BigTV English

Trump vs NATO Countires: ఉక్రెయిన్‌కు యూకె సాయం.. ట్రంప్‌పై నాటో దేశాలు తిరుగుబాటు.?

Trump vs NATO Countires: ఉక్రెయిన్‌కు యూకె సాయం.. ట్రంప్‌పై నాటో దేశాలు తిరుగుబాటు.?

Trump vs NATO Countires: అమెరికాలో ట్రంప్ రాకతో… ప్రపంచ రాజకీయాలు ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా, అమెరికా తర్వాత వెస్ట్‌లో వైట్ సుప్రిమసీని కొనసాగించే.. యూరప్ దేశాలు ఇప్పుడు ట్రంప్‌పై తిరుగుబాటుకు సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఉక్రెయిన్ వ్యవహారంలో ట్రంప్ తీరును తప్పుపడుతున్న యూరప్.. ఈయూ దేశాల సెక్యూరిటీ ఆందోళనలను ట్రంప్ పట్టించుకోవట్లేదంటున్నాయి. ఇప్పుడు.. ట్రంప్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈయూ దేశాలు ఫ్రాన్స్‌లో మీట్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యూరప్, అమెరికా మధ్య గ్యాప్ మరింత పెరుగుతుందా..? నాటో దేశాలు అమెరికాను వదిలేసి సొంత కుంపటి పెట్టుకోగలవా..? రష్యాకు ధీటుగా సైన్యాన్ని తయారు చేస్తాయా..?


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ట్రంప్ మధ్యవర్తిత్వం

ప్రపంచ వైట్ సుప్రిమసీలో చీలకలు వస్తున్నాయా..? తాజా పరిస్థితులు చూస్తుంటే.. నిజమే అనిపిస్తోంది. ప్రపంచ పెద్దన్నగా అమెరికాలో ట్రంప్ రాక.. అంతర్జాతీయంగా అనూహ్యమైన మార్పులకు కారణం అయ్యింది. ప్రెసిడెంట్ ట్రంప్ టారీఫ్‌ల థ్రెట్ నుండీ.. నాటో సైనిక ఖర్చుల వరకూ యూరప్‌ను ముప్పు తిప్పలు పెట్టడానికి రెడీ అయ్యారు. అసలు ఎన్నికలు గెలవడానికి ముందు నుండే యూరప్‌ను బెదిరించడం మొదలు పెట్టారు ట్రంప్. నాటోకి కేటాయింపులు పెంచని యురోపియన్ దేశాలపై రష్యాను ఉసిగొల్పుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ మొదలైన ఈ రెవల్రీ ఇప్పుడు మరింత రాజుకుంది.


ఫిబ్రవరి 17న పారిస్‌లో ఈయూ భద్రతా శిఖరాగ్ర సమావేశం

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో.. మధ్యవర్తిత్వానికి రెడీ అయిన ట్రంప్.. ఒంటి పోకడతో.. యూరప్ పెత్తనం అవసరంలేదని చెప్పారు. అంతేనా.. అవసరమైతే అభిప్రాయాలు తెలియజేయండి కానీ.. తగుదునమ్మా అని నిర్ణయాలు తీసుకోవద్దూ అంటూ రుబాబు చేశారు ట్రంప్. యూరప్‌తో సంబంధిం లేకుండా సౌదీలో రష్యా అధికారులతో మంతనాలు మొదలుపెట్టారు. దీనితో… యురోపియన్ దేశాలు ఈగోపై బాంబ్ వేసినట్లయ్యింది. యూరప్ నాయకుల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపధ్యంలో.. ఫిబ్రవరి 17న పారిస్‌లో హడావిడిగా యూరోపియన్ యూనియన్ భద్రతా శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు.

