Tirumala News: హైకోర్టులో చీవాట్లతో పరాకామణి కేసుపై దృష్టి పెట్టింది ఏపీ సీఐడీ. విచారణ కోసం రాత్రి తిరుమలకు చేరుకున్నారు సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్. తిరుమల వన్ టౌన్‌లో ఆ కేసుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసుు సంబంధించిన వివరాలు సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు బుధ లేదా గురువారాల్లో సమర్పించనున్నారు ఆయన.
ఏపీ పోలీసులపై కోర్టు ఆగ్రహం
ఏపీ వ్యాప్తంగా దుమారం రేగింది టీటీడీ పరకామణిలో అక్రమాలు. ఈ వ్యవహారంపై లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్న ఘటనకు సంబంధించి రికార్డులను సీజ్ చేయాలని గత నెలలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసివేయడం మంచిదని సలహా ఇచ్చింది.
అంతేకాదు డీజీపీ నిద్రపోతున్నారని వ్యాఖ్యానించింది కూడా. అధికారులు లేదన్న కారణంతో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయరా అంటూ ప్రశ్నలు లేవనెత్తింది. రికార్డులను సీజ్ చేయమని ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా తాత్సారం చేయడంపై మండిపడ్డింది. సీఐడీలో ఐజీ పోస్టు లేదనే కారణంతో ఆదేశాలు అమలు చేయరా అని ప్రశ్నించింది కోర్టు.
ALSO READ: జోగి రమేష్ కు ఉచ్చు బిగిసినట్టేనా? ఇప్పుడు జైలుకి వెళ్లడం ఖాయమా?
నిబద్ధత ఉంటే ఐజీ స్థాయి అధికారిని నియమించి రికార్డులు సీజ్ చేయమని డీజీపీ ఆదేశాలు ఇచ్చేవారని అభిప్రాయపడింది. కేసులపై వేగంగా స్పందించాలో తెలియడం లేదని చెప్పింది. ఇంతకీ పోలీసు వ్యవస్థ పని చేసేది ఇలాగేనా? అంటూ ప్రశ్నించింది. కేసుకున్న ప్రాముఖ్యత గురించి కానిస్టేబుల్‌కీ తెలుసని, ఎలా వ్యవహారించారో పోలీసు అధికారుల చర్యలు చెబుతున్నాయని తెలియజేసింది.
కేసు దర్యాప్తునకు కీలకమైన ఆధారాలను తారుమారు చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది. నిందితులకు సహరించేలా పోలీసులు చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి సమయంలో పోలీసుశాఖను మూసివేయడం మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేసుకి సంబంధించిన రికార్డులు వెంటనే సీజ్ చేసి తదుపరి విచారణకు తమ ముందుంచాలని సీఐడీ డీజీని ఆదేశించింది. విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది న్యాయస్థానం.
అసలు మేటరేంటి?
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకల (పరకామణి)పై కుంభకోణం జరిగింది. దీనిపై ఓ జర్నలిస్టు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరకామణిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి రవికుమార్ డాలర్లు, నగదు, బంగారాన్ని అపహరించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి రెండేళ్ల కిందట తిరుమల వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆలయ అధికారుల అనుమతి లేకుండా 2023లో లోక్ అదాలత్ వద్ద అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి-రవికుమార్‌ల మధ్య రాజీ జరిగిందని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పరకామణి నుంచి నగదు అపహరణ వ్యవహారంపై లోక్‌అదాలత్ వద్ద రాజీ చేసుకోవడాన్ని తప్పుబట్టింది.
గతంలో లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రొసీడింగ్స్‌ను వెంటనే స్వాధీనం చేసుకుని వాటిని సీల్డ్ కవర్‌లో కోర్టు ముందు ఉంచాలని సీఐడీని ఆదేశించిన విషయం తెల్సిందే.