగోతాలు.. కేసుల టెన్షన్ లు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఫాం హౌస్ దాటి బయటికి రాని పార్టీ అధినేత. అందుకే దేవుడిని అడ్డం పెట్టుకొని.. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి.. ఆ రకంగా అయినా పార్టీకి బూస్ట్ అప్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ కి వివరణ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ చెబుతారా? లేక వారిని ముందుండి నడిపించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెబుతారా? అని చర్చ జరుగుతోంది.
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు దర్శనాలు ఇవ్వడాన్ని గత వైసీపీ ప్రభుత్వం 2021లో అపి వేసింది. 21 నుంచి 23 వరకు అధికారంలో ఉన్న అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కాని.. ప్రజాప్రతినిధులు కాని ఏనాడు ఆ విషయంపై నోరు మెదపలేదు. జగన్ కు సన్నిహితులుగా పేరు పొందిన కేసీఆర్ కనీసం ప్రశ్నించలేదు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తిరుమలలో కనీసం కళ్యాణ మండపం కానీ, వసతి గృహం కానీ ప్రభుత్వం తరపున కట్టించాలని ఆలోచన చేయలేదని.. ఇప్పుడు అనూహ్యంగా ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం తిరుమలలో భేధాలు ఉన్నాయంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందనే టాక్ నడుస్తోంది.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే.. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సముచిత గౌరవం కల్పించాలను సీఎం సహా పలువురు ఎమ్మెల్యేలు సైతం వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం, టీటీడీ దృష్టికి కూడా కాంగ్రెస్ సర్కారు తీసుకువెళ్లింది. సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు కూడా.. ఎలాంటి హాడావుడి లేకుండా వచ్చారు. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరుపున కళ్యాణ మండపంతో పాటు వసతి గృహాన్ని కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇదే విషయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి సమావేశంలో కూడా ప్రస్తావించినట్టు వెల్లడించారు. అందుకు చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలానే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. సీఎం రేవంత్ ని కలిసినప్పుడు కూడా సిఫార్సు లేఖల అమశం చర్చకు వచ్చిందట. అయితే ఇవేమి పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు మాత్రము ఇప్పుడు తిరుమలలో.. భేధాలు ఉన్నట్టు మాట్లాడడం.. రాజకీయ లబ్ధికోసమేనని విమర్శలు వస్తున్నాయి.
2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తిరుమలకు వందలసార్లు స్వామివారి దర్శనానికి వచ్చారు. అప్పటి టీటీడీ పెద్దల సహకారంతో రాచమర్యాదలతో స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత.. మొదటిసారి తిరుమలకు దర్శనానికి వచ్చారు. ఆయన మిత్రుడైన అప్పటి టీడీపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రాచమర్యాదలతో మహా ద్వార దర్శనం చేయించారు. వైసీపీ హయాంలో కూడా అటు కేసీఆర్ కుటుంబం, హరీష్ రావుతో పాటు మిగతా మంత్రులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు జరిపించుకున్నారు. కానీ తెలంగాణకు సంబంధించి ఒక కళ్యాణ మండపం నిర్మించాలనే ఆలోచన కూడా చేయలేదని.. ఇప్పుడు మాత్రం తెగ హడావిడి చేస్తున్నారని చర్చ నడుస్తోంది.
ఇక ఇప్పటికే తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలో తీర్మానించింది. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధమని ప్రకటించారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీవారి ఆలయంలో రాజకీయ ప్రస్తావన తీసుకురావడంపై టీటీడీ మండిపడింది. ఆయనపై చర్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. శ్రీవారి క్షేత్రంలో రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read: రైతు భరోసాపై చర్చ.. కేటీఆర్ మాటలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
తెలంగాణలో కనుమరుగు అయ్యే స్థాయికి పడిపోయిన బీఆర్ఎస్.. బూస్ట్ అప్ కోసమే ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఈ తరహా విష ప్రచారానికి తెరలేపిందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ నోరు మెదపని నేతలు.. టీటీడీలో తెలంగాణ నేతలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని.. సత్సంబంధాలను పెంపొందించడానికి కృషి చేస్తుంటే విష ప్రచారం తగదని హిత బోధ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై వివరణ మాజీ మంత్రి ఇస్తారా? లేక బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చెబుతారా? అని డిస్కషన్ నడుస్తోంది.