ట్రంప్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై యూరప్ అసంతృప్తి

ఉక్రెయిన్ ఫ్యూచర్ గురించి రష్యాతో చేస్తున్న చర్చలకు అమెరికా తమను ఆహ్వానించకపోవడంతో యూరప్ దేశాలు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు… యూరప్‌పై కక్ష్యగట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను “అతి త్వరలో” కలవనున్నానని డొనాల్డ్ ట్రంప్ అనడం.. అదీ, తమ భద్రతా ఆందోళనలను అస్సలు పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై యూరప్ నిప్పులు చేరుగుతోంది. అయితే, అమెరికాకు ఎదురెళ్లడానికి యూరప్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే, ఒత్తిడిలో ఉన్న యూరప్.. తమ రాజకీయ విభేదాలు, దేశీయ ఆర్థిక ఆందోళనలను పక్కనపెట్టి.. భద్రతా వ్యయాన్ని పెంచుతూ.. ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఒకే తాటిపైకి ముందుకు వస్తాయా అన్నది చర్చనీయాంశమయ్యింది.

యూరప్ అమెరికాకు ఎదురెళితే ట్రంప్ ఏం చేస్తారో అనే చర్చ

అలాగే, వీళ్లంతా కలిసి ఉక్రెయిన్‌కు సాయంగా దళాలను పంపడం సాధ్యమేనా అనే సందేహాలు వస్తున్నాయి. ఉక్రెయిన్ వ్యవహారంలో మొదలైన చర్చల టేబుల్‌పై తమను తాము బలవంతంగా ఉంచుకోవడానికి యురోపియన్ యూనియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయా అనిపిస్తోంది. ఇక, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురాడానికి ప్రయత్నిస్తేనే.. బ్రిక్స్ దేశాలపై గుర్రుమన్న డొనాల్డ్ ట్రంప్.. అలాంటిది, యూరప్.. అమెరికాకు ఎదురెళితే.. ట్రంప్ ఏం చేస్తారో అనే చర్చ జరుగుతుంది. ఈ నేపధ్యంలో.. వచ్చే నాలుగేళ్లూ.. యూరప్‌ వర్సెస్ ట్రంప్‌లా ప్రపంచ రాజకీయాలు మారాతాయా అనే డౌట్ వస్తోంది.

ఉక్రెయిన్‌కు సాయంగా సైన్యం మోహరించడానికి యూకె సిద్ధం

ఫిబ్రవరి 17న యూకె ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు సాయంగా సైన్యాలను మోహరించడానికి యూకె సిద్ధంగా ఉందని అన్నారు. ఇక, యూరప్‌లో అతిపెద్ద దేశంగా ఉన్న జర్మనీతో పాటు స్వీడ‌న్ కూడా త‌మ పీస్‌కీపింగ్ ద‌ళాల్ని ఉక్రెయిన్‌లోనే ఉంచ‌నున్నట్లు తెలిపాయి. నిజానికి, రష్యాతో ట్రంప్ చేసే చర్చల ద్వారా ఉక్రెయిన్ భవిష్యత్తును ఏం చేయాలన్నది 100% ఖచ్చితంగా ట్రంప్‌కి తెలియదు. అందుకే, అమెరికా మిత్రదేశాలైన యూరప్‌ ప్రమేయంతోనే సరైన నిర్ణయం జరుగుతుందని యూరప్ భావిస్తోంది.

అమెరికాని యూరప్‌కు భాగస్వామని ఒప్పించడం ఈయూకి అవసరం

ఇప్పటి వరకూ అమెరికాను అడ్డం పెట్టుకొని రష్యా దగ్గర కాలర్ ఎగరేస్తున్న యూరప్‌ దేశాలకు ఈ సందర్భం మరింత క్లిష్టంగా మారింది. అమెరికా అధ్యక్షుణ్ని యూరప్‌కు భాగస్వామి అని ఒప్పించడం అత్యవసరంగా మారింది. దానికి ఒక చిన్న అవకాశం కోసం వేచి చూస్తున్న యూరప్‌కు ట్రంప్ తీరు అడ్డంగా మారింది. అందుకే, పారిస్ సమావేశం ద్వారా ట్రంప్‌ను ఎలా తమ వైపుకు తిప్పుకోవాలా అనే ప్లాన్ చేస్తోంది యూరప్. ఇక, డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసిన రెండు ప్రధాన అంశాలపై యూరప్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

