Bollywood Actress: మాతృత్వం అనేది ప్రతి మహిళ కల.. ఈ మాతృత్వాన్ని పొందడానికి ఎన్నో సాహసాలు సైతం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మాతృత్వం పొందడానికి పరితపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేయకుండానే తల్లిదండ్రులవుతుంటే.. మరి కొంతమంది ఎన్ని కష్టాలు పడినా అమ్మ అని పిలిపించుకోవడానికి నోచుకోరు. ఇప్పుడు అధునాతన ప్రపంచంలో ఐ వి ఎఫ్, ఐ యు ఐ వంటి పద్ధతులు వచ్చినప్పటికీ వీటి ద్వారా సంతాన భాగ్యం కలుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.. ఈ ఐవిఎఫ్ ద్వారా ఏకంగా ఐదవ సారి కూడా గర్భం కోల్పోయి తనను తాను మానసికంగా మరింత ఇబ్బందులకు గురవుతోంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సంభావన సేథ్ (Sambhavana Seth)..
గర్భం కోసం పరితపిస్తున్న ప్రముఖ బ్యూటీ..
ప్రముఖ బాలీవుడ్ నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ పిల్లల కోసం తెగ ఆరాటపడుతోంది. సహజంగా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఆశ్రయించింది. ఇప్పటికే నాలుగు సార్లు ఐవీఎఫ్ ప్రక్రియ ఫెయిల్ అయినప్పటికీ మరొకసారి ప్రయత్నం చేసింది. అయితే ఐదవ సారి కూడా నిరాశ మిగలడంతో ఆమె బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అమ్మ అని పిలిపించుకోవడానికి ఆమె పడే తాపత్రయం ఆమెను ఇంతవరకు తీసుకొచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఇకపోతే ప్రెగ్నెన్సీ ధరించిన మొదటి మూడు నెలల్లోనే గర్భస్రావం అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంభావన, తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానల్ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది.
మూడు నెలల్లోనే 65 ఇంజక్షన్లు..
మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 12 వారాల తర్వాత ఇలా జరిగింది అంటూ ఆమె ఏడ్చేసింది. నా భర్త అవినాష్ ద్వివేది (Avinash Dwivedi) కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నాడు. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది అంటూ విచారం వ్యక్తం చేసింది. ఇక ఈ విషయంపై సంభావన మాట్లాడుతూ..”నా బిడ్డను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. కేవలం మూడు నెలల్లోనే 65 ఇంజక్షన్లు కూడా తీసుకున్నాను. అయితే గర్భం నిలబడడానికి ఇన్ని ఇంజక్షన్లు తీసుకోవాలని నాకు తెలియదు. నాకు రోజుకు మూడుసార్లు ఇంజక్షన్ ఇచ్చేవారు” అంటూ ఆమె బాధపడింది. ఇక ఇదే విషయంపై ఆమె భర్త మాట్లాడుతూ..మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఫలితం దక్కలేదు అంటూ బాధపడ్డారు.
సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడ్డ సంభావన..
ఇకపోతే ఈ ఐవిఎఫ్ పద్ధతి కారణంగా సంభావన సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడినట్లు సమాచారం. ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతోందట. తన బాధను అభిమానులతో పంచుకుంటూ ఎమోషనల్ అయిన ఈమె, సడన్గా ఈమెలో కనిపిస్తున్న మార్పులు చూసి కూడా అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంభావన బాధ చూసి భగవంతుడు మీపై అనుగ్రహం కలిగిస్తే, తప్పకుండా మీరు తల్లిదండ్రులవుతారు. దయచేసి వీటి బారిన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా సంభావన బాధ వర్ణనాతీతం అని చెప్పడంలో సందేహం లేదు.