జిడిపిలో 2% నాటోలో ఖర్చు చేయాలని యూఎస్ డిమాండ్

నిజానికి ఉక్రెయిన్‌ పోరాటంతో సంబంధం లేకుండానే నాటో కూటమి దేశాలు జిడిపిలో రెండు శాతం మొత్తాలను నాటో కోసం ఖర్చు చేయాలని ఎప్పటి నుంచో యూరప్ పైన అమెరికా ఒత్తిడి తెస్తోంది. యూరప్ రక్షణకు అమెరికా ఎందుకు మూల్యం చెల్లించాలని మొదటిసారి అధికారంలో ఉన్నపుడే ట్రంప్‌ ప్రశ్నించారు. అయితే, రెండోసారి గద్దెనెక్కిన తర్వాత.. ఇప్పుడు కనీసం 5 శాతం నాటోపై కూటమి దేశాలు ఖర్చచేయాలని అంటున్నారు. అయితే, ఇప్పటి వరకూ నాటో దేశాల రక్షణ ఖర్చును అమెరికా దాదాపు 3.5 శాతం పెడుతుంటే.. రష్యాతో సరిహద్దును పంచుకునే పోలండ్, బాల్టిక్ దేశాలు కూడా తమ సైనిక బలగాలపై రెండు శాతాన్ని మించి ఖర్చు చేస్తున్నాయి.

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లు 2% కన్నా తక్కువ ఖర్చు

యూకే 2 శాతానికి కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఇక, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ 2023లో రెండు శాతం లక్ష్యం కన్నా తక్కువగా ఖర్చు చేశాయి. అయితే, రక్షణ రంగంపై తగినంత ఖర్చు చేయని నాటో సభ్య దేశాలపై దాడులు చేయాల్సిందిగా రష్యాను ప్రోత్సహిస్తానంటూ ట్రంప్ గతేడాది ఫిబ్రవరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదంతా రష్యాను బూచిగా చూపించి, యూరప్‌ను తన అధీనంలో ఉంచుకోడానికి ఎప్పటి నుండో అమెరికా ఆడుతున్న ఆట ఇది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత… యూరప్‌కి కూడా మరో దారి కనిపించలేదు.. నాటోలో మాకు స్థానం కావలాంటే మాకు కావాలంటూ… యూరప్‌లోని దేశాలన్నీ క్యూ కడుతున్నాయి.

నాటోలో ప్రస్తుతం 32 సభ్యదేశాలు

నాటోలో ప్రస్తుతం 32 సభ్యదేశాలు ఉన్నాయి. 1991లో సోవియట్ యూనియన్ పతనానంతరం తూర్పు యూరప్‌లోని అనేక దేశాలు నాటో కూటమిలో చేరాయి. అల్బేనియా, బల్గేరియా, హంగరీ, పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, లిథువేనియా, లాత్వివా, ఈస్టోనియా దేశాలు నాటో పంచన చేరాయి. ఇక, ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర తర్వాత 2022లో స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దశాబ్దల తరబడి ఈ రెండు దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఇక, రష్యాతో 13 వందల 40 కిలోమీటర్ల పొడవున సరిహద్దు కలిగిన ఫిన్లాండ్ 2023లో నాటోలో చేరింది.

రష్యాతో 1,340 కి.మీ. పొడవు సరిహద్దు కలిగిన ఫిన్లాండ్

ఇక, 2024లో స్వీడన్ కూడా చేరింది. అయితే, స్వీడన్ చేరికను మొదట టర్కీ, హంగరీ వ్యతిరేకించినా చివరకు అంగీకరించాయి. స్వీడన్, ఫిన్లాండ్ చేరడం వల్ల 1990 తర్వాత నాటో భారీ విస్తరించినట్లయ్యింది. ఈ రెండు దేశాల నుంచి మిత్రరాజ్యాల సైన్యానికి మూడు లక్షల మంది సైన్యం జత కలిసినట్టయింది. ఇక, ఉక్రెయిన్, బోస్నియా, హెర్జ్‌గోవ్నియా, జార్జియా కూడా త్వరలో నాటోలో చేరడానికి ఆరాటపడుతున్నాయి.

ఉక్రెయిన్, బోస్నియా, హెర్జ్‌గోవ్నియా, జార్జియా వెయిటింగ్

నాటోలో ఉక్రెయిన్ చేరిక అనివార్యమని, కానీ రష్యాతో యుద్దం ముగిసేవరకు అది సాధ్యపడదని గతేడాది నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా నాటోలో చేర్చుకోవాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. అయితే, నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా వ్యతిరేకిస్తూనే ఉంది. ఉక్రెయిన్ చేరితే నాటో దళాలు తమ దేశ సరిహద్దు వరకు వచ్చేస్తాయని రష్యా చెబుతోంది. అందుకే, ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలుపెట్టింది.

యూరప్‌‌ విషయంలో కక్ష్య గట్టినట్లు ట్రంప్ వ్యవహారం

ట్రంప్ ప్రెసిడెంట్‌గా రెండోసారి పదవి చేపట్టిన తర్వాత.. పలు వివాదస్పద వ్యాఖ్యలతో ప్రపంచమంతా తనవైపు చూసేలా చేసుకున్నారు. ముందు, పనామా, మెక్సికో, కెనడాలను యునైటెడ్ స్టేట్స్‌లో చేర్చుకుంటామని చెప్పారు. అంత్య కీలక వ్యూహాత్మక ప్రాంతమైన గ్రీన్‌ లాండ్‌ను ఆక్రమించుకుంటానని కూడా అన్నారు. అయితే, ప్రస్తుతం ఐరోపా దేశమైన డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్ లాండ్‌ను స్వాధీనం చేసుకోవడం అంత సులువైన పని కాదు. ఇప్పుడు.. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన డెన్మార్క్, నాటో కూటమిలో సభ్యదేశంగా ఉన్న కెనడాలకు ట్రంప్ అంటే కాలిపోతోంది.

ఉక్రెయిన్ లేకుండా ఎటువంటి నిర్ణయాలు ఉండవన్న యూరప్

ఇలా, యూరప్‌‌ విషయంలో అన్ని వైపుల నుండీ కక్ష్య గట్టినట్లు ట్రంప్ వ్యవహారం ఇటీవల కాలంలో మరింత వివాదస్పదంగా మారింది. ఇప్పుడు కూడా యూరప్ నాయకులు ఉక్రెయిన్‌ను కాల్పుల విరమణ చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. “ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ గురించి ఎటువంటి నిర్ణయాలు ఉండలేవు” అనే అభిప్రాయాన్ని వారు చాలా కాలంగా చెబుతున్నారు. మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇదే అన్నారు. “మా ప్రమేయం లేకుండా మా వెనుక జరిగే ఒప్పందాలను మేం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తే లేదు” అని జెలన్స్కీ స్పష్టంగా చెప్పారు.

యూరప్ సొంత సాయుధ దళాలను ఏర్పాటు చేయాల్సిన సమయం

యూరోపియన్ యూనియన్ తమ సొంత సాయుధ దళాలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో కూటమి దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని తెలిపారు. రష్యాపై తమ దేశం చేస్తున్న పోరాటమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్సు‌లో భాగంగా జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై అమెరికా, యూరప్‌కు సహాయం చేయడానికి నిరాకరించే అవకాశాలను తోసిపుచ్చలేమని అన్నారు.

రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌కు సైన్యాన్ని పంపాలనే ప్లాన్

కాబట్టి యూరప్‌కు సొంత సైన్యం అవసరమని చాలా మంది అభిప్రాయపడుతున్నారనీ.. ఇప్పుడు ఆ టైం వచ్చిందని జెలెన్స్కీ అన్నారు. యూరప్, అమెరికా మధ్య ఉన్న చిరకాల బంధం ముగింపు దశకు చేరుకుందని, ఈ విషయాన్ని యూరప్ దేశాలు అర్థం చేసుకోవాలని ఇటీవల అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల్ని జెలన్స్కీ మ్యూనిచ్‌లో జరిగిన భద్రత సదస్సుల్లో గుర్తు చేశారు. ఇక, శిక్షణా విన్యాసాల సాకుతో రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌కు సైన్యాన్ని పంపాలని యోచిస్తోందని.. ఇది నాటో దేశాలకు ప్రమాదమని హెచ్చరించారు.

ట్రంప్ ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు

అయితే, ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరడంలో విఫలమైతే దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందన్నారు ప్రెసిడెంట్ జెలెన్స్కీ. అమెరికా సైనిక మద్దతు లేకుండా తమ దేశం రష్యాను ఎదుర్కోలేదని ఒప్పుకున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ట్రంప్, సైనిక సహాయాన్ని అపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీలతో ఫోన్‌లో మాట్లాడారు.

ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలపై ఫ్రాన్స్, యూకేలు ఆగ్రహం

చర్చలు జరిపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్‌కు మాత్రం నాటో సభ్యత్వం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే, యుద్ధం తర్వాత నాటోలో ఉక్రెయిన్ భాగం అవుతుందని ఒకవైపు నాటో హామీ ఇస్తుంటే.. ఏక పక్షంగా.. ట్రంప్ నిర్ణయాలు తీసుకోవడంపై ఫ్రాన్స్, యూకేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే, ఉక్రెయిన్ నాటోలో చేరాలని పట్టుబడుతుంది. ఈ డిమాండ్‌ను ఉక్రెయిన్ విడిచిపెట్టే స్థితిలో లేదని స్పష్టం చేసారు జెలెన్స్కీ.

యూరప్ రక్షణకు ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వట్లేదన్నది స్పష్టం

అయితే, ట్రంప్ వ్యవహార శైలి ఉక్రెయిన్ కంటే యూరప్‌కు ఎక్కువ ప్రమాదకరం. ట్రంప్ తీరు.. యూరోపియన్ భాగస్వాములకు, వారి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక విధంగా మోసపూరితమైన పని అయినప్పటికీ.. జెలన్స్కీలా చాలా మంది దీన్ని ముందుగానే ఊహించారు. నిజానికి, రెండవ ప్రపంచ యుద్ధం నుండి యూరప్.. అమెరికా అందించిన సెక్యూరిటీ గొడుగుపైనే ఆధారపడింది. అయితే, తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా-యుఎస్ చర్చల నేపధ్యంలో.. పుతిన్‌కు ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యత యూరప్ భద్రతా నిర్మాణాన్ని మారుస్తుందని యూరోపియన్ యూనియన్ భయపడుతోంది.

రష్యా సీజ్ ఫైర్‌ ఒప్పందాన్ని అతిక్రమిస్తే ఏం చేయాలనే ప్రశ్న

దీనికి తోడ.. ట్రంప్‌ను ఎలాగొలా తమ వైపు తిప్పుకోడానికి యూరప్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. తమ సైన్యాలను ఉక్రెయిన్‌కు పంపాలని అనుకున్నా.. ఇప్పటికే పలు దేశాల్లో ప్రజలు ఇచ్చింది చాలు ఇక ఆపండంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య ఒకవేళ, అమెరికా చర్చలు ఫలించిన తర్వాత రష్యా సీజ్ ఫైర్‌ ఒప్పందాన్ని అతిక్రమిస్తే.. యూరప్ ఏం చేయాలన్నది ప్రశ్నార్థకంగా ఉంది..? పోనీ, రష్యాపై యుద్ధం ప్రకటిస్తే.. దానికి అమెరికా సపోర్ట్ ఉంటాందా లేదా అనేది సందేహం. ఇన్ని అనుమానాల మధ్య యూరప్ ఎటూ నిర్ణయించుకోలేని సందిగ్థంలో కొట్టుమిట్టాడుతోంది.

ఇటలీ ప్రధాని మెలోనిని యూరప్ ప్రతినిథిగా పంపే ప్లాన్

ఇక, పారిస్ సమావేశం తర్వాత యూరప్ తన వాదనను వినిపించడానికి అమెరికాకు ఒక రాయబారిని పంపడం కోసం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో… ట్రంప్‌కు కాస్త దగ్గరగా ఉండే ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని యూరప్ ప్రతినిథిగా పంపే ప్లాన్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ కొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. యూరప్, యుఎస్ మధ్య వారధిగా వ్యవహరించడానికి ఇది ఆయనకు అవకాశం కావచ్చని విశ్లేషకులు అంటున్నారు. బ్రిటన్ బ్రెక్సిట్‌ తర్వాత సంబంధాలను మరింత చక్కదిద్దుకోడానికి యూకేతో పాటు ఇతర యూరోపియన్ నాయకులకు పారిస్ సమావేశం అవకాశాన్ని అందిస్తుందనే అభిప్రాయం ఉంది.

యూరోపియన్ యూనియన్‌లో తీవ్రమైన చీలక వచ్చే ఛాన్స్

అయితే, యూకే లాగా కాకుండా.. తన నిఘా, భద్రతా సేవల్లో అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఫ్రాన్స్ మాత్రం తాడో పేడో తేల్చుకోడానికి రెడీ అవుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అవసరమైతే.. అమెరికాను ఒంటరి చేస్తూ.. నాటో దేశాలన్నింటినీ ఏకతాటి పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటాను అనే లెవల్లో ఫ్రాన్స్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. యూరోపియన్ యూనియన్‌లో తీవ్రమైన చీలక వస్తుంది. ఇది, ఇప్పటికే ఒత్తిడికి గురౌతున్న యూరప్‌ను మరింత బలహీనంగా మారుస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఆరు అంశాలతో ప్రశ్నా పత్రాన్ని యూరప్ పంపిన ట్రంప్

అయితే, ఉక్రెయిన్ విషయంలో రష్యాతో శాంతి చర్చలకు సిద్ధపడిన ట్రంప్.. యూరప్‌ను రెచ్చగొట్టే విధంగా ఒక పనిచేశారు. శాంతి పరిష్కారంలో భాగంగా ఏ దేశాలు ఉక్రెయిన్‌కు దళాలను మోహరించడానికి సిద్ధంగా ఉంటాయి..? రష్యాపై ఆంక్షలను పెంచడానికి ఏ ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి..? వాటిలో ఇప్పటికే ఉన్న వాటిని మరింత కఠినంగా అమలు చేయడం వంటి ఆరు అంశాలపై ప్రశ్నలతో కూడిన ఒక పత్రాన్ని అమెరికా యూరోపియన్ మిత్రదేశాలకు పంపింది. అయితే, నాటోలో అమెరికా రాయబారిగా ఉన్న జూలియాన్ స్మిత్ దీనిపై స్పందిస్తూ.. ఇలాంటి సంక్లిష్టమైన దౌత్య పనికి సాధారణంగా వారాల తరబడి సమావేశాలు జరుగుతాయనీ.. ఇలా ప్రశ్నాపత్రాలు నింపినంత మాత్రాన పరిస్థితిని చక్కదిద్దడం సాధ్యం కాదని అన్నారు.

ప్రశ్నాపత్రాలు నింపితే పరిస్థితి చక్కబడదనే కామెంట్స్

ఇక, పారిస్‌లో యూరప్ నాయకులు ఏది సాధించినా, ఉక్రెయిన్‌పై చర్చల్లో సీటు సాధించకపోతే.. అది యూరప్‌ సూసైడ్ చేసుకున్నట్లే అనుకోవాలి. ఇప్పుడు యూరప్ ముందున్న దారి… చివరి నిర్ణయం తీసుకోడమే. ముఖ్యంగా, భద్రతా పరంగా ఉక్రెయిన్ నుండి.. లేకపోతే.. యూరప్ నుండే దూరంగా ఉండాలని అమెరికా ప్లాన్ చేస్తే.. యూరప్ కచ్ఛితంగా తమ రక్షణ కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తమ సైన్యాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే, అమెరికా అడ్డులేకపోతే… రష్యాను ఆపడం ఎవరి తరం కాదు. దానికి, యూరప్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×